☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(102వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
*రాక్షసుల అంతు చూసిన రణధీరుడు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*గోకులాన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు కంసుడు. బలరామకృష్ణుల సాహసగాథలను వేగుల ద్వారా వింటూనే ఉన్నాడతను. వారి అద్భుతకృత్యాలు, మహిమల గురించి ఆరాలు తీస్తూ, తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలుసుకున్నాడు. బలరామకృష్ణులను మట్టుపెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేయసాగాడు. అనుచరులయిన రాక్షసులను బలరామకృష్ణులను పరిమార్చి రమ్మని పంపసాగాడు. అయితే వెళ్ళిన రాక్షసులు వెళ్ళినట్టే హతమయి తిరిగిరాకపోవడంతోనూ, బలరామకృష్ణులు క్షేమంగా ఉన్నారని తెలియడంతోనూ కంసుని ఆందోళనకు అంతులేకుండాపోయింది. మరింతగా జాగ్రతపడసాగాడతను.*
*ఆ జాగ్రతలో భాగంగా వృషభాసుర, కేశి, వ్యోమాసురులను బలరామకృష్ణుల మీదకు పంపాడు. ఎలాగయినా వారిద్దరినీ సంహరించి తీరాలన్నాడు. ముందుగా అరిష్టుణ్ణి పంపించాడు కంసుడు*.
*వృషభరూపం ధరించి గోకులానికి చేరుకున్నాడు అరిష్టుడు. ఎద్దురూపంలో పెద్దకొండలా నడచి వస్తున్న అరిష్టుణ్ణి చూశారు గోపకులు. ఆశ్చర్యపోయారు. గోపికలు చూశారు. భయపడ్డారు. గోవులు చూశాయి. బెదరి నలుదిశలా పరుగులుదీశాయి. వృషభాసురుడు రంకె వేశాడు. మేఘం గర్జించినట్టుగా ఉందది. గిట్టలతో బలంగా భూమిని తాకాడు. ఆ తాకిడికి భూమి అదరిపోయింది. కొండకొమ్ముల్లాంటి శృంగాలతో నేలను పెళ్ళగించసాగాడు. యాదవులూ, పశుగణాలూ భీతిల్లాయి. పరుగు పరుగున శ్రీకృష్ణుని సమీపించారంతా. చూసింది చెప్పారు. శరణుకోరారు. అభయం ఇచ్చాడు కృష్ణుడు.*
*‘‘ఎక్కడ ఉన్నది ఆ వృషభం?’’ అడిగాడు. తీసుకుని వెళ్ళి చూపించారు కృష్ణునికి. వృషభాన్ని చూస్తూనే రాక్షసుడని గమనించాడు కృష్ణుడు. ధైర్యంగా వాడి ముందు నిలిచాడు. కృష్ణుని కొమ్ములతో కుమ్మబోయాడు వృషభాసురుడు. అదను చూసి కొమ్ములను అందుకున్నాడు కృష్ణుడు. గట్టిగా నిలిపి, వెనక్కి నె ట్టేశాడు. పద్దెనిమిది అడుగుల దూరం వెనక్కి పోయి, తూలిపడ్డాడు వృషభాసురుడు. అంతలోనే లేచి నిల్చున్నాడు. పరుగున వచ్చాడు. కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. వృషభాసుర కృష్ణుల యుద్ధం ముల్లోకాలనూ ఆశ్చర్యపరచింది. ఇద్దరూఇద్దరే అన్నట్టుగా పోట్లాడారు. మళ్ళీ వృషభాసురుని కొమ్ములు అందుకున్నాడు కృష్ణుడు. వాటిని ముందుకు వంచాడు. వెనుక భాగాన లేచి నిల్చున్నాడు వృషభాసురుడు. లేచి నిల్చిన వృషభాసురుణ్ణి లేచినట్టుగా నిలిపి, గిరగిరా తిప్పాడు కృష్ణుడు. బలంగా భూమి మీదకు విసిరేశాడు. కిందపడిన వృషభాసురుడు లేవకుండా వాడి మీద పడి, చేతుల్తోనూ, కాళ్ళతోనూ మర్దించాడు. కృష్ణుని మర్దనకి నోటి నుంచి రక్తాన్ని కక్కుతూ, గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు వృషభాసురుడు. ఎప్పుడయితే వృషభాసురుడు మరణించాడో అప్పుడు కృష్ణుని సమీపించి వ్రేపల్లె వాసులంతా అభినందించారతన్ని. అనేక విధాల కీర్తించారు.*
*వృషభాసురుడు మరణించాడని తెలిసి, కంసుడు కంగారుపడ్డాడు. మరో రాక్షసుణ్ణి పిలిచాడప్పుడు. వాడి పేరు కేశి. కృష్ణుని అంతుచూడమని ఆ రాక్షసునికి ఆజ్ఞాపించాడు.*
*కంసుని ఆజ్ఞప్రకారం కేశి భయంకరమయిన గుర్రం రూపం ధరించాడు. గోకులంలో ప్రవేశించాడు. సకిలించాడు. ఆ సకిలింపుకి సమస్తలోకాలూ భీతిల్లాయి. వ్రేపల్లెవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. వద్దు వద్దన్నా వినకుండా కేశిని సమీపించాడు కృష్ణుడు. గుర్రం రూపంలో ఉన్న రాక్షసుణ్ణి కవ్వించాడు. యుద్ధానికి రమ్మన్నాడు. కోరుకున్నదదే! కృష్ణునితో యుద్ధమే కావాలి వాడికి. కొండగుహలాంటి నోరు తెరిచి కృష్ణుని మీదకి దాడి చేశాడు కేశి. ఆకాశంలోకి ఎగిరి, ముందరి కాళ్ళెత్తి కృష్ణుని గుండెల మీద తన్నాడు. తూలిపడబోయాడు కృష్ణుడు. నిలదొక్కుకున్నాడు. గుండెల మీద నిలిచిన గుర్రం ముందరి కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు. పైకెత్తాడు. ఎత్తి అటుగా విసిరివేశాడు. చక్రంలా గిరగిరా తిరుగుతూ వెళ్ళి అల్లంతదూరంలో పడ్డాడు కేశి. మూర్ఛపోయాడు. లేవడనుకున్నారు, కాని లేచాడు కేశి. తెప్పరిల్లాడు. మరింతగా కోపించి, ఉరుకుతూ వచ్చి కృష్ణుణ్ణి ఎదిరించాడు మళ్ళీ. పెద్దగా నోరుచాచి కృష్ణుణ్ణి మింగేయాలనుకున్నాడు. అదే అదనుగా కృష్ణుడు వాడి నోటిలోకి తన ఎడమచేతిని జొనిపాడు. నిప్పుల్లోంచి తీసిన ఇనుపదూలాన్ని జొనిపినట్టుగా కృష్ణుడు చేయి ఎప్పుడయితే కేశి నోటిలోకి వెళ్ళిందో అప్పుడు వాడి నోటిపళ్ళన్నీ రాళ్ళలా రాలిపోయాయి. వాడి కడుపులోనికి చొచ్చుకుంది కృష్ణుని వామహస్తం. చొచ్చుకుని క్షణక్షణానికీ పెద్దది కాసాగింది. కృష్ణుని చేయి కేశి కడుపునిండా, నోటినిండా నిండిపోయింది. ఊపిరి ఆడలేదు వాడికి. గిజగిజా తన్నుకున్నాడు. గ్రుడ్లు గిరగిరా తిప్పుతూ పెద్దగా అరచి ప్రాణాలు వదిలాడు కేశి. కొండలా నేల మీద పడ్డాడు. అప్పుడు చేతిని వెనక్కి గుంజాడు కృష్ణుడు. ఆ వేగానికి కేశి నోరు దోసపండులా చీలిపోయింది. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన వ్రేపల్లెవాసులే కాదు, దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణునిపై పుష్పవర్షం కురిపించారు. కేశిని సంహరించిన కారణంగానే కృష్ణుడికి ‘కేశవుడు’ అని పేరొచ్చింది.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి