28, జులై 2025, సోమవారం

శ్రావణశ్రీలక్ష్ముల నోములు*

 *శ్రావణశ్రీలక్ష్ముల నోములు*


ఉ॥

శ్రావణలక్ష్మిపాదముల స్వచ్ఛమనమ్మును నిల్పి పూజలన్ 

పావనభక్తి సంచితపుపాపనివృత్తియవంగ వేడుచున్ 

నీవిఁక నాకు దిక్కు మరి నేఁ దలబెట్టను కిల్బిషమ్ములన్ 

కావవె యీయవే తిరముగాగ సుమంగళిభాగ్యమమ్మరో ! -1


కం॥

ఉత్తమగుణాఢ్యుడై వర

సత్తముడై మహితబుద్ధి సన్నుతమతియై 

చిత్తస్థిరత్వయుతుడై 

బత్తికి లోబడెడువాని భర్తగనిమ్మా! -2


కం॥

సుగుణోపేతులు కుదురగు 

నగణితధీశ్రీకుశలురు నమృతమూర్తుల్ 

పొగరెరుగని సంతానము 

తగ నీవిం జెలగు వారిఁ దయతో నిమ్మా! -3


కం॥

అని వేడంగవలయు శ్రా 

వణమాసపునోములందు మహిళామణులున్ 

మన గౌరియె శ్రీలక్ష్మియ 

మన భక్తియ పుష్పమౌను మంత్రము మాటౌన్ -4


కం॥

నోములు నోచెడి మహిళలు 

కామిత వరముల దలచుక కరుణను బ్రోవన్ 

లేమగు లక్ష్మినిఁ బూజల 

ధీమతులై గొల్వవలయుఁ దేజశ్శాలిన్ -5


కం౹

వరముల నిమ్మా కొమ్మా! 

సురవరుడౌ నీశుపత్ని! శోభితగౌరీ! 

యరమరికలు లేనట్టుల 

మురిపెముతో జూడు మనుచుఁ బూజలఁ జేయన్ -6


కం॥

కనికరమునుఁ జూపించును 

ననితర భక్తికి తనియుచు కామితమిచ్చున్ 

ఘనులగు భర్తల పుత్రుల 

పెనుసంతోషముల నిచ్చు వేలుపు తుదకున్ -7


కం॥

ఈ యింటికి నా యింటికి 

సాయంవేళల పడతులు సందడితోడన్ 

పాయక పేరంటములన్ 

వాయనముల నందఁ బోవ వారే లక్ష్ముల్ -8


తే.గీ.

పట్టుపరికిణీలనుగట్టి పైటవైచి 

పసుపు పాదాల మెడనిండ పసిడిఁబెట్టి 

వీథులందునఁ దిరుగాడు పేరటాళ్ళు 

భువిని శ్రీలక్ష్ము లనఁ జెల్లు ముదము గలుగ -9

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: