12, మే 2025, సోమవారం

తిరుమల సర్వస్వం 236-*

 *తిరుమల సర్వస్వం 236-*

*ద్వాదశ ఆళ్వారులు-1* 


  *విష్ణుభక్తిలో లీనమై, శ్రీవేంకటేశ్వరునితో సహా శ్రీమహావిష్ణువు యొక్క అవతారవిశేషాలన్నింటినీ పద్యరూపంలో వర్ణించి, భావితరాలకందజేసి, తాము తరించి భక్తజనులను తరింపజేసిన పన్నెండుమంది ఆళ్వారుల దివ్యచరిత్రలను తెలుసుకుందాం.*


 *ఆళ్వారులంటే?* 


 *'ఆళ్వారులు'* అనే తమిళ పదానికి *'విష్ణుభక్తిలో సంపూర్ణంగా మునిగినవారు'* అనే సమానార్థం ఉంది. వీరు నిరంతరం హరినామస్మరణలో లీనమై సార్థక నామధేయులయ్యారు. అదే విధంగా, *'ఆళ్వారులు'* అనే పదానికి *'రక్షించేవారు'* లేదా *'కాపాడేవారు'* అనే మరో అర్థం కూడా ఉంది. 


 ఈ దివ్యపురుషులు మనలో విష్ణుచింతనను వ్యాప్తి చేసి మనలను అరిషడ్వర్గాల నుండి రక్షించడం ద్వారా ఈ నామాంతరానికి కూడా సార్థకత చేకూర్చారు. ఈ పదానికి *'విజ్ఞాన నిక్షిప్తం'* అనే వేరొక అర్థం కూడా ఉంది. విష్ణుభక్తిని పెంపొందించి జనులలో జ్ఞానతృష్ణను రగిలింపజేయడం ద్వారా వీరు విజ్ఞానఖనులయ్యారు. వీరందరినీ సామూహికంగా *'ద్వాదశ సూరులు'* గా వ్యవహరిస్తారు. అంటే పన్నెండు మంది ఆళ్వారులూ, పన్నెండు సూర్యులతో సమానమన్నమాట. సూర్యనారాయణుని వలె వీరు కూడా శ్రీమహావిష్ణువుకు పరమభక్తులవ్వడం వల్లనూ; సూర్యుని వలె విజ్ఞానకాంతులతో, భక్తిభావమనే దివ్యతేజస్సుతో తేజరిల్లడం వల్లనూ వీరు 'ద్వాదశ సూరులు' గా వ్యవహరింప బడుతున్నారు.


 *ఆళ్వారుల ఆవిర్భావం* 


 *ఆళ్వారులందరూ కారణజన్ములే..* 


 శ్రీమహావిష్ణువు సంకల్పం తోనే వీరందరూ భూమిపై జన్మించారు. ఒకానొకప్పుడు మానవులు శ్రీమహావిష్ణువు ద్వారా ఒసంగబడిన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను శ్రీహరిసేవకు, హరినామస్మరణకు ఉపయోగించకుండా; వాటిని ఐహికమైన భోగభాగ్యాల సాధనకూ వినియోగిస్తూ ప్రాపంచిక సుఖాలకై వెంపర్లాడసాగారు. ఈ విషయంపై కలత చెందిన శ్రీమహావిష్ణువు భూలోకవాసులను సన్మార్గం లోనికి మళ్ళించే నిమిత్తం తిరుమల, శ్రీరంగం, కంచి ఆదిగా గల 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో స్వయంగా వెలిశాడు. అదే విధంగా తన భక్తితత్త్వాన్ని ప్రజలలో వ్యాపింపజేసి వారికి ముక్తిమార్గాన్ని ప్రసాదింపజేయడానికై తన పాంచజన్యశంఖాన్ని, సుదర్శనచక్రాన్ని, శ్రీవత్సచిహ్నాన్ని, కౌస్తుభమణిని, పరివారదేవతలను ద్రావిడదేశంలో సిద్ధపురుషులుగా వెలయింప జేశాడు. ఆ విధంగా శ్రీమహావిష్ణువు అంశతో భువిపై, ద్రావిడదేశంలో ఉద్భవించిన వారే ఆళ్వారులు. ద్రావిడదేశమనగా ఇంచుమించుగా ఈనాటి 'తమిళనాడు' రాష్ట్రమున్న ప్రాంతమన్నమాట.



 *అందరూ ద్రావిడదేశం లోనే ఎందుకు జన్మించారు?* 


 ఇది కేవలం కాకతాళీయమో, యాదృచ్ఛికమో కాదు. శ్రీహరి చిత్తసంకల్పం తోనే ఇలా జరిగింది. దానికి సంబంధించి, అత్యంతాసక్తికరమైన పౌరాణిక కథనం ఇలా ఉంది:


 ఒకానొకప్పుడు వేదభూమియైన భరతఖండానికి ఉత్తరదిక్కున ఉన్న హిమవత్పర్వత సానువుల్లోని కైలాసగిరిపై, ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నభూతో నభవిష్యతి అన్న చందంగా జరిగిన ఆ వివాహ మహోత్సవాన్ని తిలకించటానికై దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులతో పాటుగా సమస్త మానవాళి కైలాసగిరి కేతెంచారు. అంతటి జనసందోహం ఒకే దిక్కున కేంద్రీకృత మవ్వడంతో భూమాత సంతులనాన్ని కోల్పోయి ఉత్తరదిక్కుకు ఒరగడం ప్రారంభించింది. ఆ ఉత్పాతం ఒక మహాప్రళయానికి నాందిగా భావించిన ఆహ్వానితు లందరూ అపరిమితమైన ఆందోళనకు గురయ్యారు. రానున్న ప్రమాదాన్ని తృటిలో పసిగట్టిన, కుశాగ్రబుద్ధి కలిగిన, దేవతల శిల్పి 'విశ్వకర్మ' తరుణోపాయాన్ని సూచించాడు. వివాహానికి విచ్చేసిన అగస్త్యమహర్షి తన అపరిమితమైన తపోబలం వల్ల, ఆహ్వానితులందరి మొత్తం భారంలో సగభాగం కలిగి ఉంటాడని, ఆ మహాతపస్వి వివాహమంటపం నుండి వెడలి దక్షిణదిక్కుకు తరలిపోతే ధరాతలం తన సంతులనాన్ని తిరిగి పొందుతుందని పలికాడు. దాంతో, శివపార్వతుల కళ్యాణాన్ని కన్నులారా తిలకించే మహద్భాగ్యాన్ని కోల్పోబోవడం ద్వారా తీవ్రమైన మనస్తాపానికి, నిరుత్సాహానికి గురైన అగస్త్యమహర్షి తన ఈప్సితానికి (కోర్కెకు) భంగం కలిగించిన విశ్వకర్మను క్షణికావేశంలో శపిస్తాడు. నిస్వార్థబుద్ధితో, లోకకళ్యాణార్థం తరుణోపాయాన్ని సూచించిన, మహిమాన్వితుడైన విశ్వకర్మ కూడా అగస్త్యునికి ప్రతిశాపం ఇస్తాడు. దానిననుసరించి అగస్త్యమునిచే సృష్టించబడి; అప్పటివరకూ దైవ, పండితభాషగా వెలుగొందుతూ, సకల సాహిత్యాలకూ కాణాచిగా ఉన్న 'ద్రావిడభాష' తిరోగమనం పాలైంది.


 బ్రహ్మాది దేవతల వినతి మేరకు మహాప్రళయాన్ని నివారించడానికై, అగస్త్యమహర్షి అర్థాంగి లోపాముద్రా సమేతుడై కైలాసపర్వతాన్నుండి వెనుదిరిగి దక్షిణాన స్వర్ణముఖి నదీ తటాన ఉన్న తన స్వస్థలానికి తిరిగి వస్తాడు. తరువాతి కాలంలో అగస్త్యుడు పద్మావతీ పరిణయానంతరం నూతన దంపతులైన పద్మావతీ, శ్రీనివాసులకు ఆరుమాసాల పాటు, ఇప్పుడు సువర్ణముఖి నది ఒడ్డున 'ముక్కోటి' గా విలసిల్లుతున్న తన ఆశ్రమంలో, విడిది ఏర్పాటు చేయడం మనం ఇంతకుముందే తెలుసుకున్నాం.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: