1, మే 2025, గురువారం

గీతా మకరందము

 17-10-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యాతయామం గతరసం 

పూతి పర్యుషితం చ యత్ | 

ఉచ్ఛిష్టమపి చావేుధ్యం 

భోజనం తామస ప్రియమ్ || 


తాత్పర్యము:- వండిన పిమ్మట ఒక జాము దాటినదియు (లేక బాగుగ ఉడకనిదియు), సారము నశించినదియు, దుర్గంధము గలదియు, పాచిపోయినదియు (వండిన పిదప ఒక రాత్రి గడిచినదియు), ఒకరు తినగా మిగిలినది (ఎంగిలిచేసినది) యు, అశుద్ధముగా నున్నదియు (భగవంతునకు నివేదింపబడనిదియు) అగు ఆహారము తమోగుణము గలవారి కిష్టమైనది యగును.


వ్యాఖ్య:- ఆరోగ్యశాస్త్ర ప్రకారమున్ను ఇట్టి తామసాహారము, పైనదెల్పిన రాజసాహారము నిషిద్ధములే యగును. సారము నశించి పాచిపోయినట్టి పదార్థమును తినినచో మలినమైన ఆహారపదార్థములయొక్క అణువులు శరీరమున ప్రవేశించి రక్తమును చెడగొట్టి అనారోగ్యమును గలుగజేయుటయేగాక వాని సూక్ష్మాంశములు మనస్సునందు ప్రవేశించి అద్దానినిగూడ మలిన మొనర్చును. కాబట్టి ముముక్షువు లట్టి యాహారముల నెన్నడును సేవించరాదు.

కామెంట్‌లు లేవు: