18-04-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఇట్లు కర్మను గూర్చి భిన్నమతములను దెలిపి శ్రీకృష్ణమూర్తి అవ్విషయమున తన నిశ్చయమును తెలియజేయుచున్నారు–
నిశ్చయం శృణు వేు తత్ర
త్యాగే భరత సత్తమ! |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధస్సమ్ప్రకీర్తితః ||
తాత్పర్యము:- భరతకులోత్తముడవును, పురుషశ్రేష్ఠుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగవిషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడువిధములుగా చెప్పబడియున్నది కదా!
వ్యాఖ్య:- (1) కర్మలను బొత్తిగా వదలివేయవలెను. (2) తపోయజ్ఞదానాది కర్మలను మాత్రము వదలరాదు - అను రెండు వాదములను జెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్పుచున్నాడు -
"నిశ్చయం శృణు మే' - అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగ స్థిరపఱచుకొని, నిశ్చయించుకొనినదానినే వచించుచున్నారని అర్థము. ఆహా! ఇట్టి భగవన్నిశ్చయమందు జనుల కేల విశ్వాసము యుండరాదు?! సామాన్యులు ప్రకృతికి, మాయకు లోబడినవారుకావున వారి నిశ్చయములం దేవేని లోపములుండవచ్చును. కాని ప్రకృతికి అతీతుడై మాయాదోషములేని (చైతన్యరూపుడగు) పరమాత్మయొక్క భావములు అతినిర్దుష్టములై యుండును. అట్టి మహనీయుడు " నా నిశ్చయము వినుడు' అని చెప్పినపుడు ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలయునో యోచించుకొనుడు! కావున భగవాను డిపుడు చెప్పబోవు త్యాగము మున్నగువానిని గూర్చిన ఉదాత్తభావములను, నిశ్చయములను కడు జాగరూకతతో విని తదనురీతి యనుష్ఠించి తరించవలెను.
ప్రశ్న:- త్యాగ మెన్నివిధములని భగవానుడు తెలియజేసిరి?
ఉత్తరము: - మూడు విధములని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి