.🙏 శ్రీ మహాభాగవతము
కుచేలోపాఖ్యానం🙏
రెండవ భాగం
"హలధరు డమర్త్య చరితుం
డలఘు భుజాబలుఁ డొనర్చు నద్భుత కర్మం
బులు పెక్కు నాల్గు మోములు
గల మేటియు లెక్క పెట్టఁ గలఁడె నరేంద్రా! "
ఓ మహారాజా! పరీక్షిత్తు! హాలాయుధుడూ, దివ్యచారిత్రుడూ, భుజబల సంపన్నుడూ అయిన బలరాముడి అద్భుత కార్యాలను పొగడడానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడి కైనా సాధ్యంకాదు.”
అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను "పద్మపత్త్రలో
చనుని యనంత వీర్యగుణ సంపద వేమఱు విన్న నైననుం
దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్
వినిన మనోజపుష్ప శరవిద్ధుఁడు నైన విరామ మొందునే?
భావము:- అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు “అంబుజాక్షుని అనంత గుణ సంపదలను గురించీ, పరాక్రమ ప్రాశస్త్యాలను గురించీ, ఎన్ని మార్లు విన్నా తనివితీరదు. ఒక్కసారి విష్ణు కథా వైభవాన్ని వింటే చాలు, ఎంత మన్మథ వికార పీడితు డైనా సరే మరీ మరీ వినకుండా ఉండ లేడు.
హరిభజియించుహస్తములుహస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త
చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా
వరుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య
క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్.
భావము:- హరిని పూజించే చేతులే చేతులు; అచ్యుతునికి నమస్కరించే శిరస్సే శిరస్సు; ఆ చక్రధారుని చూసే కన్నులే కన్నులు; ఆ లక్ష్మీపతిని పొగడే నోరే నోరు; ఆ శాశ్వతుని కథలను వినే చెవులే చెవులు.
హరిపాదతీర్థ సేవా
పరుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి
స్ఫురితాంగము లంగము; లా
పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా! "
భావము:
ఓ మునీశ్వరా! శ్రీహరి పాదపద్మాలు అనే తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. ఆ పరమాత్ముని తెలుసుకొనే మార్గం నాకు విశదీకరించి చెప్పవలసినది.”
అనుడు వేదవ్యాసతనయుఁ డా యభిమన్యు-
తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి
"జనవర! గోవింద సఖుఁడు కుచేలుండు-
నా నొప్పు విప్రుండు మానధనుఁడు
విజ్ఞాని రాగాది విరహితస్వాంతుండు-
శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు
విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు-
బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి
నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి
కాసు పదివేల నిష్కముల్ గాఁ దలంచి
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష
యొక విధంబున నడుపుచు నుండు; నంత
భావము:
ఇలా అడిగిన ఆ అభిమన్య పుత్రునితో, వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకుడు సంతోషంతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా....
లలితపతివ్రతా తిలకంబు వంశాభి-
జాత్య తద్భార్య దుస్సహ దరిద్ర
పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు-
శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి
మలమల మాఁడుచు మానసం బెరియంగఁ-
బట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ
బత్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి-
వేఁడిన వీనులుసూఁడినట్ల
యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ
జేరి యిట్లని పలికె "నో జీవితేశ!
తట్టుముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు
నొంప దీని కుపాయ మూహింప వైతి. "
భావము:
కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిని సాధ్వి. బిడ్డలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో “ప్రాణేశ్వరా! ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు.”
"బాలసఖుఁడైన యప్పద్మపత్త్రనేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మము నుద్ధరింపుము; హరికృపా క
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు.
వరదుఁడు, సాధుభక్తజనవత్సలుఁ, డార్తశరణ్యుఁ, డిందిరా
వరుఁడు, దయాపయోధి, భగవంతుఁడు, కృష్ణుఁడు దాఁ గుశస్థలీ
పురమున యాదవప్రకరముల్ భజియింపఁగ నున్నవాఁడు; నీ
వరిగిన నిన్నుఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్.
(ఇది చాలా మంచి పద్యం )
భావము:
శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు; సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు; దయాసాగరుడు; యాదవులు తనను సేవిస్తుండగా, ఆనర్తదేశములలో కోసలమున గల పట్టణమైన కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు.
కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు
ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ
దలఁపన్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నైన నిచ్చున్; సుని
శ్చలభక్తిన్ భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్? "
( ఇది కూడా అద్భుతమైన పద్యం )
భావము:
కలలోకూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా, ఆపదలు చుట్టుముట్టి నప్పుడు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీవంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా?”
అని చెప్పిన నమ్మానిని
సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం
గన నేఁగుట యిహపర సా
ధనమగు నని మదిఁ దలంచి తన సతితోడన్.
భావము:
ఇలా చెప్తున్న ఆ ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళడం ఇహపర సాధనమని మనసులో అనుకుని, తన భార్యతో ఇలా అన్నాడు.
"నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమశోభన మా చక్రపాణి కిపుడు
గాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు? "
భావము:
“నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని చక్రి దగ్గఱకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా.”
అనిన నయ్యింతి "యౌఁగాక" యనుచు విభుని
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.
భావము:
భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు.
నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె? యాతఁ
డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?"
లనుచు నా ద్వారకాపుర మతఁడు సొచ్చి.
ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట.
భావము:
ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ....
విశదమై యొప్పు షోడశసహస్రాంగనా-
కలితవిలాస సంగతిఁ దనర్చి
మహనీయ తపనీయ మణిమయగోపుర-
ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి,
మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి-
సంతోషబాష్పముల్ జడిగొనంగఁ
బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మంది-
రమున నింతులు చామరములు వీవఁ
దనరు మృదుహంసతూలికా తల్పమందుఁ
దానుఁ బ్రియయును బహు వినోదములఁ దనరి
మహితలావణ్య మన్మథమన్మథుండు
ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు.
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ-
గరుణాలవాలు, భాసుర కపోలుఁ,
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు-
సురుచిరలావణ్యు, సుర శరణ్యు
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు-
ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,
ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ-
బన్నగశయను, నబ్జాతనయను,
మకరకుండల సద్భూషు, మంజుభాషు
నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు
నల్లకలువలవంటి శ్యామలవర్ణం వాడూ;
దేవేంద్రునిచేత పొగడబడేవాడూ; కృపకు నిలయమైనవాడూ; ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడూ; కౌస్తుభాన్ని ధరించిన వాడూ; ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడూ; సౌందర్యమూర్తీ; దేవతలకు దిక్కయినవాడూ; సింహమధ్యముడూ; సకల లోకాల యందు పూజింపబడువాడూ; చక్రాయుధుడూ; జగత్తులో పేరెన్నిక గలవాడూ; గరుడవాహనుడూ; పీతాంబరధారీ; ఆదిశేషునిపై శయనించేవాడూ; అరవిందాక్షుడూ; మకరకుండల భూషణుడూ; మధుర భాషణుడూ; సాటిలేని మేటి సౌందర్యం కలవాడూ; పాలసముద్రంలో విహరించే వాడూ; సుగుణ సాంద్రుడూ; యాదవకుల మనే సాగరానికి చంద్రుడూ; సర్వ వ్యాపకుడూ; ప్రకాశ వంతుడూ; జయ శీలుడూ; సహన శీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు,
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి