3, జూన్ 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం -259*

 *తిరుమల సర్వస్వం -259*

*ద్వాదశ ఆళ్వారులు-23*


 *నమ్మాళ్వార్ కు శిష్యరికం* 


 ఆ పుణ్యపురుషునితో వేదాంత విషయాలపై కొంత తడవు చర్చ జరిగిన తరువాత వారే శఠకోపయోగిగా పిలువబడే 'నమ్మాళ్వార్' అని మధురకవి ఆళ్వార్ గ్రహించారు. వారిని తనకు పరమాత్మునిచే పంపబడ్డ గురువుగా భావించి; తనను శిష్యునిగా స్వీకరించమని నమ్మాళ్వార్ వారిని వేడుకొన్నాడు. జిజ్ఞాసువైన శిష్యుడు లభించడం పట్ల సంతుష్టి చెందిన నమ్మాళ్వార్ అందుకు సమ్మతించడంతో వారికి శిష్యునిగా మారి, జీవితాంతం వారికి శుశ్రూష చేసి, తన ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవడమే గాకుండా; నమ్మళ్వార్ వద్దనుండి అనేక ధర్మసూక్ష్మాలను కూడా అవగతం చేసుకున్నారు.


 నమ్మాళ్వార్ అత్యంత చిన్నతనం లోనే పరమపదాన్ని చేరుకోవడంతో వ్యాకులచిత్తుడైన మధురకవి అదే ప్రదేశంలో వారికి ఒక ఆలయం నిర్మించి, తన జీవితాంతం అందులోనే పూజాదికాలు నిర్వహిస్తూ తాను కూడా విష్ణుసాయుజ్యాన్ని పొంది ఆళ్వార్ గా వినుతి కెక్కారు.


 వీరు రచించిన పదకొండు పాశురాల సంకలనం *'కణ్ణినుణ్ శిరుత్తాంబు'* గా ఖ్యాతినొంది నాలాయిర దివ్యప్రబంధంలో భాగమైంది.

 మధురకవి ఆళ్వార్ ను ద్వాదశ ఆళ్వారులలో ఒకరిగా పరిగణించే విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. కొందరు మధురకవి ఆళ్వార్ స్థానంలో, శ్రీమద్రామానుజాచార్యుల వారిని ద్వాదశ ఆళ్వారులలో ఒకరిగా భావిస్తారు. వీరి గురించిన సమగ్ర సమాచారాన్ని మునుపటి ప్రకరణాలలో తెలుసుకున్నాం.


 రామానుజుల వారికున్న పెక్కు నామాలు ఎలా వచ్చాయో ఈరోజు తెలుసుకుందాం.


 *రామానుజుల వారి నామాంతరాలు* 


 సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి ద్వారా ప్రశంస లందు కునేంత గొప్పగా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించడం వల్ల *'శ్రీభాష్యకారులు'* గా ఖ్యాతినొందారు.


 శ్రీరామచంద్రునికి తమ్ముడైన లక్ష్మణునిలా, శ్రీమహావిష్ణువు తల్పమైన ఆదిశేషువులా అంకితభావంతో హరియాజ్ఞను అమలుపరుస్తాడని భావించి; మేనమామచే నామకరణం చేయబడిన జన్మనామం *'రామానుజుడని'* (రామునికి అనుజుడు, అంటే 'తమ్ముడు' అని అర్థం) పిలువ బడ్డారు.


 శ్రీరంగనాథుని ఆదేశానుసారం రంగనాథాలయంలో పెక్కు సేవలను, ఉత్సవాలను ప్రవేశపెట్టి నందువల్ల *'ఉడయవర్లు'* గా వినుతికెక్కారు.


 'భూతపురి' అనే నామాంతరం కలిగిన శ్రీపెరంబుదూరులో జన్మించి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే మహత్కార్యాలను అకుంఠిత దీక్షతో, విజయవంతంగా చేపట్టడం వల్ల; *'భూతపురి ముని'* గా వ్యవహరింపబడ్డారు.


 సర్వసంగ పరిత్యాగియై భిక్షాటన కొనసాగిస్తూ, 'తిరుప్పావై' ను పఠిస్తూ ప్రజలలో భక్తిభావాన్ని ఇనుమడింప జేయడం వల్ల *'తిరుప్పావై జియ్యరు'* బిరుదాన్ని పొందారు.


 శ్రీరంగనాథునితో వివాహం జరిగితే, సుందరాచల వాసియైన సుందరబాహుస్వామికి చక్కెరపొంగలిని, వెన్నభాండాలను నైవేద్యంగా సమర్పించు కుంటానని గోదాదేవి మ్రొక్కుకుంది. కానీ శ్రీరంగనాథునితో వివాహం జరిగిన వెంటనే ఆమె దేవునిలో ఐక్యమవ్వడం వల్ల ఆమె మ్రొక్కు అసంపూర్తి గానే మిగిలిపోయింది. చెల్లెలి మ్రొక్కును అన్నగారిలా నిబద్ధతతో తీర్చడం వల్ల రామానుజులు వారు *'గోదాగ్రజుని'* గా పరిగణింప బడతారు.


 ఒకానొకప్పుడు తన గృహంలో ఆశ్రయం పొందుతున్న తన గురువు గారైన తిరుక్కచ్చి నంబిని, తన భార్య చులకనభావంతో చూడడంతో; ఎంతగానో కలత చెందిన రామానుజులవారు ఆమెను పరిత్యజించి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వారి గురుభక్తికి మెచ్చిన కంచి వరదరాజస్వామి రామానుజులవారిని *'యతీంద్రుని'* గా సంబోధించడంతో ఆ నామాంతరం కూడా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: