Sreenivasa Murthy Chittamuri:
అమృతాన్ని ఆరగించాలి
అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట భారతీయులందరికీ తెలిసినదే.
'అన్నాద్భవన్తి భూతాని...' అని ప్రాణికోటి ఉత్పత్తికి ఆధారం అన్నమని తెలిపారు. తిన్న అన్నంలో అత్యంత స్థూలభాగం మాలిన్యంగా వెలికి వస్తుందనీ, సూక్ష్మ సూక్ష్మాంశాలు క్రమంగా ప్రాణశక్తిగా, తేజస్సుగా, మనస్సుగా మారుతాయని ఉపనిషద్వచనం. అందుకే అన్న విషయంలో అనేక నియమాలను ఏర్పరచారు మన పూర్వీకులు, మన అలసత్వంతో, చాపల్యంతో వాటిని 'చాదస్తాల'ని కొట్టేసి - నియమరహిత ఆహారాన్ని సేవించి బుద్ధినీ, శరీరాన్ని కాలుష్యపరచుకుంటున్నాం.
అన్న వ్యాపారం పెరిగి - వీథికో 'శీఘ్రహారకేంద్రాలు' వెలిశాయి. జిహ్వచాపల్యంతో మనుషులు వాటి ముందు బారులు, గుంపులు కడుతున్నారు. ఇంటిలో వండుకొనే అవకాశం లేని దరిద్రులు, లేదా పనిపై ప్రయాణంలో భాగంగా క్రొత్త ఊరికి చేరుకున్నవారు కడుపు నింపుకొనడానికై వాటిని స్వీకరించడం ఫరవాలేదు. గతిలేని పరిస్థితులవి.
కానీ ఉన్న ఊళ్లో, వండుకొనే అవకాశం ఉన్న గృహిణులు కూడా ఇంటిల్లిపాదితో కలసి హెూటళ్లకి పోయేలా ప్రేరేపించి 'ఎంగిలి - అంట్ల' నియమాల్లేని కూడు కోసం కక్కుర్తిగా మందవిందులకు ఎగబడడం శోచనీయమే. పెళ్ళిళ్ళలో ఆప్యాయంగా వండి వడ్డించడాలు పోయి, 'బఫే' పేర్లతో అనాచార, అనారోగ్య ఆహారాన్ని విందుల పేర్లతో ఆరగించడం బాధాకరం.
మన గృహస్థ సంప్రదాయం ప్రకారం శుచిగా అన్నాన్ని వండి భగవంతునికి నివేదించి, అతిథులకు వీలైనంత పెట్టి తాము తినడం పవిత్రం.... అని భావిస్తాం.
'యజ్ఞ శిష్టాశినః అమృతభుజః' అని శాస్త్రవచనం. “యజ్ఞము చేయగా మిగిలినది అమృతం. దానిని అరగించాలి". పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా మార్చడం వలన, భగవత్ప్రసన్నతాశక్తి మనలో ప్రసరిస్తుంది. తద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, మంచి సంతానం కలుగుతాయి.
ఆచార సంపన్నుల గృహాలలో అంట్లు ఎంగిళ్లు... అనే నియమాలుండేవి. సంస్కృతి, నాగరికత ఉన్నచోట్ల నియమాలు, నిబంధనలు పెరుగుతాయి. ఎంతో నాగరికతని సాధించిన దేశం కనుక - ఈ దేశంలో ఆహార నియమాలు బాగా ఉన్నాయి. వైజ్ఞానికంగా ఆలోచించినా - ఇంటి వంట ఒంటికి మంచిదని ఋజువవుతున్నదే. మంది భోజనాలు ప్రమాదకరమే. కేవలం బ్రతకడం కోసం కడుపులో కూడు పడేసుకోవడం పశుప్రవృత్తి. అంతేకాదు... ఇళ్లల్లో కూడా అంట్ల-ఎంగిలి నియమాలు వదులుకుంటున్నారు. కాస్త నాలికపై క్షణకాలం నిలిచే రుచికోసం ఉదరాన్ని హింసించి మానసిక శారీరక రోగాలకు బలవుతున్న దుఃస్థితులు నేడు కనిపిస్తున్నాయి.
చక్కగా స్నానం చేసి, తడిపి ఆరవేసిన పొడిబట్టను కట్టుకుని, శుభ్రపరచిన పొయ్యిపై భగవత్ స్మరణంతో వంట వండి, దేవుని దగ్గర దీపం వెలిగించి, ఆ అన్నాన్ని నివేదించితే అది అమృతమే అవుతుంది. దానిని ఆరగించడం శ్రేయస్కరం. వండేవారి మనః ప్రవృత్తి కూడా వంటపై ప్రభావం చూపిస్తుంది కనుక, శుచిగా దైవనామంతో వండుతున్నప్పుడు, ఆ దేవతాశక్తి అన్నానికి కూడా ఆవహిస్తుంది.
ఆహారాన్ని అరగించేటప్పుడు కూడా మనలో జఠరాగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరునికే నివేదిస్తున్నాం అనే భావన ఉండాలి. అందుకే పరిషేచన, దేవతాస్మరణ చేసి అన్నాన్ని తినడం ఈ దేశ సంప్రదాయం.
మన కడుపులోని అగ్నిహోత్రంలో అన్నాన్ని ఆహుతులుగా సమర్పిస్తున్నామనే భావనలో ఎంతో సంస్కారం గోచరిస్తోంది. ఈ స్ఫురణతో అన్నాన్ని స్వీకరించడం యజ్ఞం చేస్తున్నట్లే. జఠరాగ్నిలో పచనమైన ఆహారం రసంగా, శక్తిగా పరిణమించి ఇన్ద్రియ దేవతలకు చైతన్యాన్ని ప్రసాదిస్తోంది.
ఈ దర్శనం చేతనే మనకి అన్న నియమాలు, అన్నదానాలు ఏర్పడ్డాయి. పవిత్రమైన అన్నం పవిత్రమైన ఆలోచనలనిస్తుంది. 'అభక్ష్య భక్షణ'(తినరానివి తినడం) మహాపాపం... అని మన శాస్త్రాలు పదే చెబుతున్నాయి. అన్నానికి భౌతికమైన దోషాలను పోగొట్టడానికై వండే ముందు పదార్థాలను శుభ్రపరచడం చేస్తాం.
అవికాక - అన్న సంపాదనలో మనకు తెలిసీ, తెలియక జరిగిన దోషాలు, అన్న పచనంలో తప్పనిసరిగా జరిగిన హింస... మొదలైన సూక్ష్మమైన దుర్లక్షణాలను - భగవన్నివేదన వలన పరిహరించవచ్చు. తద్వారా శుద్ధమైన సంస్కారాలు మనలో మేల్కొంటాయి.
స్నానం కూడా చేయకుండా, పడుకుని లేచిన వస్త్రాలతోనే వంట వండి, ఆ అనాచార భోజనాన్ని 'కేరీజ్'లో సర్దుకుని పరుగు పరుగున ఆఫీసులకి దౌడుతీసి, ఏదో కడుపు నింపుకునే పద్ధతి నుండి కాస్త శ్రద్ధను ఉపయోగించి సదాచార విధానంలోకి మళ్లేందుకు ప్రయత్నించాలి.
మహాభారతంలాంటి ఇతిహాసాల్లో కూడా అన్న నియమాలు చాలా చెప్పబడ్డాయి. సాత్విక - రాజస-తామసాహారాల గురించి భగవద్గీతలో పరమాత్ముడే అద్భుతంగా వివరించాడు. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక ప్రగతికి సాత్వికాహారం శ్రేష్ఠం. వండిన వెంటనే ఎక్కువ ఆలస్యం కాకుండా భుజించడం శ్రేష్ఠమని కృష్ణవచనం. నాలుగు గంటలకు పైగా ఉన్న అన్నం చెడుతుంది. ఎంత 'చల్ల బీరువా'లో దాచినా దాని రసం క్షీణిస్తుంది. వైద్య, ఆరోగ్య శాస్త్రాలు కూడా వీటిని నిషేధించాయి.
మాంసాహార నిషేధం కలిగినవారు కూడా అతి లవణ, అతి కటు, అతి ఆమ్లా(పులుపు) కాని శాకాహారాన్ని భుజించడం మంచిదంటారు. మాంసాన్ని స్వీకరించేవారు కూడా ఆదివారం, శుక్రవారం లాంటి పవిత్ర దినాలలో మాంసాన్ని భుజించరాదని శాస్త్రం చెబుతోంది. పూర్ణిమ, అమావాస్య, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, పండుగ దినాలు, జన్మదినం వంటి ప్రత్యేక దినాలలో- మాంసాహారం తినరాదన్నారు. అంతేకాదు - ఆషాఢం నుండి నాలుగు నెలలు (చాతుర్మాస్యం) మాంసం తినకూడదని మహాభారతం చెబుతోంది. ఇది 'నిర్మూలన' కన్నా 'నియంత్రణ'ని అందిస్తుంది. దీని ద్వారా రాజస - తామస భావాల నిగ్రహణ సాధ్యమౌతుంది. క్రమక్రమంగా మాంసం తినే అలవాటున్న జాతులవారు కూడా మాంసాన్ని మానడం వలన యజ్ఞఫలం లభిస్తుందని వ్యాసుని మాట.
ఇక - ఏ ఆహారం స్వీకరించినా... 1. నిలబడి తినరాదు. 2. ఎంగిలి తినరాదు. 3. తినే పళ్లానికి ఎడమ చేయి తగల్చరాదు. 4. పళ్లానికి ఎడమ చేయి తగిలితే తిరిగి కడుక్కోవాలి. కడగకుండా అదే చేత్తో, లేదా తింటున్న చేత్తో ఆహార పదార్ధాన్ని ముట్టుకుంటే అది కూడా ఎంగిలవుతుంది. ఆ ఎంగిలి భోజనం మరొకరు తినరాదు. 5. చెమ్చాలతో తిన్నా ఆ చేయి ఎంగిలి చేయే. 6. ఆహారం (ఫలహారమైనా, అన్నమైనా) స్వీకరించాక పళ్ళెరాన్ని తీశాక, ఆ చోట నీటితో శుద్ది పెట్టాలి. ఆ నీటిలో పెరుగు చుక్కలైనా పసుపైనా వేసి శుద్ధి చేయాలి. 7. తాను తింటూ వడ్డించరాదు.... ఇవన్నీ శాస్త్ర నియమాలు.
'ఇవి చాదస్తాలు' అని పొగరెక్కిన బుద్ధులతో ఎంగిలి మంగలాలను దేవుకుంటున్న పశుప్రాయులు తాము ఏం కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు. తప్పనిసరై, ఆరోగ్యాది హేతువుల కోసం కొన్ని నియమాలను అతిక్రమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందిలేని కొన్ని చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. ఆహారశుద్ధి వలన సత్త్వ(ప్రాణశక్తి )శుద్ధి, సత్త్వశుద్ధి వలన చిత్తశుద్ధి... సమకూరతాయని సంప్రదాయం. 'ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?' అని అన్నప్పటికీ, ఆచారం లేనిదే ఆత్మశుద్ధి రాదన్నదీ వాస్తవమే. న్యాయంగా ఆర్జించినది, శుచిగా వండినదీ, ఈశ్వరునికి నివేదించినదీ మాత్రమే మనిషి తినవలసిన ఆహారం.
అతిథులకు, పేదలకు కూడా అటువంటి ఆహారాన్నే సమర్పించాలి, అది మనుష్య యజ్ఞం. మనమెంత నియమంగా వండినా, ఎక్కడ ఎలా తిన్నా భగవంతుని స్మరించితే అది పూర్ణశుచిని పొందుతుంది. "అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః" అని స్మరించి, ఇష్టదేవతా ప్రార్ధనతో భోజనం చేయడం ఉత్తమం. ఆచారం ఆయువును రక్షిస్తుంది. సదాచార సంపన్నమైన ఆహారం వలన మానవజాతిని తీర్చిదిద్దగలిగే బుద్ధిశక్తి సంపన్నులు ఆవిర్భవిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి