28, ఏప్రిల్ 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*360 వ రోజు*


*అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట*


అశ్వత్థామ నారయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారయాణాస్త్రాన్ని పాండవసేనల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రధాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు పిక్కటిల్లాయి. సముద్రములు పొంగాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా ఎదుర్కొంటున్నారు. కాని దాని ధాటికి తాళ లేక పోతున్నారు. నారయణాస్త్రం పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూసాడు. అర్జునుడు మాటాడ లేదు. ధర్మరాజు అర్జునుడు, కృష్ణుడు వినేలా ధృష్టద్యుమ్నుడు సాత్యకులతో ఇలా అన్నాడు. " ఆ ద్రోణుడు ఎంత క్రూరుడంటే నాడు నిండు కొలువులో ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ ఉఉరుకున్నాడు కాని ఒక్క మాట అన లేదు. బాలుడైన అభిమన్యుని మరణానికి కారణమయ్యాడు. సూర్యాస్తమయం అయితే అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలని తెలిసీ మనలను అర్జునుడికి సాయంగా వెళ్ళ నీయక అడ్డుకున్నాడు. మరి అలాంటి ధర్మపరునితో మనం సరి తూగగలమా ! ఈ నారాయణాస్త్ర సాక్షిగా చెప్తున్నాను. మీరంతా పారి పోయి మీ ప్రాణాలను దక్కించుకొండి. అప్పుడు అర్జునుడు కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడేమి చేస్తాడో ఆయన ఇష్టం " అని నిష్టూరంగా అన్నాడు. ఇక కృష్ణుడు ఊరక ఉండలేక రధము మీద నిలబడి " ఓ సైనికులారా ! పాండవ వీరులారా ! భయపడకండి. మీరంతా మీ మీ రథములు వాహనములు గజములు హయములు దిగి ఆయుధములు కింద పడవేయండి. నారాయణాస్త్రానికి ఇదే విరుగుడు. వేరు ఉపసంహారం లేదు " అన్నాడు.


*నారాయణాస్త్రాన్ని భీముడు ఎదుర్కొనుట*


శ్రీకృష్ణుడి మాటలకు సైనికులు తమ తమ వాహనములు దిగుతుండగా భీముడు " మహా వీరులారా ఆగండి వాహనములు దిగకండి వీరోచితంగా పోరాడండి. నేను ఉన్నాను, మహాస్త్రాలను ప్రయోగిస్తాను, నా గదతో అందరిని గెలుస్తాను " అని ఎలుగెత్తి అరచి తన గధ తీసుకుని అశ్వత్థామ మీదకు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని మీదకు మళ్ళించాడు. భీముని మాట వినక అందరూ తమతమ వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టారు. ఆ నారాయణాస్త్రము వారిని విడిచి ఆయుధధారి అయిన భీముని వెంటబడింది. అది చూసి భీముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వారుణాస్త్ర ప్రభావానికి నారాయణాస్త్రం శక్తి కొంత తగ్గింది. వెంటనే అశ్వత్థామ దాని శక్తిని పెంచాడు. ఆ నారాయణాస్త్రం భీముడిని భీకర అగ్నిజ్వాలలను విరజిమ్ముతూ చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునులు తమ ఆయుధములను రధము మీద ఉంచి రధము దిగి భీముని రధము వద్దకు పరుగెత్తి అతడిని రధము మీద నుండి కిందకు దించుటకు ప్రయత్నించారు. భీముడు రధము దిగక మూర్ఖంగా అలాగే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు " భీమసేనా ! మహా వీరా! ఈ అస్త్రమును ఉపసంహంరించే శక్తి అశ్వత్థామకు కూడా లేదు. దీనికి ఆయుధములు కింద పెట్టడమే విరుగుడు. నా మాట విని ఆయుధములు విడిచి రథము దిగవయ్యా " అంటూ కృష్ణుడు బతిమాలుతూ భీముని చేతి నుండి ఆయుధములు లాగాడు. అర్జునుడు, కృష్ణుడు కలసి ఒక్క తోపుతో రధము నుండి కిందకు తోసారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేతా ఆయుధములు లేక పోయే సరికి ఆ ఆయుధము శాంతించి వెను తిరిగింది. వెంటనే అందరిని ఆయుధములు ధరించి యుద్ధముకు సిద్ధం కమ్మని కృష్ణుడు ఆదేశించడంతో పాండవసైన్యం తిరిగి కౌరవ సైన్యంపై విజృంభించింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: