5, జూన్ 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*397 వ రోజు*


*భీమసేనుని మనోగతము*


అప్పటికి వారు రణరంగం సమీపించారు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఇరుపక్షముల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కర్ణుడి కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రధాశ్వములను, కేతనమును నరికాడు. ఉత్తమౌజుడు కత్తి తీసుకొని తనకు అడ్డంగా వచ్చిన కృపాచార్యుడి రధాశ్వములను నరికి వెంటనే శిఖండి రధము ఎక్కాడు. ఇంతలో అశ్వత్థామ కృపాచార్యుని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీమసేనుడి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి. అది చూసి భీముడు తన సారధి విశోకుడితో " విశోకా ! అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలగి పోయాడు. అన్న క్షేమం కనుగొనుటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు. వారికి కీడు కలిగిన ఈ యుద్ధముతో ప్రయోజనమేముంది. అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు. అది సరే మనకు సరిపడా బాణములు ఉన్నాయి కదా! విశోకా అటు చూడు ఆ కేతనమును చూసి అందు ఉన్న రథికులను పోల్చగలవా ! " అన్నాడు. బదులుగా విశోకుడు " భీమసేనా ! మనకు అస్త్రశస్త్రల గురించి చింత లేదు. అవి విస్తారంగా ఉన్నాయి. మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగ లేదు. నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా ! నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు " అన్నాడు. ఆ మాటలకు భీముడు సంతోషించాడు. అంతలో విశోకుడు " భీమసేనా ! అటు చూడు నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు " అన్నాడు. అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగి పోయి " విశొకా ! మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము " అన్నాడు. వెంటనే విశోకుడు రధమును అర్జునుడి వైపు పోనిచ్చాడు. రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు కౌరవసేనలను దునుమాడి తన పరాక్రమంతో వాటిని తరముతున్నాడు. మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను దునుమాడుతున్నాడు. అది చూసి సుయోధనుడు " భీముడు చస్తే కాని పాండవసేన పారిపోదు. ముందు వీడిని చుట్టుముట్టి చంపండి " అన్నాడు. కౌరవసేనలోని ప్రముఖవీరులు భీముని చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. భీముడు విచక్షణారహితంగా శత్రుసేనను చంపుతున్నాడు. శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని వేరొక విల్లందుకుని భీముని సారధిని, రధాశ్వములను పదునారు బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. శకుని లాఘవంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు. అది భీముని చేతిని గాయపరిచింది. అది చూసి కౌరవసేనలు ఆనందించాయి. వెంటనే భీముడు విల్లందుకుని శకుని శరీరం అంతా శరములతో నింపాడు. శకుని రధము మీద కూలిపోయి మూర్ఛిల్లాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: