*తిరుమల సర్వస్వం -264*
*శ్రీవారి సంవత్సర సేవలు - 1*
తిరుమల క్షేత్రం ఉత్సవాలకు పుట్టినిల్లు. ప్రతినిత్యం అనేక సేవలు, ఉత్సవాలతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది. శ్రీవేంకటేశ్వరునికి జరిగే నిత్య, వార, పక్ష, మాసోత్సవాలన్నింటినీ; సంవత్సరసేవల్లో చాలా వరకూ మునుపటి ప్రకరణాల్లో చెప్పుకున్నాం. మిగిలిన సంవత్సర సేవల గురించి ఈనాటి ప్రకరణంలో తెలుసుకుందాం.
*పార్వేటోత్సవం*
క్రూరమృగాలను నిర్జించి, పౌరులను కాపాడటం క్షాత్రధర్మం. ఈ కార్యాన్ని నిర్వర్తించడానికై రాజులు, చక్రవర్తులు తరచూ వేటకు వెళ్ళేవారు. కొందరికైతే వేట ఒక వ్యసనంగా కూడా మారేది. శ్రీవేంకటేశ్వరుడు ముల్లోకాలనేలే రాజాధిరాజు. సృష్టిలోని సమస్తజీవాలు వారి పాలితులే! సదా వారిని కాపాడటం కోసం, మృగయావినోది (వేట యందు అనురక్తి కలిగినవాడు) యైన శ్రీనివాసుడు కూడా వేటాడుతూనే ఉంటారు. వాస్తవానికి సుదీర్ఘకాలం శేషాచలక్షేత్రం లోని వల్మీకం (పుట్ట) లో తలదాచుకున్న శ్రీనివాసుడు అశ్వారూఢుడై వేటకు వెడలినప్పుడే నారాయణవనం ప్రాంతంలోని అరణ్యంలో పద్మావతీ దేవితో తొలి పరిచయం జరిగి వారి పరిణయానికి దారి తీసింది.
ఆధ్యాత్మిక దృష్టితో అవలోకించినట్లైతే, అడవుల్లో సంచరించే క్రౄరమృగాలు, యుద్ధరంగంలో శత్రువుల కంటే; నిత్యమూ మనను అంటిపెట్టుకుని ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు (అంతర్గతంగా ఉండే ఆరు శత్రువులు) మరింత ప్రమాదకరమైనవి. వాటిపై విజయం సాధించాలంటే, ఇంద్రియాలను అదుపులో నుంచుకో గలిగే ఆత్మనిగ్రహం కావాలి. పరమాత్ముని కృపతోనే అది సాధ్యం.
ప్రతి ఏడాది సకల లాంఛనాలతో, రాజోచిత సత్కారాల నందుకుంటూ పార్వేట ఉత్సవంలో పాల్గొనే శ్రీవేంకటేశ్వరుడు తన శరణు జొచ్చినవారిని అరిషడ్వార్గాల నుండి కాపాడతాననే అభయమిస్తున్నాడు. ప్రధానాలయం నుండి పాపనాశనం వెళ్ళే రహదారికి ఎడం ప్రక్క, నిర్జనంగా నున్న అటవీ ప్రాంతంలో, రాచఠీవితో ఉట్టిపడే ఓ ప్రాచీన మంటపమే పార్వేట ఉత్సవానికి వేదిక. దీనినే 'పార్వేట మంటపం' గా పిలుస్తారు.
మకరసంక్రాంతి పండుగ దినాలలో మూడవనాడైన 'కనుమ' రోజు ఈ ఉత్సవం జరుగుతుంది. ఆరోజు శ్రీనివాసునికి యథావిధిగా ప్రాతఃకాలం జరిగే నిత్యకైంకర్యాలు పూర్తయిన తరువాత, స్వామివారు రథారూఢుడై ఆలయం నుండి పార్వేటమండపానికి బయల్వెడలుతారు. మరో రథంలో, ఆనందనిలయ వాసియైన శ్రీకృష్ణుడు వారిననుసరిస్తారు. ఆ మంటపంలో స్వామివారికి పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన వంటి ఉపచారాలు జరిపి, వారిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మంచెపై ఆసీనుల్ని చేస్తారు. తదనంతరం వేదపఠనం, అన్నమయ్య కీర్తనాలాపనలతో పాటుగా; అన్నమయ్య వంశస్తులకు, హాథిరామ్ జీ మఠం వారికి సత్కారాలు జరుగుతాయి.
ఈలోగా, శ్రీకృష్ణుడు పార్వేట మండపానికి ప్రక్కనే ఉన్న 'గొల్లవిడిది' కి వేంచేసి, చిన్నికృష్ణుణ్ణి తలపుకు తెస్తూ పాలు,వెన్న ఆరగిస్తారు. తదనంతరం వారిని పార్వేటమండపానికి తోడ్కొనివెళ్ళి; గొల్లవారు సమర్పించుకున్న పాలు, వెన్నను మలయప్పస్వామి వారికి కూడా నివేదించి, హారతి సమర్పించు కుంటారు.
తదనంతరం మలయప్పస్వామి వారు వేటకు బయల్దేరుతారు. వేగంగా పరుగెడుతున్న మృగరాజును తరుముతున్నట్లు, స్వామివారు కూడా వేగంగా ముందుకు కదులుతారు. స్వామివారి తరఫున అర్చకులు శరాన్ని (బాణం) సంధిస్తారు. ఈ విధంగా కొన్ని పర్యాయాలు జరిగిన తరువాత, వేట ముగుస్తుంది. ఉత్సవానంతరం మలయప్పస్వామి, శ్రీకృష్ణుడు యథావిథిగా ఆలయ పునఃప్రవేశం చేస్తారు.
వేట సన్నివేశాన్ని రక్తి కట్టించడంలో పల్లకీని మోసే బోయీలు, స్వామివారి తరఫున శరసంధానం చేసే అర్చకులు ప్రధానపాత్ర పోషిస్తారు.
శ్రీవారి పార్వేటోత్సవాన్ని దర్శించుకున్న వారికి ఇంద్రియనిగ్రహం కలుగుతుందని, తద్వారా వారు అరిషడ్వర్గాలను జయించ గలరని భక్తుల విశ్వాసం.
*పవిత్రోత్సవాలు*
తిరుమల క్షేత్రం పవిత్రతకు మారుపేరు. ఆలయంలో జరిగే ఉత్సవాలు, ఉపచారాలు అన్నీ శాస్త్రోక్తంగా, ఆగమశాస్త్రబద్ధంగా జరుగుతాయి.
వైదిక సాంప్రదాయాలననుసరించి కొన్ని సందర్భాలలో అశౌచాన్ని (వ్యావహారిక భాషలో అశౌచాన్ని 'మైల' గా వ్యవహరిస్తాం) తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనల వెనుక వైదిక కారణాలతో పాటు వ్యావహారిక, ఆరోగ్యపరమైన కారణలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతే గాకుండా, వైఖానస ఆగమసూత్రాలననుసరించి స్వామిని అర్చించడానికి కొన్ని నిర్దిష్టమైన, సంక్లిష్టమైన, విస్తృతమైన నియమాలను పాటించాలి.
కానీ, నిత్యము లక్షకు పైగా భక్తులు, వందల సంఖ్యలో సిబ్బంది, పదుల సంఖ్యలో అర్చకులు సందర్శించే ఆలయంలో, తెలిసో తెలియకో పొరపాట్లు జరిగే అవకాశముంది. అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని లోటుపాట్లు జరగవచ్చు. అటువంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఏవిధమైన భంగం కలుగకుండా, దోషపరిహారార్థం జరిపించే ఉత్సవాలను 'పవిత్రోత్సవాలు' గా పిలుస్తారు.
వందల సంవత్సరాలుగా అమలులో ఉన్న ఈ ఉత్సవాలు పాలకులు మారడం వల్ల కొంతకాలం నిలిచిపోగా, 1962 లో పునరుద్ధరించబడి అప్పటినుండి నిరాటంకంగా జరుగుతున్నాయి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి