10, ఏప్రిల్ 2025, గురువారం

సమస్యలకు కారణం*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺



       *మన సమస్యలకు కారణం*

                    *మనమే..!*

                    ➖➖➖✍️

```

కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒక రోజు పగిలిపోతాయో... అలాగే పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు.


ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకొనే మార్గం ఏదీ లేదు.


జీవులకు వృద్ధాప్యం, మరణం తప్పవు. ఎందుకంటే అది జీవుల స్వభావం. పండిన పండ్లు చెట్టు నుంచి రాలిపోవడం ఎంత అనివార్యమో, పుట్టిన జీవికి మరణం కూడా అంతే అనివార్యం.


అందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే మృత్యువు అన్ని జీవరాసులకూ చివరిదశ.


మరణం నుంచి జీవులను ఎవరూ కాపాడలేరు. ఎంత సన్నిహిత అనుబంధం ఉన్నా... బంధువులు వారిని రక్షించలేరు.


జంతువులను చంపి విక్రయించే వ్యక్తి ఆ జంతువును తన ఆధీనంలోకి తీసుకున్నట్టు... మృత్యువు జీవులను తన నియంత్రణలోకి తీసుకుంటుంది.


నిరంతరం సౌభాగ్యంతో జీవించాలనే మానవుల ఆకాంక్ష... దురాశే!


సత్యమేమిటంటే... మనిషి నూరేళ్ళు బతికినా, ఏ రోజు మరణిస్తాడో ఎవరికీ తెలీదు. తన బంధుమిత్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఈ అనుబంధాలన్నీ అదృశ్యమైపోతాయి.


జీవులకు సంబంధించిన ఈ సహజ వాస్తవికతను మానవులు అర్థం చేసుకోవాలి. అయితే ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని కలత చెందకూడదు. తమ వారి నిష్క్రమణల గురించి రోదించడం కూడా వ్యర్థం. ఇలాంటి నిరర్థకమైన రోదనల వల్ల శాంతి లభించదు సరి కదా... మరింత దుఃఖం పుడుతుంది. దానివల్ల శరీరం బలహీనపడుతుంది.


మరణించినవారు తిరిగిరారు. కానీ ఇలా విలపించడం ద్వారా జీవుడు తననుతాను బాధించుకుంటాడు. వారి విలాపం మరణించినవారికి కూడా సహాయపడదు.


తెలివైన వాడు వృద్ధాప్యం, మరణాల భయం నుంచి తప్పించుకొనే ఉపాయాన్ని అన్వేషిస్తాడు.


ఆనందాన్ని కోరుకొనే వ్యక్తి శోక, విలాపాలకు దూరంగా ఉండాలి. మనస్సు నుంచి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించాలి. మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలి.


విషయాసక్తికి దాసుడైనవాడు దుఃఖాన్ని అధిగమించలేడు. పైగా శాంతిలేని జీవితాన్ని గడుపుతాడు.


లేనిది ఉన్నదని భ్రమపడే మిధ్యా జ్ఞానమే మృత్యువు. సమ్యక్‌ జ్ఞానమే అమృతం. ప్రపంచంలోని పరిణామశీలత మృత్యువును సూచిస్తున్నది. మృత్యువు అంటే ప్రమాదం, అజ్ఞానం.


చాలామంది మృత్యువును చూసి భయపడతారు. కానీ సత్య సాక్షాత్కారం కలగకపోవడం వల్లే 

ఆ భయం కలుగుతుంది.


అజ్ఞానులు ఒక మృత్యువు నుంచి మరో మృత్యువుకు ప్రయాణిస్తూ ఉంటారు.


జ్ఞాని మృత్యువుకు అతీతుడు. అజ్ఞానికి క్షణక్షణం మృత్యువే.


చంచలమైన మనస్సే మృత్యువు.


సమ్యక్‌ జ్ఞానం వల్ల మృత్యు భయం పోతుంది. సత్స్వరూపమైన అమృతత్వం సిద్ధిస్తుంది. 

ఆ అమృతత్వమే శాశ్వత సత్యం.


ఈ కాలంలో మనుషులందరూ రోజూ చేసే ప్రయత్నం... తమ సమస్యలు గట్టెక్కడానికే.


ఉదయాన్నే లేచి, ముందుగా దేవుణ్ణి తలచుకోవడానికి బదులు తమ సమస్యలను స్మరిస్తారు. ఇంట్లో ఏదైనా వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్టయితే… “ఈ పని జరగలేదు, ఆ పని జరగలేదు, ఇంకా ఆ పనులు మిగిలే ఉన్నాయ్‌” అనుకుంటారు. 


ప్రపంచంలో పెద్ద పెద్దవాళ్ళు కూడా తమ సమస్యలను ఈ విధంగానే స్మరించుకుంటారు.


ఇక పూట గడవని వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా దొరుకుతుంది? అనేది సమస్య.


ఈ సమస్యలన్నీ మన సమయం మొత్తాన్ని తినేస్తున్నాయి. ఇంతకీ 

ఈ సమస్యలు ఎక్కణ్ణించి వచ్చాయి? భగవంతుడే ఈ సమస్యలను సృష్టించాడని అనుకొనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనిషి సతమతమయ్యే సమస్యలన్నీ అతను సృష్టించుకున్నవే.


ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే భగవంతుడే వాటిని సృష్టించి ఉంటే... వాటి నుంచి బయటపడడం చాలా కష్టమయ్యేది.


ఎవరైనా వందేళ్ళు బతికితే ఎన్ని రోజులవుతుంది? కేవలం 36,500 రోజులు మాత్రమే. 


ఈ జీవితమనే రైలు బండి తనదైన శైలిలో పోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ రైలు నుంచి మనం దిగిపోవలసిందే.


కానీ ఇప్పటివరకూ మీరు జీవించిన కాలంలో మీరేం నేర్చుకున్నారు? ఏం గుర్తించారు? మిమ్మల్ని మీరు గుర్తించారా? మీరెవరు? మీరు ఎవరనే సంగతి పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మీ జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది?


చాలామంది ‘శాంతి’ అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు. తన సమస్యలన్నీ తొలగిపోతే శాంతి చేకూరుతుందని మనిషి భావిస్తాడు. 


పిల్లాడు తప్పిపోయి, దుఃఖంతో విలవిలలాడుతున్న తల్లిని.. “మీకు శాంతి ఎలా లభిస్తుంది?”  అని అడిగితే… “నా బిడ్డ దొరికితే శాంతి కలుగుతుంది” అంటుంది.


అలాగే నిరుద్యోగి తనకు ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుందంటాడు.


కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి... ఏదైతే మీకు సుఖాన్ని కలిగిస్తుందని ఈనాడు భావిస్తున్నారో... అదే రేపు మీ దుఃఖానికి కారణం అవుతుంది.


ఈ విషయంలో నాలాంటివారు చేసేది ఒకటే... మిమ్మల్ని మీకు పరిచయం చెయ్యడం. తద్వారా మీకు లభించిన ‘జీవితం’ అనే ఈ అవకాశం గురించి మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జీవించి ఉన్న కాలంలో ఏం చేయాలనేది స్వయంగా నిర్ణయం తీసుకోగలరు. మీలోపలే ఉన్న అసలైన శాంతిని స్వయంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీ జీవితం సస్యశ్యామలం అవుతుంది. 


అలా జరిగితే జీవితంలో ఎన్నటికీ సమస్యలు రావా? అంటే వస్తాయి. కానీ సమస్యలు ఎదురైనప్పటికీ వాటి నుంచి బయటపడే మార్గాన్ని మీరు కనుక్కోగలరు.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                 🙏➖▪️➖🙏

కామెంట్‌లు లేవు: