*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*358 వ రోజు*
*పాండవ సేనలో కలకలం*
ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! ద్రోణుడు మరణించగానే చెదిరి పోయిన కౌరవసేన తిరిగి యుద్ధానికి సమాయత్తం కావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందుకు కారణం ఏమిటి. కౌరవసేనలో ఆనందం మిక్కుటంగా ఉంది. మనము ద్రోణుడిని చంపామని ఆగ్రహించి నీ తండ్రి ఇంద్రుడు దేవసైన్యంతో మనమీదకు యుద్ధానికి వచ్చాడా ! " అన్నాడు.
*అర్జునుడు ధర్మరాజాదులకు అశ్వత్థామ గొప్పదనాన్ని తెలుపుట*
అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! అస్త్రసన్యాసం చేసిన ఆచార్యుని అధర్మంగా వధించిన వారిని అశ్వత్థామ వదిలుతాడా ! అతడి వద్ద దివ్యాస్త్ర సంపద ఉంది. అతడు సహజంగా మహాద్భుత శౌర్య సంపన్నుడు. ఈ సమయంలో అతడిని ఎదుర్కొనుట చాలా కష్టం. అన్నయ్యా ! అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్రవము మాదిరి సకిలించాడట. అప్పుడు ఆశరీరవాణి అందరూ వింటుండగా ఆ బాలుడు అశ్వత్థామ అనే పేరొతో వర్ధిల్లగలడు అని పలికిందట. ఇప్పుడు కౌరవ సేన విజృంభణకు అశ్వత్థామయే కారణం. ఎప్పుడూ పాపం చేసి ఎరగని ఓ ధర్మరాజా ! నిన్ను తన శిష్యుడని, సత్యం పలుకుతావని, ధర్మం తప్పని వాడివని అత్యంత ఆదరంతో ద్రోణుడు తన కుమారుడి మరణం గురించి అడిగాడు. కాని నీవు ధర్మహానికి తలపడి అశ్వత్థామ మరణించాడని అసత్యం పలికావు. అది నమ్మి ద్రోణుడు అస్త్రసన్యాసం చేసాడు. ఇంత అధర్మానికి పాల్పడి రాజ్యం సంపాదించడం అవసరమా ! లోకం దూషించదా ! ఇందు వలన పొందిన సంపద మనకు ఆనందాన్ని ఇస్తుందా ! అది అధర్మము, వద్దు అని మనం అరుస్తున్నా వినక ఆ ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి జుట్టు పట్టుకుని తల నరకవచ్చా ! అది అధర్మం కాదా ! మనం ఇలా ధర్మ విరుద్ధమైన పనులు చేసిన అతడి కుమారుడు అశ్వత్థామ మనపై ఆగ్రహించి యుద్ధం చేయక మానుతాడా ! మన సేనలను సర్వనాశనం చేయడానికి అశ్వత్థామ ఉగ్రుడై వస్తున్నాడు సిద్ధం ఉండండి. అయినా అతడి బారి నుండి ధృష్టద్యుమ్నుడిని కాపాడటం నీకూ నాకే కాదు మరెవరి తరం కాదు " అన్నాడు.
*పాండవ యోధుల మధ్య వాద ప్రతివాదాలు*
అర్జునుడి మాటలను విని భీముడు కోపంతో ఊగిపోతూ " అర్జునా ! నీవు వీరుడివా ! లేక ఋషిపుంగవుడివా! ఏమిటీ పిరికి మాటలు. గురువును చంపడం మహాపాపమని మన సైన్యాలను ధ్వంసం చేస్తున్న ద్రోణుడిని నీవు వదలడం న్యాయమా ! యుద్ధరంగమున ప్రవేశించిన పిదప గురుశిష్య సంబంధాలు, బంధు మిత్ర అభిమానాలు వదిలి నిష్పక్షపాతంగా యుద్ధము చేయాలని రాజనీతి ఘోషిస్తున్నా నీవు రాజధర్మాన్ని తప్పి ద్రోణుడిని వదలడం ధర్మమా ! కౌరవులు అధర్మవర్తనులు కారా! నిండు కొలువులో శీలవతి అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చి అవమానించిన నీతి బాహ్యులకు వారికి సహకరించి యుద్ధము చేస్తున్న వారికి ఇలాంటి ఎన్ని అధర్మములు చేసినా మనకు పాపం అంటదు. అర్జునా ! మనలను ఎదుర్కోడానికి వస్తున్న శత్రువులను జయించడం ఎలా అని మేము ఆలోచిస్తుంటే నీవిలా పిరికి మాటలు మాట్లాడటం ధర్మమా ! అర్జునా ! నేనేమిటో నా పరాక్రమము ఏమిటో సుయోధనుడికి తెలుసు. మన మీదకు వస్తున్న వారిని సర్వ నాశనం చేయక వదలను " అని భీముడు రోషంతో పలికాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి