13, జూన్ 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం -269*

 *తిరుమల సర్వస్వం -269*

 *శ్రీవారి మొక్కుబడులు-1* 


 *శ్రీవారి మ్రొక్కుబడులు* 


 ఆపదమ్రొక్కుల వాడికి భక్తులు చెల్లించుకునే విలక్షణమైన మ్రొక్కులు, ముడుపులు ఎన్నో, ఎన్నెన్నో! ఒక్కో ముడుపుకు ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో మొక్కుకు ఒక్కో పరమార్థం..


 కోరిన కోర్కె నెరవేరిన తరువాత మ్రొక్కులు తీర్చుకునే వారు కొందరైతే, ముందే మ్రొక్కు తీర్చుకుని కోర్కెల చిట్టా విప్పేవారు మరికొందరు..


 సంతానప్రాప్తి, శారీరక స్వస్థత, ఉన్నతవిద్య, పరీక్షల్లో ఉత్తీర్ణత, ఉద్యోగప్రాప్తి, వివాహం, పదోన్నతి, విదేశీయానం, వ్యాపారాభివృద్ధి, లాటరీ, ఎన్నికల్లో విజయం, మంత్రిపదవి, ఐశ్వర్యప్రాప్తి, పాడిపంటలు లాంటి వ్యక్తిగతమైన కోర్కెలే కాకుండా; దుర్భిక్ష నివారణ, సకాల వర్షాలు, క్రిమిసంహారం, ఉపగ్రహాల విజయవంతం, ప్రపంచశాంతి, దౌత్యవిజయం, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో గెలుపు వంటి సామాజిక పరమైన కోర్కెలకు కూడా అంతే లేదు. 


 *ఆ కలియుగ కల్పతరువును కోరుకోవాల్సిన అగత్యం లేనేలేదు. మన హితం మనకంటే ఎక్కువగా స్వామివారికే తెలుసు. భక్తులు కోరుకున్నా, కోరుకోక పోయినా; వారికి ఎప్పుడు, ఏది అవసరమో, వారి వారి కర్మఫలాన్ని బట్టి వారు దేనికర్హులో గుర్తెరిగి అన్నీ సకాలంలో సిద్ధింప జేస్తాడు. మనం చేయవలసిందల్లా శ్రీవారిపై అపారమైన భక్తిశ్రద్ధలతో, మన కర్తవ్యాన్ని, వృత్తి ఉద్యోగధర్మాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా, గెలుపు ఓటములు కృష్ణార్పణమేనని భావిస్తూ, చిత్తశుద్ధితో నిర్వర్తించడమే.*


 కానీ మానవ సహజమైన ఆరాటంతో, మనం స్వామివారిని నిరంతరంగా ఏవేవో కోర్కెలు కోరుతూనే ఉంటాం.


 తలనీలాల సమర్పణ నుంచి నిలువు దోపిడి, అంగప్రదక్షిణం, తులాభారం, జోలె పట్టడం, శనివార వ్రతం, తిరుమలకు నడిచి రావడం, మెట్లను మోకాళ్ళతో ఎక్కడం వరకూ; భక్తులు సమర్పించుకునే ఎన్నో మొక్కుబళ్ళలో ముఖ్యమైన వాటిని ఈనాటి ప్రకరణంలో తెలుసుకుందాం.


 *నిలువు దోపిడి*


 అనుకున్న కోరిక నెరవేరితే వెంకన్న కొండకొచ్చి నిలువుదోపిడి సమర్పించుకునే సాంప్రదాయం తరతరాల నుండి ఉంది. 'నిలువుదోపిడి' అంటే మ్రొక్కుకున్న సమయంలో మన వంటి మీదున్న ఆభరణాలన్నింటినీ, తాళిబొట్టుతో సహా కోర్కె తీరిన తరువాత స్వామివారికి సమర్పించు కోవడమన్నమాట. శరీరం మీదున్న ఆభరణాలనే కాదు; మన దేహాన్ని, మనసును ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే అహంకారాన్ని, స్వార్థపూరిత భావనలను, అరిషడ్వార్గాలను సైతం భగవదార్పణ చేయాలి. అదే నిజమైన నిలువుదోపిడి. 


 సృష్టి సమస్తం దేవదేవుని సొత్తే అయినప్పుడు మనవిగా భ్రమ పడుతూ, మనం అనుభవిస్తున్న సిరిసంపదలు, భోగభాగ్యాలు మన సొంతం ఎలా అవుతాయి? ఈ ధర్మసూక్ష్మాన్ని ఆకళింపు చేసుకుని, వాటినన్నింటిని త్రికరణశుద్ధిగా స్వామివారి కర్పించడమే నిలువుదోపిడి.


 శ్రీవారికి అత్యంత ఆప్తులైన హాథీరాం బావాజీ, తరిగొండ వెంగమాంబ, అన్నమాచార్యుడు, తిరుమలనంబి, అనంతాళ్వార్ అందరూ తమ సర్వస్వాన్ని స్వామి చరణాలకు 'నిలువుదోపిడి' గా అర్పించి తరించినవారే. స్వామివారికి సమర్పించు కోవడం ద్వారా కోల్పోయిన దాని కంటే కొన్ని వందల, వేల రెట్ల లబ్ధిని పొందుతామని భక్తుల విశ్వాసం. అయితే, స్వామివారు మనకు ప్రసాదించేది భౌతికమైన సాధన సంపత్తులే కానక్కర లేదు. ఆరోగ్యవంతమైన శరీరం, సంస్కారవంతులైన సంతానం, ఒత్తిడి లేని సంసారం మొదలగు వాటి నుండి పరమపద ప్రాప్తి వరకూ, ఏదైనా కావచ్చు.


 'నేను', 'నాది' అనే మోహాపేక్షను త్యజించడమే 'నిలువుదోపిడి' మొక్కుబడి లోని పరమార్థం.



 *అంగప్రదక్షిణం* 


 కోరిన కోర్కెలు తీరినవారు, తాము ముందుగా మ్రొక్కుకున్నట్లు స్వామిపుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి విమానప్రదక్షిణ మార్గంలో, తడిచిన వస్త్రాలతో పొర్లుదండాలు పెట్టడమే 'అంగప్రదక్షిణం'. ఇంతకు మునుపు వెండివాకిలికి ఎదురుగా నున్న రంగనాథుని కుడ్యప్రతిమ వద్ద మొదలై, విమానప్రదక్షిణ మార్గంలో సవ్యదిశగా సాగి, తిరిగి అదే ప్రాంతంలో పూర్తయ్యే అంగప్రదక్షిణం; ప్రస్తుతం భక్తుల రద్దీ, స్థలాభావం వల్ల బంగారుబావి వద్ద మొదలై, హుండీ వద్ద, అర్జవృత్తాకారంలో ముగుస్తోంది.


 సాష్టాంగప్రమాణ మాచరించేటప్పుడు ఎలాగైతే శరీరం లోని అష్టాంగాలు భూతలాన్ని తాకుతాయో అంగప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఈ అష్టాంగాలు అలానే నేలను తాకాలి. సహజంగా ఏ అవయావల వల్లైతే పొరబాట్లు జరుగుతాయో; దేవదేవుని సమక్షంలో ఆ అవయవాలను నేలకు తాకించి, మన అహాన్ని స్వామివారికి సమర్పిస్తూ నీవే శరణమంటూ స్వామివారి చెంత చేరుతాం.


 అంగప్రదక్షిణానికి సంబంధించిన విధి విధానాలను, నియమ నిబంధనలను ఇంతకు మునుపే, వేరొక ప్రకరణంలో తెలుసుకున్నాం.


 *తులాభారం* 


 శ్రీవేంకటేశ్వరుని కృపాకటాక్షాలను సంపూర్ణంగా పొందాలంటే తప్పనిసరిగా చేయవలసింది తనను తాను సంపూర్ణంగా శ్రీవారికి సమర్పించుకోవడం. సమకాలీన ప్రపంచంలో అలా చేయడానికి అనేక పరిమితులు, ఇబ్బందులు ఉంటాయి కనుక తన శరీర పరిమాణానికి సమంగా ఉండే ద్రవ్యరాశి నేదైనా స్వామివారికి సమర్పించు కోవడమే 'తులాభారం'. ఆత్మసమర్పణా ప్రస్థానానికి తొలిమెట్టే ఈ 'తులాభారం'.

2  మ్రొక్కు తీరిన వెంటనే, ముందుగా అనుకున్న ద్రవ్యంతో స్వామివారి సన్నిధి లోనున్న త్రాసులో తూగి; ఆ ద్రవ్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు. అలా సమర్పింపబడే ద్రవ్యం కలకండ, బెల్లం, ధాన్యం, పప్పుదినుసులు వంటి తినే పదార్థాల నుండి నాణాలు, కరెన్సీ నోట్లు, వెండి అచ్చులు, బంగారు నాణేల వరకూ ఏదైనా కావచ్చు. శ్రీవారి భక్తులైన రాజాధిరాజులందరూ స్వర్ణాభరణాల తోనూ, రతనాల రాశుల తోనూ తులాభారం తూగి స్వామి కృపకు పాత్రులైన వారే..


 ఎందరెందరో చక్రవర్తులను తూచిన ఈ తరాజును ప్రస్తుతం సంపంగి ప్రదక్షిణమార్గం లోనున్న తిరుమలరాయ మంటపంలో చూడవచ్చు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: