*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసము*
*378 వ రోజు*
*రెండవ అశ్వాసం*
కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించడానికి అంగీకరించిన పిదప సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముడు, ద్రోణుడు పాండవులను సంహరిస్తారని ఆశించాను. కాని వారికున్న పాండవపక్షపాతం కారణంగా నా ఆశ నెరవేర లేదు. కనీసం నీవైనా ధర్మరాజును బంధించి పాండవ సైన్యాలను నిర్మూలించి నా మనసుకు ఆనందం కలిగించు " అన్నాడు. కర్ణుడు శల్యునితో " నేను వేయు నారాచములు మొదలగు బాణములు చూసి పాండవులు భయపడతారు. నా భుజబలం చూసి దేవతలు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకునేలా యుద్ధం చేస్తాను " అన్నాడు.
*శల్యసారధ్యము*
కర్ణుడి మాటలు విన్న శల్యుడు " కర్ణా ! పాండవులు సత్యసంధులు, భుజబల పరాక్రమవంతులు, తేజో మూర్తులు, అస్త్రశస్త్ర పారంగతులు, దివ్యాస్త్రసంపన్నులు, అఖిల శాస్త్రపారంగతులు ఇంద్రునికే భయం కలిగించకలిగిన మహిమాన్వితులు వారిని గురించి నీవు ఇలా మాటాడతగదు. అర్జునుని గాండీవ ధ్వని నీ చెవులు బద్దలు చేస్తుంది, భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను మిరుమిట్లు కొల్పుతుంది. పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడించగలరు. అర్జునుడి శరాఘాతానికి నీ రధము కూలుతుంటే, భీముని గధాఘాతాలకు గజసైన్యములు కూలుతున్నప్పుడు, ధర్మరాజు నకులసహదేవులతో చేరి నీ సైన్యాలను చీల్చి చెండుతున్న సమయంలో నీవు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నమ్మగలను " అన్నాడు. ఆ మాటలు వినీ వననట్లు కర్ణుడు " శల్యా ! నా పరాక్రమము చూపిస్తాను పాండవుల ఎదుటకు రధము పోనిమ్ము. నేను విల్లు ఎక్కుపెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలువలేడు. అసలు పాడవుల బలం ఏపాటిదని భీష్ముడు, ద్రోణుడు వారి చేతిలో చచ్చారు. నీవు చూస్తూ ఉండు నేను అర్జునుడిని చిటెకెలో సంహరిస్తాను. పాండుకుమారులు ఒక్కుమ్మడిగా నా మీద పడినా నేను జంకక పాడవసైన్యాలను చీల్చి చెండాడి భీష్మ, ద్రోణులు పోయినా సుయోధనుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త్రసంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను " అని పగల్భాలు పలికాడు.
*శల్యుడు కర్ణుడి ప్రగల్భాలను త్రోసి పుచ్చుట*
కర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని " కర్ణా ! ఎందుకయ్యా ఈ వ్యర్ధ ప్రగల్భాలు. ఎవరైనా వింటే నవ్వగలరు. నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు. అది అందరికీ తెలుసు. అర్జునుడి చేతిలో ఓడి పోయిన గంధర్వుడు అంగారపర్వునికన్నా, సుయోధనుడిని బంధించిన చిత్రసేనుడికన్నా, వరాహం కొరకు అర్జునుడితో పోరిన పరమేశరుడికన్నా నీవు ఎందులో గొప్పవాడివి. వారిలో ఎవరికీ సరి పోలని నీవు అర్జునుడిని గెలుస్తానని అనడం నోటి దురదగాక మరేమి. కర్ణా ! ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా ! లేక అర్జునుడి బాణములు అప్పుడే తుప్పు పట్టాయని అనుకున్నావా ! ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అన్నావు కదా! అదే నిజమౌతుందేమో ! ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా ! నీ మాట నిలబడుతుంది " అన్నాడు. శల్యుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్నా ఆపుకుని " శల్యా ! నీవు అర్జునుడిని పొగడడమే పనిగా పెట్టుకున్నావు. నేను అర్ఝునుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు. అప్పటి వరకు నోరుమూసుకుని రధము నడుపు " అని అన్నాడు. శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు. కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి " సైనికులారా ! అర్జునుడేడి నాకు చూపించండి. అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన కానుకలు ఇస్తాను " అని కర్ణుడు తన శంఖం పూరించాడు. ఆ మాటలకు శల్యుడు పకపకా నవ్వి " కర్ణా ! అర్జునుడిని ఒకరు చూపేదేమిటి నువ్వే చూడగలవు. నీ వద్ద ధనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాత్రాదానాలు చేయకూడదు. అయినా కర్ణా ! ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా! అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే ! అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో. నేను సుయోధనుడికి మిత్రుడను కనుక ఇదంతా నీకు రుచించకున్నా ఇది చెప్తున్నాను. నా మీద కోపగించక నా మాట విను " అన్నాడు. కర్ణుడు కోపంతో " శల్యా ! నేను నీమాటలకి భయపడను. ఇంద్రుడు అడ్డుపడినా అర్జునుడితో ఒంటరిగా యుద్ధము చేయక వదలను. ముందు రధము పోనిమ్ము " అన్నాడు. కర్ణుడిని ఇంకా ఉడికించాలని శల్యుడు " కర్ణా ! నా మాటలు నీ చెవికి ఎక్కవులే అర్జునుడి గాండీవం నుండి జినించే శబ్దం నీ చెవులు బద్ధలు కొడుతుండగా గాండీవం నుండి వర్షంలా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే ! కర్ణా ! అర్జునుడితో ద్వంద యుద్ధము అంటే మాటలా ! సింహముతో జింకపిల్ల, ఏనుగుతో కుందేలు, పులితో నక్క, గ్రద్దతో పాము యుద్ధము చేయడం లాంటిది. నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము, శక్తి, సామర్ధ్యము ఉన్నాయంటావా " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి