28, జులై 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము*


*450 వ రోజు*

*ప్రధమాశ్వాసం*


వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.


*కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు*

తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధభూమికి వెళదాము " అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద బ్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.


*ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము*


సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: