16, మే 2025, శుక్రవారం

17-12-గీతా మకరందము

 17-12-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - రాజసయజ్ఞమును గూర్చి తెలుపుచున్నారు– 


అభిసన్ధాయ తు ఫలం 

దమ్భార్థమపి చైవ యత్ |

ఇజ్యతే భరతశ్రేష్ఠ 

తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||


తాత్పర్యము:- భరతవంశశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఫలమునుగోరియు, డంబముకొఱకును గావింపబడు యజ్ఞమును రాజసమైనదానినిగా నీవు తెలిసికొనుము.


వ్యాఖ్య:- ఫలమునుగోరి చేయబడు కర్మచే చిత్తశుద్ధి యెన్నటికిని కలుగనేరదు. చిత్తము శుద్ధముకానిచో ఆత్మతత్త్వము ప్రకాశింపదు (అనుభూతముకాదు). కావున అట్టి ఫలాభిసంధియుక్తమగు కర్మ ఇచట రాజసమని (కావుననే త్యాజ్యమని) చెప్పబడినది. మఱియు కేవలము పేరుప్రఖ్యాతులకొఱకు, వేషముకొఱకు, డంబము కొఱకు చేయబడు కార్యమున్ను రాజసమేయని యిట పేర్కొనబడినది. కాబట్టి వాని నెవరును ఆశ్రయించరాదు.


ప్రశ్న:- రాజసయజ్ఞ మెట్టిది?

ఉత్తరము:- (1) ఫలాభిలాషతోను (2) డంబముకొఱకును గావింపబడు యజ్ఞము రాజసమని చెప్పబడును.

కామెంట్‌లు లేవు: