18-08-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - రాజసత్యాగమును వర్ణించుచున్నారు-
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం
నైవ త్యాగఫలం లభేత్ ||
తాత్పర్యము:- ఎవడు శరీరప్రయాసవలని భయముచేత దుఃఖమును గలుగజేయునది యనియే తలంచి విధ్యుక్తకర్మమును విడిచిపెట్టునో, అట్టివాడు రాజసత్యాగమును గావించినవాడై త్యాగఫలమును బొందకయే యుండును.
వ్యాఖ్య:- తామసత్యాగి అజ్ఞానమువలన విధ్యుక్తకర్మలను వదలుచున్నాడు. రాజసత్యాగియో ఆ కర్మచేయుట ప్రయాసమని తలంచి దానిని వదలివేయుచున్నాడు. అనగా సోమరితనము వహించుచున్నాడని అర్థము. ఉత్తమసుఖమును గలుగజేయు క్రియలు సామాన్యముగ ప్రారంభములో కష్టముగా తోచును. కాని తుదకు అనంతసుఖమునే కలుగజేయును. కాని రాజసత్యాగి ప్రారంభమునతోచు కష్టమునకు బెదరిపోయి, సోమరితనముచే ఏమాత్రము శ్రమించక, ఆ కర్మలనే వదలివైచుచున్నాడు. బ్రహ్మముహూర్తమున లేచుట, శీతలోదకముచే స్నానముచేయుట, బ్రహ్మచర్యమును పాలించుట మున్నగు క్రియలు ప్రారంభములో కష్టముగా తోచవచ్చును. కాని అవియే తుదకు మహదానందమును కలుగజేయును. కాని రాజసత్యాగి (బద్ధకము వలన) వానిని చేయుటకు నిచ్ఛగింపక వదలిపెట్టుచున్నాడు. అట్టివానికి త్యాగముయొక్క ఫలమేమియు లభించుటలేదు ఏలననగా త్యాగమనగా సంగత్యాగమేకాని కర్మత్యాగముకాదు. వారో, కర్మలనే త్యజించివైచుచున్నారు. ఈ ప్రకారముగ తామసుడు, రాజసుడు వేర్వేఱు కారణములచే విధ్యుక్తకర్మలను త్యజించివైచుచు తత్ఫలములను పొందకున్నారు.
ప్రశ్న:- రాజసత్యాగముయొక్క లక్షణమేమి?
ఉత్తరము :- కార్యము కష్టమని తలంచి (సోమరితనముచే) దానిని వదలివేయుట రాజసత్యాగమనుబడును.
ప్రశ్న:- దానివలన అతనికి కలుగు నష్టమేమి?
ఉత్తరము: - అతడు త్యాగఫల మిసుమంతేని పొందకుండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి