18-13-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - కర్మలు నెరవేరుటకుగల ఐదు కారణములను వచించుచున్నారు -
పఞ్చైతాని మహాబాహో!
కారణాని నిబోధ మే |
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణామ్ ||
తాత్పర్యము:- గొప్ప బాహువులుకల ఓ అర్జునా! సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండయొక్క అంతమును దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము.
వ్యాఖ్య:- కృత + అన్తే = కృతాన్తే, సాంఖ్యే - అనగా కర్మకాండయొక్క అంతమును బోధించు వేదాంతశాస్త్రమందు - అని అర్థము. వేదాంతమున ఆత్మ స్వరూపమును నిర్ణయించునపుడు అది ప్రకృతికి పరమై, అతీతమైయుండునది యనియు, సమస్తకర్మలు ప్రకృతిచేతనే జరుగుచుండుననియు, ఆత్మ సాక్షిగ, నిష్క్రియముగ నుండుననియు అట తెలియజేయబడును. కనుకనే సమస్తకర్మలు అంతమగు వేదాంత శాస్త్రమున అని యిట చెప్పబడినది. మఱియు "సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే” అని చెప్పబడినందువలన కర్మలన్నియు జ్ఞానమందు లయించిపోయి, పరిసమాప్తమగుచున్నవి. ఏలయనిన, చైతన్య (ప్రజ్ఞారూప) ఆత్మస్థితియందు శరీర, ఇంద్రియ, మనస్సంకల్పాదులుండవు కావున అచట కర్మ రహితమగును. కర్మను దాటిపోయినస్థితి అది. కనుకనే ఇచట జ్ఞానమునకు, వేదాంతశాస్త్రమునకు కర్మయొక్క అంతము (కృతాంతము) అని చెప్పబడినది.
ప్రశ్న:- ఏ కర్మ అయినను జరుగవలెననిన ఎన్ని కారణములుండవలెను?
ఉత్తరము :- ఐదు.
ప్రశ్న:- వానినిగూర్చి ఎచట తెలుపబడినది?
ఉత్తరము:- కర్మయొక్క అంతమగు జ్ఞానమును బోధించు సాంఖ్య (వేదాంత) శాస్త్రమున తెలుపబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి