*తిరుమల సర్వస్వం -222*
*శ్రీవేంకటేశ్వరుని సేవలో దాసభక్తులు-1*
శ్రీమహావిష్ణువు కలియుగ అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ప్రాభవాన్ని, మహిమలను, ఆశ్రితపక్షపాతాన్ని ఎందరెందరో భక్తులు, కవులు, వాగ్గేయకారులు రసరమ్య భరితంగా వర్ణించారు. అటువంటి వారిలో శ్రీనివాసుణ్ణి తమ అమూల్యమైన పదబంధాలతో కీర్తించి తరించిన *'కర్ణాటక హరిదాసులు'* అగ్రగాములుగా నిలిచారు. వారు రచించి, ఆశువుగా కీర్తించిన వేలాది కృతులను *'దాససాహిత్యం'* గా పేర్కొంటారు. ఈ దాసపరంపరకు చెందినవారు శ్రీవేంకటాచలాధీశుణ్ణి కన్నడభాషలో వర్ణించినందువల్ల, ఆ సాహితీసంపదను అత్యధిక సంఖ్యలో ఉన్న శ్రీవారి తెలుగు భక్తులకు సులభంగా అర్థమయ్యే అచ్చ తెలుగుభాషలోకి అనువదించి, ప్రచారం చేసే బృహత్తర కార్యక్రమాన్ని *‘దాససాహిత్య ప్రాజెక్టు’* పేరుతో తి.తి.దే. చేపట్టింది. *'అన్నమాచార్య ప్రాజెక్టు'* ద్వారా అన్నమయ్య కీర్తనలను అందరికీ అర్థమయ్యే సాధారణ తెలుగులోకి ఎలా తర్జుమా చేసి జనబాహుళ్యం లోకి తెచ్చారో, అదే విధంగా *‘దాససాహిత్య ప్రాజెక్టు'* ద్వారా కన్నడభాషలో ఉన్న కీర్తనలను కూడా తెనిగీకరించుతారన్నమాట!
*దాస సాహిత్యం ప్రాముఖ్యత*
కొన్ని శతాబ్దాల క్రితం వరకు వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు సామాన్య మానవులకు అంతగా ప్రవేశం లేని సంస్కృతభాషలో నిక్షిప్తమై ఉండేవి. కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు మహాపండితులు దేవనాగరిలిపిలో ఉన్న సాహిత్యాన్ని సాధారణ జనస్రవంతి లోకి తీసుకు వెళ్ళే ఉద్దేశ్యంతో, ఆ సాహిత్య నిక్షేపాలన్నిటినీ విస్తృతంగా వాడుకలో ఉన్న సాధారణ కన్నడభాషలోకి అనువదించి; కుల, వర్ణ, లింగ వివక్షత లేకుండా ప్రజలలో ప్రచారం చేయాలని సంకల్పించారు. దానితో బాటుగా ఎందరో హరిదాసులు శ్రీవేంకటేశుని మహిమలను వీనులవిందుగా వర్ణించి తరించారు. తమను తాము భగవంతునికి దాసులుగా భావించుకుని, శ్రీవారిసేవకే తమ జీవితాలను సమర్పించుకున్న ధన్యజీవులను 'హరిదాసులు' లేదా 'దాసభక్తులు' గా అభివర్ణిస్తారు. హరికథలు, కీర్తనలు, దేవరనామాలు, భజనలు వంటి కళారూపాల్లో ప్రత్యక్షంగా, లేదా దృశ్య శ్రవణ మాధ్యమాల సాయంతో విస్తృతంగా శ్రీవేంకటేశ్వరతత్వాన్ని ప్రచారం చేయటం ద్వారా; పండితులకే పరిమితమైన ‘వ్యాససాహిత్యం’ అందరికీ అందుబాటులో ఉండే 'దాససాహిత్యం' గా రూపుదిద్దుకుంది. తద్వారా గడచిన కొద్ది శతాబ్దాలలో వేదాల, ఉపనిషత్తుల, ఆధ్యాత్మికతత్వ సారం కర్ణాటక ప్రాంతంలో నలుదెసలా విస్తారంగా వ్యాప్తి చెందింది. తరువాతి కాలంలో విజయనగరసామ్రాజ్య పతనం మరియు పురందరదాసు, కనకదాసుల వంటి ప్రఖ్యాత దాసభక్తుల నిర్యాణంతో; ప్రోత్సాహం కరువై ఈ ఉద్యమం మరింత ముందుకు సాగలేదు. పై నేపథ్యంలో అప్పటికే విస్తృతప్రచారంలో ఉన్న దాససాహిత్యాన్ని తెలుగుభక్తుల చెంతకు తీసుకురావడం కోసం తి.తి.దే. చేపట్టిన *దాససాహిత్య ప్రాజెక్టు* యొక్క పూర్వాపరాలు తెలుసుకునే ముందు, కొందరు ప్రముఖ దాసభక్తులను స్మరించుకోవాలి.
*దాసభక్తులు*
దాససాహిత్య వ్యాప్తిని తమ భుజస్కంధాలపై వేసుకుని కర్ణాటక దేశమంతా విస్తృతంగా పర్యటించిన కర్ణాటక హరిదాసులను తలచుకునేటప్పుడు మొట్టమొదటగా శ్రీపాదరాయలు వారిని, తరువాత వ్యాసరాయలు వారిని ముఖ్యంగా పేర్కొనాలి. ఆ తరువాత కర్ణాటక సంగీత పితామహులుగా పేరుగాంచిన ఆనాటి *పురందరదాసు, కనకదాసు, విజయదాసు, గోపాలదాసు, జగన్నాథ దాసు* లతో పాటుగా ఈమధ్య కాలం నాటి *శ్యామసుందర దాసు* కూడా స్మరణకు తెచ్చుకోదగ్గవారు. వీరిలో కొందరు అతి ముఖ్యులైన దాసభక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
*శ్రీపాదరాయలవారు*
కర్ణాటక దాసులను మననం చేసుకునేటప్పుడు,
*‘నమః శ్రీపాదరాజయ నమస్తే వ్యాసయోగినే!*
*నమః పురంధరార్వాయ విజయార్యతే నమః'*
అంటూ మొట్టమొదటగా దాససాహిత్యానికి ఆద్యుడయినటువంటి శ్రీపాదరాయలు వారిని ప్రస్తావించడం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం. భౌతికమైన ఈ మాయా ప్రపంచం నుంచి తనను రక్షించువాడు, ఇహలోకం లోని క్లేశాలను దూరం చేయువాడు ఆ వేంకటాచాలాధీశుడే అని శ్రీపాదరాయలు వారు నమ్మారు. శ్రీవారి మూలరూపం మరియు శ్రీమహావిష్ణువుకు యొక్క అవతార రూపాలకు బేధం లేదని ప్రతిపాదించి, శ్రీమహావిష్ణువును ఉపాసన చేసి తన జీవితాన్ని పండించుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలుతో పాటుగా ముగ్గురు విజయనగర సామ్రాట్ లకు రాజగురువుగా సేవలందించి, శ్రీవెంకటేశ్వర భక్తితత్వాన్ని దక్షిణభారత దేశమంతటా చాటిచెప్పిన శ్రీ వ్యాసరాయల వారి గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. స్వామిపుష్కరిణీ తటాన, వారు పెక్కు సంవత్సరాల పాటు త్రికాల సంధ్యావందనాదు లొనర్చిన *'వ్యాసరాజ ఆహ్నీకమండపాన్ని',* ఈనాడు కూడా తిరుమలలో ప్రధానాలయపు ఉత్తర మాడవవీధిలో, ఆదివరాహస్వామి ఆలయానికి ఎదురుగా చూడవచ్చు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి