3, జులై 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*426 వ రోజు*


*కురుక్షేత్రం*


బలరాముడు వృద్ధాశ్రమంలో ఉండగా కురుక్షేత్రంలో కౌరవులందరూ మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. తరువాత కురుక్షేత్ర సమీపంలో ఉన్న శమంతక పంచకం' వెళ్ళి అక్కడి మునులను అడిగి కురుక్షేత్రంలో జరిగిన విషయాలు తెలుసుకున్నాడు. వారు " ఈప్రదేశమును కురుమహారాజు దున్నడం వలన ఈ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. కురుమహారాజు అక్కడ పుట్టిన వారందరూ స్వర్గలోకం వెళ్ళాలన్న కోరికతో భూమిని దున్నాడని తెలుసుకున్న ఇంద్రుడు భూమిని దున్నితే స్వర్గ లోకం ప్రాప్తిస్తుందా ! అని హేళన చేసాడు. అయినా కురుమహారాజు పట్టు విడువక దున్నసాగాడు. అతడి పట్టుదలను చూసి దేవేంద్రుడు ఆ ప్రదేశంలో ఉపవసించి మరణించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని వరమిచ్చాడు " అని ఆ ప్రదేశ ప్రాశస్త్యం గురించి చెప్పారు. అప్పుడు అక్కడకు వచ్చిన నారదుడు అక్కడకు వచ్చి " ఈ 18 రోజుల యుద్ధంలో కురుసైన్యంలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అనే రథికత్రయం తప్ప మిగిలిన వారంతా మరణించారు. సుయోధనుడు మాత్రం ఒంటరిగా కృష్ణద్వైపాయన మడుగులో జలస్తంభన విద్య ద్వారా దాక్కొని ఉండగా ధర్మరాజు మాటలకు బయటకు వచ్చి భీమునితో యుద్ధము చేయ సిద్ధముగా ఉన్నాడు. వారిరువురు నీ శిష్యులు కనుక నీవు వెళ్ళి వారి యుద్ధం తిలకించు " అని చెప్పాడు. వెంటనే బలరాముడు కురుక్షేత్రం చేరుకున్నాడు. అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడని సంజయుడు వివరించి " మహారాజా ! బలరాముని చూసి నీ కుమారుడి ముఖం వికసించింది. తన పక్షమున తన గురుదేవుడు ఉన్నాడనుకుని సంతసించాడు. సుయోధనుడు ధర్మనందనుడిని జూసి " ధర్మనందనా ! ఇక్కడికి సమీపంలో శమంతక పంచకంలో మరణించిన వారికి ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి కనుక యుద్ధం అక్కడ జరగడం మంచిది కదా ! " అన్నాడు. బలరాముడు ఆ మాటను సమర్ధించడం వలన అందరూ అక్కడకు వెళ్ళారు.


*భీమ సుయోధనులు సమరం*


శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, యాదవులు, పాంచాలురు చతురంగబలాలు చుట్టూ ఉండగా మధ్యలో భీమ సుయోధనులు యుద్ధానికి సన్నద్ధ మయ్యారు. భీముడు " ధర్మరాజా ! ఈ నీచుడు ఎన్నో పాపాలు చేసాడు. ఇతడికి ఈ రోజుతో ఆయుస్షు తీరింది. నాడు సభలో నేను చేసిన శపధం ఈ రోజు వీడి తొడలు విరిచి నెరవేర్చుకుంటాను " అన్నాడు. సుయోధనుడు కూడా " ఈ రోజు నీకూ నా చేతిలో చావు మూడింది. నాతో గధా యుద్ధం చేయడానికి ఈశ్వరాదులే వెనకడుగు వేస్తాడు. ఇక నీ వెంత ! నిన్ను చంపి సర్వం సహా కురు సామ్రాజాధిపత్యం వహిస్తాను " అన్నాడు. ఇలా ఒకరిని ఒకరు దూషించుకుంటుండగా యుద్ధ ప్రారంభసూచిక మ్రోగింది. భీమసుయోధనులు మహా ఉద్రేకంతో యుద్ధం చేయతలపడ్డాడు. బలరాముడు ఆసక్తిగా చూస్తుండగా ఒకరిని ఒకరు బెదిరించుకుంటూ గుండ్రంగా తిరుగుతూ గదలతో మోదుకుంటూ ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వారి పదఘట్టనలతో భూమి కంపిస్తుంది. వారి కిరీటములు కింద పడ్డాయి, ఆభరణములు క్రిందరాలాయి కవచాలు విరిగి పోయాయి. ఒకరి గదను ఒకరు చుట్టి లాగుతున్నారు. అంతలోనే వెనక్కు తగ్గుతున్నారు. ఏనుగుల మాదిరి ఢీకొట్టుకుంటున్నారు, ఒకరు కొట్టే దెబ్బలు ఒకరు తప్పించుకుంటూ తిరిగి దెబ్బతీస్తూ ఉన్నారు. గదాఘాతముల వలన ఇద్దరి శరీరాలు రక్తసిక్తమయినా వెనక్కి తగ్గ లేదు. కాసేపు సొమ్మసిల్లి తిరిగి బలం పుంజుకుని తిరిగి యుద్ధం చేస్తున్నారు. వారిద్దరి మధ్య జయాపజయాలు నిర్ణయించడం చాలా కష్టం అయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: