27, జులై 2025, ఆదివారం

కురవంజి

 🙏🙏🙏 జానపద కళారూపాలు---- కురవంజి

                మొదటి భాగము

జానపద కళారూపాలు ఉపోద్ఘతం 

జానపద కళారూపాలంటే ఈనాడు చాల మందికి అర్థం కావు.ఎందుకంటే ఈ కళా రూపాల ప్రదర్శన ఈనాడు కనబడుట లేదు ఈ కళలను పోషించువారు కరువైయ్యారు.

జానపదమంటే పల్లెటూరని, జానపదంలో నివసించే వారు జానపదులనీ, వారు పాడుకునే పాటలు గానీ ఆటలు గానీ, నృత్యం గానీ, జానపద కళారూపాలని పెద్దలు నిర్వచించారు.

తెలుగు జానపద ప్రదర్శన కళల చరిత్రలోనికి కొంచెం చూస్తే కొన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. ఎప్పటినుండి ఈ కళారూపాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే సరిగ్గా ఏ శతాబ్దంలో ఇవి ప్రారంభం అయ్యాయో చెప్పడానికి ఆధారాలు లేవు. వీటి మొదలు ఎప్పుడు అన్నది ఎవరూ చెప్పలేరు. కాని జానపద సాహిత్యమే జానపద ప్రదర్శన కళలకన్నా ముందటిదని మాత్రం తార్కికంగా చెప్పడానికి వీలున్నది. సంస్కృతి కొంత పరిణామ దశను చేరుకున్న తర్వాత ఆ క్రమంలోనే జానపద ప్రదర్శన కళలు క్రమంగా జీవం పోసుకొని ఉంటాయి. జానపద ప్రదర్శన కళలు పరివర్థిత నాటకాలలాగే, అన్నీ సమాహార కళలు. పరివర్థిత నాటకానికి ఆధునిక నాటకానికి జానపద నాటకాలే మూలాలు. రెండు వేల సంవత్సరాలనాటిదిగా భావిస్తున్న భరతుని నాట్య శాస్త్రంలో ఆనాటికి లభిస్తున్న దేశి నాటక రూపక ప్రక్రియల గురించిన వివరాలు ఉన్నాయి. వాటిని జానపద ప్రదర్శన కళలు అనే అర్థం చేసుకోవాలి. సంస్కృత ప్రక్రియలలో చేరిన వీధి అనే తరహా రూపక ప్రక్రియ జానపద ప్రక్రియకు మారు రూపమే. కాని భాష మారుతుంది. సంస్కృత సాహిత్యంలోని చాలా ఆధారాలను పరిశీలిస్తే భారత దేశంలో జానపద ప్రదర్శన కళలు దాదాపు ఈ కాలంనుండే ఉన్నాయని చెప్పడానికి వీలుంది. కాని అంత ప్రాచీన కాలంనుండి అంటే రెండు వేల సంవత్సరాల కాలంనుండి తెలుగు జానపద కళారూపాలు ఉన్నాయని చెప్పడానికి నిక్కచ్చి ఆధారాలు లేవు. అసలు తెలుగు భాష అప్పుడు ఉందో లేదో కుడా చెప్పడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు ఏవీ మనకు లభించవు. శాతవాహనులు తెలుగు రాజులు అని చెబుతున్నారు. వారికాలం నాటిదైన గాథా సప్తశతిలో కళారూపాలకు సంగీత వాద్యాలకు చెందిన పరోక్ష ఆధారాలను కొంతమంది విద్వాంసులు చూపారు. కాని గాథాసప్తశతి తెలుగులో లేదు. ప్రాకృతంలో ఉంది. ఆధారాలు ఉన్నా కూడా అవి ఏ భాషలో ఉన్న కళారూపాలను తెలుపుతున్నాయో చెప్పడం, రుజువు చేయడం కష్టం. కేవలం 11, 12 శతాబ్దాల కాలం నుండే మనకు నమ్మదగ్గ చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. 11 వ శతాబ్ది కాలంనాటికే ఎన్నో జానపద కళారూపాలు ఉన్నట్టు తిరుగలేని ఆధారాలతో చెప్పవచ్చు. కాని అంతకు ముందు లేవు అని అనడానికి వీలులేదు. ఆధారాలు లేనంత మాత్రాన ఐదారు, శతాబ్దాలు ఏడు ఎనిమిది శతాబ్దాలలో జానపద కళారూపాలు తెలుగులో లేవు అని అనడానికి వీలులేదు. ఆరవ శతాబ్ది కాలంనాటికే తెలుగు భాష బాగా అభివృద్ధి చెందినదని చెప్పడానికి చారిత్రకులు చాలా శాసన ఆధారాలు చూపుతున్నారు. అంత అభివృద్ధి చెందిన భాష ఉన్నప్పుడు ఆనాటికే జానపద ప్రదర్శన కళలు ఉండి ఉండాలి. కాని వాటిని వివరంగా చెప్పే వివరమైన ఆధారాలు ఆ శాసనాలలో లభించలేదు. క్రీస్తుశకం 1200 ప్రాంతం వాడైన పాల్కురికి సోమనాథుడు దేశిసాహిత్య పితామహుడుగా ఉండి పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే శైవసాహిత్య గ్రంథాలను దేశి సాహిత్యంలో రచించాడు. ద్విపద ఛందస్సు జానపద సాహిత్యనికి అత్యంత దగ్గరి రూపం. ఝటితిగా రచితమయ్యే చాలా జానపద గేయాలలో ఈ ఛందస్సు రూపాలు ఉంటాయి. అందుకే ప్రచారం అవసరం అనుకున్న విషయాలను ప్రజలకు విరివిగా అందించాలనుకున్న కథలను ఆనాటి కవులు జానపద సాహిత్యానికి చాలా దగ్గరిగా ఉన్న ద్విపద ఛందస్సును స్వీకరించి రచించారు. పాల్కురికి, శ్రీనాథుడు (పల్నాటి వీరచరిత్ర), రంగనాథ రామాయణ కర్త ఇందుకు మంచి ఉదాహరణలు. జానపద జీవితాన్ని విస్తారంగా వర్ణించిన సోమన జానపదులైన శివభక్తుల జీవితాలను కథలను విపులంగా వర్ణించిన సోమన వాటిలో భాగంగానే జానపద కళలను వివరంగా వర్ణించాడు. తన కాలం నాటికి తెలిసిన చాలా జానపద కళలను గురించి ఆచూకీ చెప్పడం మనకు ఇందులో బాగా కనిపిస్తూ ఉంది. పాల్కురికి రచనలలో ఉన్న జానపద కళల గురించి ఇప్పటికే చాలా మంది పండితులు చెప్పిఉన్నారు. వాటిని తిరిగి వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. కాని ఏయే కళారూపాల ప్రసక్తి ఉందో చెప్పడం అవసరం. చాలామంది నాటకాలు ఆడుతున్నారని చెప్పాడు అవి జానపద నాటకాలే. రోకళ్ళ పాటలను గురించి చెప్పి వాటిని పాడే ఘట్టాల్ని చెప్పాడు. పిచ్చుకుంటి కళాకారులు శ్రీశైలం వెళ్తున్నట్లుగా వర్ణించాడు. పిచ్చుకుంటి కళాకారులు ఈనాటికీ జీవించి ఉన్నారు. వీరి కళారూపమైన పిచ్చుకుంటికథ ఇప్పటికీ బాగా తిరుగుతూ ఉంది.

కుఱవంజి 

తెలిసినంతలో తెలుగువారి మొదటి జానపద కళారూపం కొరవంజి. ఈ విషయాన్ని దృశ్య కళారూపాల మీద పరిశోధించిన చాలామంది పెద్దలు ఋజువు చేశారు. దీన్ని కుఱవంజి అని కూడా ఉచ్చరిస్తున్నారు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ పదం నుంచే యక్షగానం అనే పదం ఉత్పన్నమైందని చెప్పారు. కుఱవంజి అంటే కొరవజాతి స్త్రీ (ఎఱుకది) అని సూర్యారాయాంధ్ర నిఘంటువు చెబుతుంది. కొరవంజి అను పాత్ర ప్రవేశము గల యక్షగాన రచనకు కొరవంజి అనిపేరు అని ఆంధ్ర వాఙ్మయ సూచిక చెబుతుంది. వంజి అంటే తమిళభాషలో స్త్రీ అని అర్థం. దక్షిణదేశంలో కొరవలుగా చెప్పబడుతున్న జాతిని తెలుగునాట ఎరుకలు అని పిలుస్తారు. అక్కడా ఇక్కడా ఈ జాతి స్త్రీ ఎరుక చెప్పడం ఉంది. దీనిని బట్టే ఈ జాతి ఎరుకలుగా పిలువబడుతున్నారు. వీరి వేషంలో చోటు చేసుకొన్న రకరకాల చర్మాలు, నెమలి ఈకలు, పులి గోళ్ళు వంటి వస్తువులతో వీరిని మొదట ఆటవికులై ఉండవచ్చని భావించవచ్చు.


ఈ కళారూపాన్ని గూర్చి శిలప్పదిగారంలో కురవైక్కూత్తు అని నృత్యవిశేషంగా చెప్పారు. అంటే ఈ కళారూపం ఎంత ప్రాచీనమైందో చెప్పవచ్చు. శిలప్పదిగారం క్రీ.శ. 2వ శతాబ్దం కాలం నాటిదని (దీక్షితులు వి.ఆర్‌.ఆర్‌.) పెద్దలు చెప్పారు. తమిళ దేశంలో కొండజాతి స్త్రీలు (కొరవలు) సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కొలుస్తూ చేసే నృత్యం ఒకటి, కొరవ స్త్రీలు శ్రీకృష్ణుని కొలుస్తూ (రాసలీల) చేసే నృత్యం మరొకటి ప్రచారంలో ఉండేవని తెలుస్తుంది. మద్రాసు విశ్వవిద్యాలయ తమిళ నిఘంటువు కూడ కురవ అంటే ఒక నాట్య విశేషంగా చెప్పింది. అది మండల నృత్యంగా ఉండేదని ఉదహరించింది. తరువాతి కాలంలో తమిళంలో కొరవంజి పేరునే కొన్ని రచనలు వచ్చాయి. ఇప్పటికీ జానపద ప్రదర్శనలు వారు ప్రదర్శిస్తూనే ఉన్నారు.


తెలుగులో కొరవంజి శబ్దం మొదట వాడినవారు అయ్యలరాజు రామభద్రకవి. రామాభ్యుదయం ద్వితీయాశ్వాసంలో 131వ పద్యంలో,


అణునిభ మధ్యలాక్రియలు నాపరిభాషలు నొప్పఁజిందు జ

క్కిణి కొరవంజి మేళములఁ గేళిక సల్పిరి దేవతా నటీ

మణులకు బొమ్మువెట్లు క్రియ మర్దళతాళ నినాద పద్ధతిన్‌

రణదురు రత్ననూపుర ఝణం ఝణముల్‌ మెఱయం బదాహతిన్‌

అని కొరవంజి ప్రస్తావన చేశాడు. అంటే విజయనగర రాజుల కాలంలో దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ ఈ కళారూపం విశేష ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. అంతే కాదు యక్షగానంతో సమానమైన స్థానం ఈ కళారూపానికిచ్చి పోషించారని కూడా భావించవచ్చు.


కాలక్రమేణ కొరవంజి కళారూపానికి ఆదరణ అంతంత మాత్రం అయిపోయింది. కళారూపంలోనికి ప్రధాన పాత్రలు సింగి, సింగడు మాత్రం మిగిలాయి. ఎరుక చెప్పడం, అదే జీవనోపాధిగా ఎరుకలు స్వీకరించారు 


జానపద గేయాలనీ జానపద సాహిత్యమనీ, జానపద వీథి నాటకమనీ, తోలు బొమ్మలనీ, బుర్ర కథలనీ, పగటి వేషాలనీ,కురవంజి ఇలా ఎన్నో వందలాది జానపద కళా రూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞాన వినోద వికాసాన్ని కలిగించాయి.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండు వేల సంవత్సరాల నాటిది. నాటి నుంచి నేటి వరకూ ఆయా రాజుల కాలాల్లో రకరకాలుగా ఈ జానపద కళలు ఆభివృద్ధి చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు కూడా అభివృద్ధి పొందాయి. ప్రజలు ఆదరించారు.


శతాబ్దాలుగా రాజులు పోయినా, రాజ్యాలు మారినా జానపద కళలు మాత్రం ప్రజా హృదయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటు పోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళాకారులను కన్న బిడ్డలుగా చూసుకున్నారు. తెలుగుజాతి గర్వించ తగిన కళారూపాలవి.


నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటి పట్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే వారు తగ్గి పోయారు. కళాకారులు కడుపు కోసం, కళలనే పట్టుకుని దేశ సంచారులుగా తిరుగుతూ కళా ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ చాలీ చాలని ఆదాయాలతో కడుపు నింపుకుంటూ జీవిస్తున్నారు.

కురవంజి ఒక జానపద దృశ్యకావ్యం. కురవంజి అంటే, ఎరుకలసాని, పూర్వం ఈ ఎరుకలసాని సంఘంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంది. ఆ నాడు విజయనగర రాజుల కాలంలోనూ ఎరుకలసాని ఎంతో ప్రాముఖ్యత వహించింది. ఈ ఎరుకలసాని వినోద కాలక్షేపానికీ యదాలాపంగా ఆటలు పాటలు జోడించి ప్రారంభించిన కళారూపం కురవంజి.


                          సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: