*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*363 వ రోజు*
*అర్జునుడు వ్యానుని తన సందేహం తీర్చని కోరుట*
అశ్వత్థామను వదిలి వ్యాసుడు అర్జునుడి శిబిరానికి వెళ్ళాడు. సాక్షాత్తు ధర్మమూర్తి అయిన వ్యాసునికి అర్గ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన అర్జునుడు భక్తితో నమస్కరించి తన మనస్సులో మెదులుతున్న సందేహం వ్యాసుని ముందు బయట పెట్టాడు. " వ్యాస మునీంద్రా ! నేను రణరంగమున యుద్ధం చేస్తున్నప్పుడు నా ముందు ఒక ఆకారం పాదములు నేలకంటకుండా అగ్నిదేవునిలా వెలుగుతూ తన చేతిలో ఉన్న శూలముతో నేను చంపబోయే వారిని ముందుగా తానే చంపుతున్నాడు. ఆశూలము నుండి అనేకనేక శూలములు ఉద్భవించి శత్రుసంహారం చేస్తున్నాయి. ఆ తేజోమూర్తి చంపుతున్న వారిని నేను నామ మాత్రంగా నా బాణములతో చంపుతున్నాను. నేను చంపుతున్నట్లే ఉన్నా నిజానికి నేను ఎవరిని చంప లేదు. కాని వారిని చంపిన కీర్తి విజయం మాత్రమే నాకు దక్కాయి. ఆ మహానుభావుడు ఎవరు ? అలా ఎందుకు చంపుతున్నాడు "అని అడిగాడు.
*వ్యాసుడు అర్జునుడి సందేహం నివృత్తి చేయుట*
అర్జునుడి మాట విన్న వ్యాసుడు " అర్జునా ! అతడు ఆదిమధ్యాంత రహితుడు, సృష్టికి మూలకర్త, ఈ లోకములకు అన్నింటికి ప్రభువు, అవ్యయుడు, వేదమూర్తి, భక్త పరాధీనుడు, త్రినేత్రుడు, పార్వతీ పతి అతడే. యోగీశ్వర హృదయ విహారి, ప్రకృతీ అతడే, పురుషుడూ అతడే, భక్త సులభుడు, నిరాకారుడు, నీలఖంటుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు, ప్రళయాగ్నిని తన చల్లని కిరణములతో చల్లార్చగల బాల చంద్రుని శితోభూషణముగా కలవాడు. నిర్మలుడు, సర్వాంతర్యామి, శాంతి ప్రియుడు అయ్న రుద్రుడే నీ ముందు నిలిచి నీకు బదులుగా ముందుగా సంహార క్రియ గావిస్తున్నాడు " అని ఇంకా తనివి తీరక ఆ పరమేశ్వరుని లీలలు విపులంగా వర్ణించాడు. " ఓ అర్జునా ! ఆ పరమ శివుడు నీ సన్నిధిలో ఉండి నిన్ను కరుణించాడు. పేదకు పెన్నిధి దొరికినట్లు నీకు ఈశ్వరకటాక్షం లభించింది. నీవు ధన్యుడివి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో నీవు విజయుడివి ఔతావు. సాక్షాత్తు ఆ పరమశివుడే నీకు ముందుగా శత్రుసంహారం చేస్తుంటే విజయం నీకు కాక వేరెవరికి లభిస్తుంది. నీ తపస్సుకు మెచ్చి పాశుపతము ప్రసాదించిన పశుపతి తనివి తీరక తన భక్త పరాధీనతను నిరూపించుకున్నాడు. నీవు పుణ్యాత్ముడవు. ఆ పరమేశ్వరుని ఆత్మలోనిలిపి ధ్యానించిన నీకు సకల సౌభాగ్యములు ఆయురారోగ్యములు కలిగి సకల అభీష్టములు నెరవేరగలవు " అన్నాడు. అర్జునుడు పరమేశ్వరునికి భక్తితో నమస్కరించి తరువాత వ్యాసునికి ప్రమాణం చేసి భక్తితో అతడి ఆశీర్వచనములు పొందాడు. ఆ తరువాత వ్యాసుడు అక్కడి నుండి వెల్లాడు.
**ద్రోణ పర్వము పంచమాశ్వాసము సమాప్తం *
రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి