1, మే 2025, గురువారం

తిరుమల సర్వస్వం -225*

 *తిరుమల సర్వస్వం -225*

 *శ్రీవేంకటేశ్వరుని సేవలో దాసభక్తులు-4*


 *భక్త కనకదాసు* 


 విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించే కాలంలో 'బీరప్ప' అనే యాదవ కులశ్రేష్ఠుడు సేనాధిపతిగా ఉండేవాడు. బీరప్ప- బుచ్చమ్మ దంపతులకు సుదీర్ఘకాలం తరువాత తిరుమలేశుని కృపవల్ల పుత్రసంతానం కలిగింది. తల్లిదండ్రులు ఆ బాలునికి 'తిమ్మప్ప' గా నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచారు. 1509వ సంవత్సరంలో, కర్ణాటకకు చెందిన హవేరీ జిల్లా, 'బాద్' గ్రామంలో తిమ్మప్ప జన్మించినట్లుగా చరిత్రకారులు అభిప్రాయ పడతారు.


 దైవచింతనకు దూరమై, భోగభాగ్యాలకు అలవడిన తిమ్మప్ప యుక్తవయసులో ఉండగానే తల్లిదండ్రులు దూరమయ్యారు. తన కటాక్షంతో జన్మించిన తిమ్మప్పను సన్మార్గం లోనికి తీసుకురావాలనే లక్ష్యంతో, ఆదికేశవుడు అనేక పర్యాయాలు తిమ్మప్ప స్వప్నంలో ప్రత్యక్షమై; తనవైపు దృష్టి మరల్చుకొని మోక్షమార్గంలో పయనించవలసిందిగా ఆదేశించాడు. కానీ, తిమ్మప్ప సాక్షాత్తు శ్రీహరి హితబోధను సైతం పెడచెవిన బెట్టి, ఐహికవాంఛల సాధనకే మొగ్గు చూపాడు. నిత్యపూజను, సంధ్యానుష్ఠానాలను, హరినామస్మరణాన్ని, సత్పురుషుల సాంగత్యాన్ని త్రోసిరాజన్నాడు.


 *కరస్పర్శతో బాధోపశమనం* 


 ఆ ఘటనాఘటన సమర్ధుని లీలా విలాసం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? యుద్ధరంగంలో చిచ్చరపిడుగులా చెలరేగిపోయే తిమ్మప్పకు ఒక నాడు యుద్ధంలో తీవ్ర గాయమైంది. శత్రుసైనికుని ఖడ్గప్రహారంతో ఒడలంతా రక్తసిక్తమై, భరింపరాని బాధతో విలవిలలాడుతున్న తిమ్మప్పకు ఆదికేశవుడు మరలా స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. రాగద్వేషాలను, ప్రాపంచిక బంధాలను, భోగలాలసత్వాన్ని విడనాడి తనను శరణు వేడమని పదే పదే శెలవిచ్చాడు. బాధతో దిక్కుతోచని తిమ్మప్ప తీవ్రంగా వేధిస్తున్న గాయం నుంచి తనకు సత్వర ఉపశమనం కలిగితేనే తాను ఆదికేశవుణ్ణి ఆరాధించుకుంటానని, లేకుంటే తానెప్పటికీ శ్రీహరిని సేవించుకోనని మొండిగా బదులిచ్చాడు. దాంతో, శ్రీవేంకటేశ్వరుడు చిద్విలాసం చిందిస్తూ తన కరస్పర్శతో తిమ్మప్ప శారీరక రుగ్మతను పూర్తిగా తొలగిస్తాడు. ఆ ఉదంతంతో శ్రీహరి మహిమను గుర్తెరిగిన తిమ్మప్ప జ్ఞానోదయం కలిగినవాడై, మోహవాంఛలను విడనాడి, శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తుడయ్యాడు.


 *కనకతూము* 


 వ్యాసరాయల వారి ఆదేశం మేరకు, యమాంశ సంభూతుడైన తిమృప్ప, యముని వాహనమైన మహిషం సాయంతో, ఒక పంటకాలువ త్రవ్వకానికి ఆటంకం కలిగిస్తున్న బండరాయిని తొలగించారు. తద్వారా నిమ్నకులస్తుడన్న కారణంగా ఒకప్పుడు తనను తిరస్కరించిన వ్యాసరాయల వారి మెప్పును సంపాదించి, వారి ద్వారా దాసదీక్షను పొందాడు. నాటి నుంచి తిమ్మప్పే *'కనకదాసు'* గా వ్యవహరింపబడుతున్నాడు. కనకదాసు జ్ఞాపకంగా, *'కనకతూము'* గా పిలువబడే ఈ కాలువ చిత్తూరు జిల్లా, మదనపల్లి శివారులో ఉంది.


 *శ్రీనివాసుని చిద్విలాసం!* 


 దాసదీక్షను పొంది తనను మనస్ఫూర్తిగా సేవించుకుంటున్న కనకదాసుకు ఒకనాడు స్వప్నంలో కనిపించిన శ్రీవేంకటేశ్వరుడు తన బ్రహ్మోత్సవాలకై తిరుమలకు రావలసిందిగా ఆహ్వానం పలికాడు. భగవంతుని ఆదేశానుసారం తిరుమలకు చేరుకున్న కనకదాసు నిలువనీడ లేక; ఎముకలు కొరికే చలిలో గజగజా వణుకుతూ, ఆరుబయటే విశ్రమిస్తాడు. భక్తుని దీనావస్థతో హృదయం ద్రవించిన శ్రీనివాసుడు నడిరేయి ఒక ఆజానుబాహువు రూపంలో వచ్చి; కడుపునింపుకోవడానికి శ్రీవారి ప్రసాదాన్ని, కప్పుకోవడం కోసం సరిగంచుపట్టు వస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. తదనంతరం ఆలయ యాజమాన్యం వారికి స్వప్నంలో సాక్షాత్కరించి, తన భక్తుడైన కనకదాసును సగౌరవంగా ఆలయం లోనికి తోడ్కొని రావలసిందిగా ఆదేశించాడు.


 మరునాటి ఉదయం కనకదాసు ఆలయద్వారం వద్దకు చేరుకోగా, నిరుపేద వలె గోచరిస్తున్న ఆ దాసభక్తుణ్ణి దేవాలయ సిబ్బంది గుర్తించలేకపోయారు. తత్ఫలితంగా కనకదాసుకు ఆలయప్రవేశం నిరాకరించబడింది. కనకదాసు ఆవేదనతో, ఆర్తితో నిద్రాహారాలు లేకుండా, ఆ రాత్రంతా శ్రీనివాసుణ్ణి స్మరించుకుంటూ ఆలయం బయటే నిరీక్షించాడు. దైవసంకల్పంతో అదే రాత్రి ఆలయంలో శ్రీవారి నగలు చోరీ అయ్యాయి. ఆ నేరం దేవాలయం ముంగిట వేచి ఉన్న కనకదాసుపై మోపబడింది. ఆలయ యాజమాన్యం నిష్పక్షపాతమైన విచారణ జరపకుండానే, కనకదాసుకు కొరడాదెబ్బల శిక్ష విధించింది. కనకదాసు మాత్రం, కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్లు, భారమంతా దేవునిపై వేసి నిశ్చింతగా శ్రీహరిని స్మరించసాగాడు. ఆర్తత్రాణ పరాయణుడైన అలమేలుమంగాపతి ఆలయ అధికారులకు స్వప్నంలో దర్శనమిచ్చి, జరిగిన వృత్తాంతమంతా తెలియజేస్తాడు. తన భక్తుడైన కనకదాసును అనుమానించి, అవమానించినందుకు ఆ ఆనందనిలయుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తమ తప్పు తెలుసుకున్న ఆలయ అధికారులు కనకదాసు పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకుని; దైవదర్శనార్థం కనకదాసును ఆలయం వద్దకు తోడ్కొని వెళతారు. దేవాలయం తలుపులు తీయగానే, పోయినట్లు భావించబడిన ఆభరణాలతో స్వామివారు దర్శనమిస్తారు. ఆ విధంగా కనకదాసు భక్తి తత్పరతను శ్రీవారు లోకవిదితం చేసి, ఆ దాసభక్తుని కీర్తిని అజరామరం కావించారు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: