*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*
*396 వ రోజు*
కృష్ణుడు తలదించుకుని ఉన్న అర్జునుడిని చూసి " అర్జునా ! నీ అన్న ప్రసన్నుడైనాడు. అతడి అనుమతి తీసుకుని మనం యుద్ధానికి వెడదాము. కర్ణుని చంపడమే మన ప్రథమ కర్తవ్యము. రణరంగమున వీరవిహారమొనరించి కర్ణుని వధించి ధర్మజుడి మనసుకు ఆహ్లాదం కలిగించు . అసలు విషయం తెలుసుకొనక ధర్మజుడు తొందర పడి నిన్ను నిందించినందుకే కదా ఇలా జరిగింది. ఆ మాటలకు కోపించి నీవు నీ అన్నను చంపిన ఏమయ్యి ఉండేది. దైవానుగ్రహం వలన ఘోరం జరుగకుండా ఆగి పోయింది " అనగానే అర్జునుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతుండగా ధర్మజుడి కాళ్ళ మీద పడ్డాడు. ధర్మరాజు కూడా అర్జునుడిని పైకి లేవనెత్తి కన్నీళ్ళు తుడుచుకుంటూ గట్టిగా అర్జునుడిని హృదయానికి హత్తుకుని " అర్జునా ! ఆ కర్ణుడు నా విల్లు రథము విరిచి ములుకులవంటి మాటలతో నా మనసు గాయపరిచాడు. నాశరీరాన్ని తన వాడి అయిన బాణాలతో బాధించాడు. అలాంటి దుర్మార్గుని నీవు చంపక ఉన్న నేను బ్రతికి ఉండి ఏమి ప్రయోజనము " అన్నాడు. అర్జునుడు " మహారాజా ! నేను ఈ రోజు కర్ణుడిని చంపి నేలను పడవేయక నీ ముఖము చూడను. కృష్ణుడిని సారథిగా పొందిన అర్జునుడు ఆడిన మాట తప్పడు " అని కృష్ణుడిని చూసి " కృష్ణా! ఈ రోజు అర్జునుడు కర్ణుడిని చంపుతాడు అని నీ మనసున సంకల్పించు ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని సంహరిస్తాను " అన్నాడు. కృష్ణుడు " తధాస్తు " అన్నాడు. కృష్ణుడు " ధర్మజా ! నీ తమ్ముడు అర్జునుడిని దీవించి పంపు " అన్నాడు. ధర్మరాజు " అర్జునా ! అనాలోచితంగా నేను అన్న మాటలకు బాధపడకు. శ్రీకృష్ణుడి అనుమతితో నీవు నన్ను అన్న మాటలకు నేను బాధపడను. విజయా ! నీవు కర్ణుడిని గెలిచి విజయుడివి అన్న పేరును సార్థకం చేసుకుని తిరిగిరా " అన్నాడు.
*కర్ణవధ కొరకు సంకల్పించుట*
కృష్ణార్జునులు రధారూఢులై రణరంగముకు బయలుదేరారుకాని అర్జునుడి మనసులో భీతి బెరుకు ఆవహించాయి. అది గమనించిన కృష్ణుడు " అర్జునా ! నీవు అమరులకు అజేయుడవు. నీకు భుజబలము, అస్త్రబలము దైవ బలము ఉన్నాయి. నీ పరాక్రమానికి తట్టుకోలేక భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ద్రోణుడు ప్రాణాలు విడిచాడు. సైంధవుడు రూపు మాసి పోయాడు. ఇక మిగిలింది కర్ణుడు అతడిని చంపి సుయోధనుడి నమ్మకాన్ని వమ్ము చెయ్యి. అతడిని నమ్మే సుయోధనుడు ఈ ఘోర నరమేధానికి దిగాడు. ఇంకా కృపాచార్యుడు, అశ్వథ్థామ, శల్యుడు, కృతవర్మ కూడా చావ వలసిన వారే. కృపాచార్యుడిని, అశ్వత్థామను బ్రాహ్మణులని వదిలినా కృతవర్మను నా బంధువని వదలకు. శల్యుడు మీ మేన మామ. అతడు పరుల పక్షాన ఉన్నందున చంపతగిన వాడే. కర్ణుడు మీ కష్టాలకు మూల కారకుడు. లక్షాగృహ దహనము, కపటజూదము, పాండవసతికి జరిగిన అవమానము, ఇంకా సుయోధనుడు చేసిన సమస్త అకృత్యములకు మూలము అతడే. కర్ణుడు సభలో ద్రౌపదిని అన్న మాటలు దుస్సహము అవి నీవింకా మరువ లేదు కదా " నీ మగలు నిన్ను జూదమున ఓడి చేత కాక చేతులు ముడిచి కూర్చున్నారు. ఈ కురు సభలో మగటిమి గల మగవాడిని మగనిగా ఎన్నుకో " అన్నది కర్ణుడే. నేను సంధికై వెళ్ళిన సమయాన సుయోధనుడికి అతడి తమ్ములకు నా పై పగ రగిల్చి నన్ను బంధింప వచ్చుటకు కారణం కర్ణుడే. లోక భీకరంగా పోరు సల్పుతున్న నీ కుమారుడు అభిమన్యుడి విల్లు విరిచి అతడి మరణానికి కారకుడైంది కర్ణుడే. నీవు కర్ణుడిని చంపిన మిగిలిన రాజులు చావగా మిగిలిన దృతరాష్ట్ర కుమారులు నీ ఎదుట ఇక నిలువరు. విజయలక్ష్మి మిమ్ము వరించగలదు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నీ తోడు ఉండగా నాకిక కావలసినది ఏముంది. ఈ రోజు నా చేతిలో కర్ణుడి చావు తధ్యము. నా ప్రతాపానికి సుయోధనాదులు కపటజూదం ఆడించినందుకు విచారించాలి. కర్ణుడి మరణం చూసి నాడు విదురుడి మాట విననందుకు కలత పడాలి. ధృతరాష్ట్రకుమారులు కర్ణుడి వధ చూసి రాజ్యం మీద ఆశ వదులు కోవాలి. కర్ణవధ విన్న నా అన్న ధర్మజుడి ముఖంలో ఆనందం చూడాలి " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి