🙏మర్కట కిశోర న్యాయం, మార్జాలకిశోర న్యాయం🙏
మర్కటము అంటే కోతి.. మార్జాలము అంటే పిల్లి.. కిశోరము అంటే చిన్న బిడ్డ.
ఇక్కడ కర్తలు కిశోరాలే . మర్కటము యొక్క కిశోరము. మార్జాలము యొక్క కిశోరము. (వాటి తల్లులు కాదు. )
పిల్లల చర్యలే ఇక్కడ గ్రాహ్యాలు.తల్లులవి కాదు . అని నా భావము
కోతిపిల్ల తన తల్లిని వదలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది.
నా తల్లిని పట్టుకొన్నాను, నాకేమీ కాదు అని గట్టి ధైర్యం.
తల్లిని తన ప్రయత్నంతో బిడ్డ పట్టుకొని ఉండడం "అన్యథా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ" అని.
ఇక్కడ జీవుడికి భగవంతుణ్ణి పట్టుకోవడం తెలుసు. ఆ ప్రయత్నమూ తెలుసు.
తీర్థ యాత్రలూ, పూజలు, యజ్ఞాలూ , జప తపాలూ చేయడం.. తన ప్రయత్నం బహుళంగా ఉండడం. తానే భగవంతుణ్ణి పట్టుకోవడం.
పిల్లి పిల్లలు తల్లి ఎక్కడ వదిలితే అక్కడే తిరుగుతూ తల్లి రాకకోసం ఎదురుచూస్తూ ఉంటాయి . తల్లే వచ్చి తీసుకుపోవాలి.. తల్లి తమను పట్టించుకోవాలి. తాము తల్లిని వెతికి పట్టుకోలేవు. ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేవవి. అపుడు తన కూనలను తానే నోట కరచుకొని తీసుకుని పోతుంది ఆ తల్లిపిల్లి.
తెలిసి భగవంతుణ్ణి తానే గట్టిగా పట్టుకొని నిర్భయంగా ఉండడం మర్కట కిశోర న్యాయం.
నాకేమీ తెలియదు ( న మంత్రం నోయంత్రం అన్నట్టు). నిన్ను తలచుకోవడం ఒకటే తెలుసు . నన్ను కడతేర్చు— అని దీనంగా ఆక్రోశిస్తూ ఉన్న ఆ బిడ్డను ఆ భగవంతుడే దిగి వచ్చి, అతడికి ఏ కష్టమూ లేకుండా తన ధామం చేర్చుకొంటాడు. కూన ప్రయత్నం లేకుండానే తల్లి ఆ బాధ్యత అంతా తానే స్వీకరిస్తుంది.
జ్ఞానేనైవ తు కైవల్యం.. అనేది ప్రసిద్ధ వాక్యం. భగవంతుడు వేద వేద్యుడు గాబట్టి వేద విహిత కర్మలు చేసి
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ (భరతర్షభ! )
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
అని చెప్పిన వాక్యాలు ప్రమాణంగా అన్ని దశలూ దాటి కడకు జ్ఞానియై కైవల్యం చెందడం (బహూనాం జన్మనాం అంతే జ్ఞాన వాన్ మాం ప్రపద్యతే —అని ఉన్న ది గాబట్టి ) శాస్త్ర సమ్మతం..
జ్ఞాని/ యోగి వాసుదేవస్సర్వం అని దర్శిస్తాడు.. ఇది మర్కట కిశోర పద్ధతి . తెలిసి , ఆశ్రయించే విధానమూ తెలిసి భగవంతుణ్ణి పట్టుకోవడం ఈ యోగి చేసేది..
మార్జాల కిశోరంలో ఆర్తి ఉంది.. తనకే తన వేదన చెప్పుకొంటూ ఉంది. అది విని , తల్లి నోట గరుచుకొని తీసుకుని పోయి , దాని భయాన్ని పోగొడుతూ ఉన్నది...
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి