12, ఏప్రిల్ 2025, శనివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈశ్వర స్మరణ చేత పాపములు పూర్తిగా పోయి విద్వాంసుడు శివసారూప్యమును పొందుతాడని శంకరులు ఈ శ్లోకమున చెప్పారు.*


*శ్లోకం : 71*


*ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాప*

    

*యుక్తైః శివ స్మరణ బాణగణై రమోఘైః*

    

*నిర్జిత్య కిల్బిషరిపూ న్విజయీ సుధీంద్రః*

     

*సానంద మావహతి సుస్థిర రాజలక్ష్మీమ్ !!*


*తాత్పర్యము :-*


*లోకములో ఒకరాజు ధనుర్బాణాలతో శత్రు రాజులను జయించి, ఆ రాజలక్ష్మిని పొంది సార్వభౌముడైన విధంగానే, పండిత శ్రేష్ఠుడు, ఆరూఢమైన భక్తిని అల్లెత్రాడుగానూ, అంతఃకరణ వృత్తిని ధనస్సుగానూ, అమర్చికొని అందు ఈశ్వర స్మరణమును బాణంగా ఎక్కుపెట్టి, పాపములనే శత్రువులందరినీ జయించి పరమానందంతో పరమేశ్వర సారూప్యలక్ష్మిని పొంది దుష్టనిగ్రహ, శిష్ట పరిపాలన రూపంగా సర్వశాసకుడౌతాడు.*


*వివరణ :-*


*పై తాత్పర్యాన్ని క్రింది విధంగా సమన్వయం చేసుకోవాలి. పండిత శ్రేష్ఠుడనే ప్రభువు ఎక్కుపెట్టబడిన భక్తి అనే నారితో పంపబడిన చితాతమనే ధనస్సునందు సంధింపబడిన తిరుగులేని శివనామ స్మరణమనే బాణసమూహంతో కామ క్రోధాదులనే శత్రువులనోడించి, విజయ శోభితుండై శాశ్వతమైన మోక్షమనే రాజ్యలక్ష్మిని మహానంద సహితుడై అనుభవిస్తాడు.*


*పై శ్లోక భావం పూర్థిగా అర్థం చేసుకోవడానికి మరి కొంత వివరణ అవసరమవుతుంది.*


*మనలో పాపాలున్నంత వరకూ మనం పవిత్రులం కాలేము. ముందు మన పాపాలను పోగొట్టు కోవాలి. ఈ పాపాలు శత్రువుల వంటివి. ఈ పాప శత్రువులను జయించాలి. అందుకు అమోఘమైన అనగా తిరుగులేని అంటే వృథాకాని బాణాలవంటివి కావాలి.* 


*శివనామ స్మరణము అంటే "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్ర జపం, అమోఘమైన బాణాల వంటిది. ఆ శివ నామోచ్చారణను చేసి శత్రువుల వంటి పాపాలను పోగొట్టుకొని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చునని శంకరులు చెప్పారు.*


*మోక్షసామ్రాజ్యలక్ష్మిని పొందాలంటే 1) పరిశుద్దమైన అంతరంగము 2) పాదుకొన్న భక్తి 3) శివ నామ స్మరణమనే సాధనలు కావాలి అని సారాంశం.*


*"‌యావద్ధి పాతకం దేహే , తావత్ సిద్ధిః న జాయతే " అనగా శరీరంలో పాపములున్నంతవఱకూ, సిద్ధిచిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి, మోక్షసిద్ధి కలుగవు.*


*"కషాయే కర్మభిః పక్వే, తతో జ్ఞానం ప్రవర్తతే " అనగా సత్కర్మల ద్వారా ,శాస్త్ర విహితములైన ధర్మానుష్ఠానములద్వారా, మన దోషాలు పోతాయి. హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు భగవత్తత్త్వము అనుభవానికి వస్తుంది.*


*ఈవిధంగా ఈశ్వరనామస్మరణ ప్రాముఖ్యమును గూర్చి ఈ శ్లోకం చెప్పింది.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: