18-61-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అII ఈశ్వరుడు తనమాయచే సమస్తభూతములను కీలుబొమ్మలను వలె త్రిప్పుచున్నారని తెలుపుచున్నారు –
ఈశ్వరస్సర్వభూతానాం
హృద్దేశేఽర్జున! తిష్ఠతి |
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా||
తా:- ఓ అర్జునా! జగన్నియామకుడు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత సమస్తప్రాణులను యంత్రము నారోహించినవారిని వలె(కీలుబొమ్మలను వలె) త్రిప్పుచు సమస్తప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు.
వ్యాఖ్య:- ఈశ్వరు డెచట నున్నారు? ఏమి చేయుచున్నారు? అను ప్రశ్నలకిచట సమాధానము చెప్పబడినది. ఈశ్వరుడు (భగవంతుడు) దూరముగనే యున్నాడని తలంచుట వెఱ్ఱి. వారు జీవులకు, అతిసమీపమున హృదయమందుగూడ (ఆత్మరూపమున) అధివసించుచున్నారు. కనుకనే "సర్వభూతానాం హృద్దేశే” - అని చెప్పబడినది. కావున భగవత్సాన్నిధ్యమును ఎల్లపుడు ననుభవించుచు, పాపాచరణములేక, భక్తియుతులై మెలగవలెను. జీవులుచేయు సమస్తకార్యములను, సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షిమాత్రుడై సదా వీక్షించుచునేయుండునని ఎవరును మఱవరాదు. ఈశ్వరుడనగా ప్రభువు, శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించునట్లు వారు సమస్తప్రాణికోట్లను శాసించుదురు. వారివారికి కర్మానుకూలముగ ఫలముల నొసంగుదురు. రాజాజ్ఞను మీరినచో జనులకెట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మము నుల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడై, తన దుష్కర్మఫలితమగు ఫెూరదుఃఖము ననుభవించును. కావున హృదయమున, బాహ్యమున, సర్వత్ర ఈశ్వరసన్నిధిని సదా భావించుచు ధర్మమును, సత్యమును, ఎవరును ఉల్లంఘించరాదు
భగవంతుడు ఏ ప్రదేశమందుండును? వైకుంఠమందా? కైలాసమందా? పాతాళమందా? ఇతరలోకమందా? వారెల్లెడల వసించుచుందురు. అతిసమీపమునగల హృదయప్రదేశమందును ఉందురు. కావున అట్టి పరమాత్మను సదా భక్తితో గొల్చుచుండవలెను. "సర్వభూతానామ్" అని చెప్పుటవలన ఏ ఒకానొక ప్రాణియందో కాదనియు సమస్త జీవకోట్లయందును భగవానుడు వెలయుచుండుననియు స్పష్టమగుచున్నది. కాబట్టి చీమయందును, దోమయందును, పశువునందును, చండాలునియందును కూడ వారు నివసించుచున్నారు. కాని ఎవని చిత్తము నిర్మలముగా నుండునో ఆతనియందు లెస్సగ భాసించుచు, వ్యక్తమగును.
యన్త్రారూఢాని - ఈశ్వరుడు మాయద్వారా సమస్తజీవులను సంసారరూపయంత్రమున త్రిప్పుచున్నాడు. యంత్రముయొక్క పెద్దచక్రములపై చిక్కుకొనిన చీమగాని పురుగుగాని, ఆ చక్రముతో బాటు తిరుగుచునేయుండును. అట్లే జీవులున్ను (ఈశ్వరునిచే మాయద్వారా త్రిప్పబడుచున్న) ఈ సంసారచక్రమున తగుల్కొని, ఆ చక్రముతో బాటు వివశులై తిరుగుచున్నారు. దానినుండి తప్పించుకొనుట కుపాయము రాబోవు శ్లోకమున తెలుపబడును. ఆ యంత్రమును త్రిప్పుచున్నవానిని (భగవంతుని) ఆశ్రయించుటయే ఆ యుపాయము.
'మాయయా" అని చెప్పుటవలన ఈశ్వరుడు ఈ సంసారచక్రమును త్రిప్పుచున్నప్పటికిని మాయద్వారా ఆ పరిభ్రమణమును గావించుటవలన వాస్తవముగ వారికేమియు కర్తృత్వము లేకయేయున్నది. వారు సాక్షిమాత్రులై వర్తించుచున్నారు.
ప్ర:- ఈశ్వరుడు ఎచట నివసించుచున్నాడు?
ఉ:- సమస్తప్రాణికోట్ల హృదయమందు.
ప్ర:- ఏమిచేయుచున్నాడు?
ఉ: - ఈ సంసారచక్రమున తగుల్కొనియుండు జీవులందఱిని త్రిప్పుచున్నాడు.
ప్ర:- దేనిద్వారా?
ఉ:- మాయాశక్తి చేత.
ప్ర:- ఏ ప్రకారముగ?
ఉ:- యంత్రమందు తగుల్కొనియుండు పురుగులవలె.
【 కనుక వివేకవంతుడు పరమాత్మను భక్తిశ్రద్ధలతో ఆశ్రయించి దుఃఖవిముక్తిని, పరమశాంతిని పొందవలసియున్నాడు】.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి