🕉 మన గుడి : నెం 1217
⚜ ఒడిస్సా : పూరీ
⚜ శ్రీ క్షేత్రం - జగన్నాథ స్వామి ఆలయం
💠 మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ ఆలయం.
💠 జగన్నాథ ఆలయాన్ని శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో జగన్నాథుడిగా ప్రధాన దైవంగా నిర్మించినప్పుడు, పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.
🔆 స్థలపురాణo
💠 కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు.
అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు.
💠 ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే రాజు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు.
అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు.
అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు.
అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.
💠 ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట.
కానీ అలా నదీతీరంలో
లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట.
💠 అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజువద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట.
కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తాననీ తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు.
💠 కానీ పదిహేను రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు “తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు.
అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు.
💠 దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాధుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం
💠 విమల ఆలయం (బిమల ఆలయం) శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది .
ఇది ఆలయ సముదాయంలోని రోహిణి కుండ్ సమీపంలో ఉంది . జగన్నాథుడికి సమర్పించిన ఆహారాన్ని విమల దేవతకు సమర్పించే వరకు దానిని మహాప్రసాదంగా పరిగణించరు.
🔆 రథయాత్ర
💠 ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం.
ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు.
💠 ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే...
పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ జగన్నాథ బలభద్రుల కోసం ప్రధానాలయానికి 3 కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం.
💠 రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిధ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాధుడి అతిథిగృహం అన్నమాట!
💠 ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం.
💠 సుభద్రా బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు.
అందుకే జగన్నాథుడి రతయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
💠 జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు.
ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.
💠 శ్రీ జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు.
బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు.
సుభద్ర రథాన్ని దర్పదళన అంటారు.
💠 ఇక్కడ భగవంతుడికి 56 రకాల ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద వండి భగవంతుడికి ప్రతినిత్యం నివేదిస్తారు.
ఆ ప్రసాదాలన్నీ నిలువునా పేర్చిన 6 కుండలలో వండుతారు, కట్టెల పొయ్యికి దగ్గరగా ఉండే కుండలో ఎంత నాణ్యతతో ప్రసాదం తయారు అవుతుందో చివరి కుండలో కూడా అంతే నాణ్యతతో ప్రసాదం తయారవడం ఇక్కడి భగవంతుడి లీలగా పరిగణిస్తారు.
💠 అలా నివేదించబడిన ప్రసాదాలను ఆనంద్ బజార్ అని ప్రదేశంలో భక్తుల కోసం సరసమైన ధరలకు విక్రయిస్తారు.
అలా భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రసాదాన్ని " అబడా" అంటారు.
పూరీ క్షేత్రంలో భగవంతుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి సరి సమానంగా ఈ ప్రసాదం స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.
💠 ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది.
రచన
©️ Santosh kumar
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి