3, జులై 2025, గురువారం

తిరుమల సర్వస్వం -289*

 *తిరుమల సర్వస్వం -289*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-4


శిలాశాసనాలు


వేద, పురాణ, ఇతిహాస వాంగ్మయం; తమిళసాహిత్యం తరువాత తిరుమల ఆలయ చరిత్రను వెలికి తీయగలిగే సాధనాలు - ఆలయకుడ్యాల నిండా, కొన్ని చోట్ల నేల పైనా, తిరుపతి - తిరుచానూరు - మరికొన్ని స్థానిక దేవాలయాల లోనూ తామర తంపరలుగా చెక్కబడి ఉన్న శాసనాలే! వాటిలో సింహభాగం తమిళంలో, అతి కొద్ది శాసనాలు తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నాయి. ప్రాచీన చరిత్ర వెలికితీత దృష్ట్యా వాటి విలువను గుర్తించిన అప్పటి ఆలయ యాజమాన్యం, ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమార్థంలో - అంటే, ఆలయం మహంతుల ఆజమాయిషీలో ఉన్నప్పుడు - ఈ శాసనాల లోని సమాచారాన్ని సేకరించి తద్వారా అప్పటివరకూ మరుగున పడి ఉన్న ఆలయ చరిత్రను పునర్నిర్మించే బాధ్యతను ఆలయ పురాతత్వవేత్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి అప్పగించింది. ఈ కార్యక్రమంలో వారికి ఎదురైన అనేక అడ్డంకుల్లో కొన్నైనా తెలుసుకుంటేనే వారు పడిన శ్రమను గౌరవించిన వారమవుతాము -


వెయ్యికి పైగా ఉన్న శాసనాలలో అతికొద్ది మాత్రమే గ్రాంథిక భాషలో ఉండగా, మిగిలిన వాటిలో అప్పటి వాడుక భాషలు, స్థానిక మాండలీకాలు ఉపయోగించ బడ్డాయి. శతాబ్దాలు గడిచిన కొద్దీ వాడుక భాషలో, లిపిలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుని అవి గణనీయంగా రూపాంతరం చెందాయి. పైగా, 

మాండలీకాలకు ప్రామాణిక నిఘంటువులు లభించవు. 


శతాబ్దాల పర్యంతం దేవాలయానికి తరచూ మరమ్మతులు, విస్తరణలు జరిగి నప్పుడల్లా - శాసన ఫలకాలను తొలగించడమో, నష్టపరచడమో, స్థానభ్రంశం చేయడమో జరిగేది. ఒకరిద్దరు పాలకులు తప్ప మిగిలిన వారు శాసన ఫలకాల సంరక్షణపై శ్రద్ధ వహించలేదు. ఇది అన్నింటికన్నా పెద్ద అవరోధం.


అత్యధిక సంఖ్యలో లభించిన దానశాసనాలలో దాతల ప్రశస్తి మాత్రమే ఉండడంతో, అవి ఆలయ చరిత్ర తెలుసుకోవడంలో అంతగా తోడ్పడలేదు. 


శాసనాలలో చరిత్ర వక్రీకరణలు, స్వోత్కర్షలూ కూడా ఉన్నాయి. జైత్రయాత్రలకు, యుద్ధవిజయాలకు సంబంధించిన శాసనాలు విజేతల వాణినే వినిపించేవి కానీ వాస్తవాలకు అంతంతమాత్రం గానే అద్దం పట్టేవి. కొందరు సామంతులు, స్థానిక రాజప్రతినిధులు, ఆస్థాన విద్వాంసులు తమ తమ ప్రభువుల మెప్పు కోసం అభూత కల్పనలు కూడా సృష్టించేవారు. ఉదాహరణకు - విజయనగర ప్రభువైన సదాశివరాయలుచే లిఖించబడినట్లుగా చెప్పబడే శాసనంలో ఆయనను తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర మహాసముద్రాలకు కూడా ప్రభువుగా వర్ణించబడింది. నిజానికి అతని సామ్రాజ్యానికే కాదు, యావత్ భారతావనికి కూడా ఉత్తర మహాసముద్రం లేనే లేదన్నది జగమెరిగిన సత్యం. ఇటువంటి అసంబద్ధ విషయాలెన్నింటినో ఒడబోస్తే గానీ నిజాలు నిగ్గు తేలవు. 


కొన్ని దశాబ్దాల పాటు అవిరళ కృషి జరిపి, అవరోధాలన్నింటినీ అధిగమించి, శాసనాలను తర్జుమా చేయడంలో ఎట్టకేలకు శాస్త్రి గారు సఫలీకృతులయ్యారు. దాదాపు గత ఒకటిన్నర సహస్రాబ్దులుగా ఆలయం గురించి, క్షేత్రం గురించి మనకు తెలిసిన దాంట్లో అత్యధిక భాగం శాస్త్రి గారి పరిశోధన చలవే! 


పల్లవరాజుల పరిపాలన

➖➖➖➖➖➖

ముఖ్య చారిత్రక ఆధారాలైన శిలాశాసనాలలో దురదృష్ట వశాత్తూ ఏడవ శతాబ్దం ముందు వరకూ ఆలయ నిర్మాణము, నిర్వహణకు సంబంధించి ఏ సమాచారమూ లభించలేదు. అంతకు ముందు ఆలయం, ఆ పరిసర ప్రాంతాలు బాణచక్రవర్తుల ఏలుబడిలో ఉండేదన్న విషయం చూచాయగా తెలియడమే తప్ప, మరే వివరాలు లభ్యం కాలేదు.  


ఏడు నుండి తొమ్మిదవ శతాబ్దం వరకూ పల్లవ వంశానికి చెందిన రాజ కుటుంబీకులు, రాజప్రతినిధులే ఆలయ పరిపాలనను నిర్వహించేవారు. వారి ఆధ్వర్యంలో, తిరుచ్చొక్కనూర్ (ఈనాటి తిరుచానూరు) లో గల 108 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణుల సభయ్యార్ (కమిటీ అనుకోవచ్చు) ఆలయ దైనందిన వ్యవహారాలను, కైంకర్యాలను పర్యవేక్షించేది. రహదార్ల మరమ్మతులు, ఆలయభూముల కౌలు వ్యవహారాలు, మేలిమి బంగారం రూపంలో విరాళాలు సేకరించడం, ఆలయ దైనందిన నిర్వహణ కూడా సభయ్యార్ విధుల్లో భాగమే. అప్పుడు తిరుచానూరు గ్రామం తమిళ ప్రాంతానికి - తిరువేంగడానికి గల రహదారిలో ఉండటంతో పాలనా సౌలభ్యం కోసం సభయ్యార్ ను ఆ గ్రామంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈనాడు శ్రీవారిమెట్లుగా పిలువబడే నడక మార్గమే ఎక్కువగా వాడుకలో ఉండేది. పదవ శతాబ్దపు ప్రథమార్థంలో పల్లవ రాజవంశానికి చెందిన సామవై అనే భక్తురాలు భోగశ్రీనివాసుని ప్రతిమ తయారుచేయించడమే గాక, ఆలయానికి అనేక కానుకలను సమర్పించింది. ఆ వివరాలను సంబంధిత అధ్యాయాలలో మున్ముందు తెలుసుకుందాం. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: