*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శాంతి పర్వము ప్రథమాశ్వాసము*
*482 వ రోజు*
*సృంజయుడి వృత్తాంత*
తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నాను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.
*వ్యాసుడి హితవు*
నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి