3, జూన్ 2025, మంగళవారం

18-03-గీతా మకరందము

 18-03-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కర్మనుగూర్చిన కొందఱి యభిప్రాయములను చెప్పుచున్నారు – 


త్యాజ్యం దోషవదిత్యేకే 

కర్మ ప్రాహుర్మనీషిణః | 

యజ్ఞదానతపఃకర్మ 

న త్యాజ్యమితి చాపరే || 


తాత్పర్యము:- కొందఱు బుద్ధిమంతులు (సాంఖ్యులు) దోషమువలె కర్మ విడిచిపెట్టదగినది అని చెప్పుదురు. మఱికొందఱు యజ్ఞము, దానము, తపస్సు మున్నగు కర్మలు విడువదగనివి అనియు చెప్పుదురు.


వ్యాఖ్య:- కర్మ ఉపాధికి (శరీర, ఇంద్రియ, మనంబులకు) సంబంధించినదిగావునను ఉపాధి భ్రాంతిజన్యమైనది గనుకను, ఆత్మ సర్వసాక్షికావునను, కర్మ దోషముపగిది త్యజింపదగినదని కొందఱి (సాంఖ్యుల) మతము. కర్మ బొత్తిగా వదలినచో జీవునకు చిత్తశుద్ధి యెట్లు కలుగుననియు, అసలు దేహయాత్రయే యెట్లు జరుగుననియు భావించినవారై కొందఱు చిత్తశుద్ధికరములగు తపో యజ్ఞ దానాది కర్మలు వదలదగినవి కావని చెప్పుదురు. ఈ ప్రకారముగ జనులలో కర్మనుగూర్చిన భిన్నాభిప్రాయములను భగవానుడు వ్యక్తపఱచి ఇవ్విషయమున తనయొక్క నిర్ణయమును రాబోవు శ్లోకమున తెలియజేయుచున్నాడు.


ప్రశ్న:- కర్మనుగూర్చి కొందఱి యభిప్రాయమేమి?

ఉత్తరము: - కొందఱు కర్మను దోషమువలె త్యజించవలెననియు, మఱికొందఱు తపోయజ్ఞదానాది కర్మలను త్యజించరాదనియు చెప్పుచున్నారు.

కామెంట్‌లు లేవు: