🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శివ భక్తులు ధన్యులని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు.*
*శ్లోకము : 72*
*ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం*
*భిత్వా మహా బలిభిరీశ్వర నామ మంత్రైః*
*దివ్యాశ్రితం భుజగ భూషణ ముద్వహంతి*
*యే పాదపద్మ మిహతే శివతే కృతార్థాః !!"*
*తాత్పర్యము :~*
*ఈశ్వరా ! నిధులు వెదికేవాడు, కన్నులకు అంజనము వేసికొని అది కనిపెట్టి ఆ చోట నిధి రక్షకులైన దేవతలను పూజించి, త్రవ్వి ఆనిధిని తీసుకొని సంతోషాన్ని పొందిన విధంగా భక్తుడు ధ్యానమనే అంజనంతో మీ పాదపద్మ నిధిని కనిపెట్టి మీ నామ మంత్రముతో మహా బలియొనర్చి, ఆవరణమైన అఙ్ఞానమును తొలగించి, దేవతాశ్రితమూ, భుజగభూషితమూ, అయిన మీ పాదపద్మములను గ్రహించి వాటిని శిరసా వహించి , జన్మసాఫల్యంగా పరమానందమును పొందుతాడు.*
*వివరణ :-*
*శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో ఈశ్వరుని పాదపద్మాన్ని గొప్ప నిధిగా వర్ణించారు. భూమిలో అనేక నిధులుంటాయి. అందువలననే భూమిని "రత్న గర్భ" అంటారు. భూమిలోని నిధులను దక్కించుకోవడానికి, గట్టి ప్రయత్నం చేయాలి.*
*అలాగే శివపాదములనే నిధిని పొందాలన్నా కూడా ఎంతో కష్టపడాలి.*
*భూమిలో నిధి ఎక్కడుందో తెలియాలంటే కంటికి అంజనం రాసుకోవాలి. అంజనమంటే ఒక విధమైన ప్రత్యేక కాటుక. శివపాద నిధిని చూడాలంటే ముందుగా శివధ్యానం చేసి దర్శించాలి. శివ ధ్యానం శివనిధిని పొందడానికి అంజనంలాంటిదన్నమాట.*
*నిధి కనబడగానే మనచేతికందదు. ఎందుకంటే నిధి భూమి బయట వుండదు. అది రాళ్ళచేత రప్పలచేత కప్పబడి ఉంటుంది. దాన్ని కొందరు దేవతలో దేవతా సర్పములో కాపలా కాస్తూంటాయి. కొన్ని ప్రత్యేకమైన మంత్రాల నుచ్చరించి , బలుల సమర్పించి నిదులను రక్షించే దేవతలను ప్రసన్నము గావించుకొని, భూమిని త్రవ్వి అడ్డుగావున్న రాళ్ళను తొలగించుకొని ఆ నిధులను పొందాలి.*
*అలాగే శివపాద నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన అది మనకు లభింపదు. మన పాపాలు శివధ్యానానికి ప్రతి బంధకాలు అవుతాయి ముందు వాటిని తొలగించాలి. తరువాత మంత్రోచ్చారణ శివనామ స్మరణలతో శివుని చుట్టూ కాపలాగా వున్న ప్రమథగణాది దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి. ఆ తరువాత సన్నిధిలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింప బడినదీ, వాసుకి మొదలైన సర్పాలంకృతులతో యుండేది అయిన శివపాద నిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధన్యులు కావచ్చునని శంకరులు చెప్పారు.*.
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి