5, జూన్ 2025, గురువారం

విజయం సాధించాలి"

 పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తొలగించుకోవచ్చా? యోగ వాసిష్ఠ గ్రంథం ఏమని చెబుతున్నది?


జవాబు


వాల్మీకి రచించిన యోగ వాసిష్ఠగ్రంథం ఈ విషయంలో మనకు చక్కటి హామీ ఇచ్చింది.


యోగ వాసిష్ఠములోని ఈ రెండు శ్లోకాలు మానవ ప్రయత్నం (పురుషార్థం) మరియు విధి ( పూర్వ జన్మ కర్మ ) మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి.


శ్లోకం 02-05-05:


ద్వౌ హుడావివ యుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ |

ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్ ||


 "రెండు పొట్టేళ్లు ఒకదానితో ఒకటి తలపడినట్లు, ప్రాక్తనం (గత కర్మల ఫలితం లేదా విధి) మరియు ఐహికం (ప్రస్తుత మానవ ప్రయత్నం) అనే రెండు పురుషార్థాలు సమానంగా పోరాడుతాయి" అని చెబుతుంది. 


ఈ రెండింటిలో ఏది బలహీనంగా ఉంటుందో అది శమిస్తుంది, అంటే ఓడిపోతుంది.


 మన జీవితంలో జరిగే పుణ్య సంఘటనలు గత కర్మల ప్రభావం రెండూ ఒకదానితో ఒకటి నిరంతరం ప్రభావితం చేసుకుంటూ పొట్టేళ్లలా పోరాడుతుంటాయి. 


ఈ పోరాటంలో, ఏది తక్కువ శక్తివంతంగా ఉంటుందో, అది పైచేయి సాధించలేదు. 


అంటే, మనం బలహీనమైన పుణ్య ప్రయత్నం చేస్తే, విధి ప్రభావం ఎక్కువ అవుతుంది; 


అదే మనం దృఢమైన ప్రయత్నం చేస్తే, విధి ప్రభావం తగ్గవచ్చు.


ఇంకొకటి ఎదుటి పొట్టేలు చచ్చేదాక రెండవ పొట్టేలు పోరాటం మానదు. పారిపోదు. 


ఇది మన పుణ్య కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకం.


శ్లోకం 02-05-06:


అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా |

పుంసా తన్త్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్ ||


 "కాబట్టి, మనిషి తన ప్రయత్నంతో ఎలాగైనా సరే, పూర్తి శక్తితో పుణ్య కార్యక్రమాలు చేస్తూ కష్టపడాలి" . "తంత్రం ద్వారా మంచి యోగంతో, ఈనాటి ప్రయత్నం (ప్రస్తుత పురుషార్థం) త్వరగా విజయం సాధించాలి" అని చెబుతుంది.


 మనిషి కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు, సరైన పద్ధతిలో, సరైన వ్యూహంతో, పూర్తి శక్తితో ప్రయత్నం చేయాలి. 


అప్పుడే ప్రస్తుత ప్రయత్నం గత కర్మల ప్రభావంపై పైచేయి సాధించి, త్వరగా విజయం పొందగలదు. 


మనం చేసే ప్రయత్నం ఎంత పటిష్టంగా ఉంటే, మన భవిష్యత్తును మనం అంతగా తీర్చిదిద్దుకోగలం అనే సందేశాన్ని ఈ శ్లోకం ఇస్తుంది.

కామెంట్‌లు లేవు: