*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*
*401 వ రోజు*
*కర్ణార్జునుల యుద్ధ సమారంభం*
అప్పుడు అర్జునుడు కర్ణుడు ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు కర్ణుడు శల్యుని చూసి " మద్రరాజా ! అర్జునుడు నన్ను జయించిన మీరు ఏమి చేస్తారు ? " అన్నాడు. నేను కృష్ణార్జునులతో యుద్ధము చేస్తాను " అన్నాడు శల్యుడు. అక్కడ అర్జునుడు కూడా " కృష్ణా !కర్ణుడు నన్ను జయించిన నువ్వేమి చేస్తావు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! సూర్యుడు పశ్చిమాన ఉదయించినా కర్ణుడి చేతిలో నీవు ఓడి పోవుట జరగదు. నీ ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. విధి వక్రించి అలా జరిగితే అలాంటి దురవస్థను నేను నవ్వులాటకైనా భరించ లేను. కౌరవవంశం నిర్మూలించి ఆ కర్ణుడిని, శల్యుని ఒంటి చేత వధించి ఈ కురు సామ్రాజ్యానికి ధర్మరాజును చక్రవర్తిని చేస్తాను. ఇది నిశ్చయము " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నేను నవ్వులాటకు అన్నాను కాని నీదాకా రానిస్తానా! నాడు కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనక వదులుతానా ! ఆ త్రిమూర్తులు అడ్డుపడినా నేడు నా చేతిలో కర్ణుడు చావడం తధ్యం. కర్ణుడు తల నా చేత నరకబడటం నీవు వినోదంగా చూడు. కర్ణుడి భార్యను శల్యుడి భార్యను విధవలుగా చేస్తాను " అన్నాడు. ఇరు పక్షముల వారు ఎదురు ఎదురుగా నిలిచారు. కర్ణుడికి అర్జునుడికి మధ్య లోకోత్తర యుద్ధము జరుగ బోతుందని దేవతలు సహితము యుద్ధము కనులారా చూడటానికి ఆకాశంలో కూడారు.
*అశ్వత్థామ సుయోధనుడి వద్ద సంధి ప్రస్థావన తెచ్చుట*
కర్ణార్జునులు ఒకరితో ఒకరు సమరానికి సిద్ధపడిన సమయానఅశ్వత్థామ సుయోధనుడితో " సుయోధనా ! భీష్ముడు అంతటి వాడు అర్జునుడి చేత ఓడి పోయాడు. ఈ కర్ణుడు అంతకంటే గొప్పవాడా ! అర్జునుడి ముందు నిలువగలడా ! నేను అర్జునుడిని సమాధానపరుస్తాను నీవు కర్ణుడిని అనునయించు. మనం అందరం ధర్మరాజుతో సంధి చేసు కుంటాము. వ్యవహారం చక్కబడుతుంది. భీముడు నకులసహదేవులు ధర్మరాజు చెప్పిన మాట వింటారు. నా మాట విన్న నీవు, నీ సహోదరులూ, సకల రాజన్యులు, సాధారణ జనం క్షేమంగా ఉంటారు. నీవు నన్ను కృపాచార్యుడిని, కర్ణుడిని నమ్ముకున్నావు. నేను కృపాచార్యుడు ఎవరి చేతిలో చావమని అర్జునుడిని గెలువ గలమని అనుకోవడం పొరపాటు. భీష్ముడు, ద్రోణుడు అరివీర భయంకరులనీ వారిని ఎవరు ఓడించ లేరని అనుకున్నారు. కాని కృష్ణుడి సాయంతో అర్జునుడు వారిని గెలువలేదా ! వారు మరణించ లేదా ! మేమూ అంతే కదా ! కనుక పాండవులతో సంధి చేసుకోవడం ఉత్తమం. కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు మనం ఏదేదో అన్నామని ఇక సంధి అసాధ్యమని అనుకోవద్దు. నీ తండ్రి ధృతరాష్ట్రుడిని ధర్మరాజు చక్రవర్తిగా అంగీకరిస్తాడు. అతడి పాలనలో మనమంతా హాయిగా ఉంటాము. కర్ణుడు కూడా నా మాట వింటాడు. మాకు నీవు బ్రత కడం కావాలి. బ్రతికి ఉంటే సుఖములు అనుభవించ వచ్చు కదా! చచ్చి ఏమి సాధిస్తావు ! కనుక అసూయా ద్వేషాలు మాని సంధికి ఒండంబడుట మంచిది. అందరికీ శ్రేయోదాయక మైన సంధికి అంగీకరించక ఉన్న సాము చేస్తున్న త్రాటి నుండి పడినట్లు అధఃపాతాళానికి పోతావు జాగర్త " అన్నాడు.
*సంధికి సుయోధనుడి నిరాకరణ*
అశ్వత్థామ మాటలు సావధానంగా విన్న విరక్తిగా నవ్వి " అశ్వత్థామా ! నీవు ఎంత వెర్రి వాడవయ్యా ! నా తమ్ముడు దుశ్శాసనుడిని చంపి ఒక శపథం నెరవేర్చు కున్న భీముడు నన్ను చంపి రెండవ శపథం నెరవేర్చక మానతాడా ! ఇంత జరిగిన తరువాత సంధి ఏమి బాగుంటుంది. ఈ సమయంలో కర్ణుడు యుద్ధము మానగలడా ! కానున్నది కాక మానదు. నీ ప్రయత్నము విరమించుట మంచింది. అర్జునుడిప్పుడు బాగా అలసి ఉన్నాడు. కర్ణుడు అవక్రపరాక్రమంతో విలసిల్లు తున్నాడు. ఇప్పుడు కర్ణుడి చేతిలో అర్జునుడి వధ తధ్యం " అన్నాడు. సుయోధనుడు తన సేనలను ఉత్సాహ పరిచాడు.
కర్ణార్జునుల యుద్ధం
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి