అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - శివ తాండవ కథనం - నూట నలభై నాలుగవ భాగం
______________________________________________________
శౌనకాది మునులు సూత మహర్షిని "మహర్షీ! శివుడు శివతాండవః ఎప్పుడు ఎందుకు ప్రారంభించాడో తెలియచేయండి" అని అడిగారు.
సూత మహర్షి "మునులారా! శ్రీ లింగ మహాపురాణంలో చెప్పినది వివరిస్తాను. వినండి.
పూర్వం దారుకుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి "స్త్రీ నుంచి పురుషుని ద్వారా సృష్టించబడిన స్త్రీ వలనే మరణం పొందే" వరం పొందాడు. తరువాత ముల్లోకముల పైకి దాడి చేసి దేవతలను, మునులను హింసించి చంపసాగాడు. యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డుపడ్డాడు.
దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి దారుకుని నుంచి రక్షించమని కోరగా బ్రహ్మ " ఆ ఆసురుడు స్త్రీ ద్వారా పురుషుడి నుంచి సృష్టించబడిన స్త్రీ చేతిలో మరణిస్తాడు" అని చెప్పాడు. అలాంటి స్త్రీ జననం కోసం ఏం చేయాలి అని అడగగా బ్రహ్మ "మనమందరం మహాదేవుడు, మహాదేవి వద్దకు వెళ్లి ప్రార్ధించుదాం. వారే దారి చూపుతారు " అని వారిని తీసుకుని కైలాసం వెళ్ళాడు.
శివపార్వతులను అనేక విధాలుగా స్తుతించి దర్శనం ఇమ్మని ప్రార్థించారు. ఉమాదేవితో కలసి పరమేశ్వరుడు దర్శనమిచ్చి రాకకు కారణం అడిగాడు. బ్రహ్మ నమస్కరించి "పరమేశ్వరా! దారుకుడు అనే రాక్షసుడు తపస్సు చేసి స్త్రీ ద్వారా పురుషుని వలన సృష్టించబడిన స్త్రీ వలనే మరణం పొందే వరం పొందాడు. తరువాత దేవతల స్వర్గం పై దాడి చేసి తరిమి కొట్టాడు. భూమి పై మునులు, బ్రాహ్మణుల పై దాడి చేసి బాధపెడుతూ, చంపుతూ యజ్ఞయాగాదులు మొదలైనవి అన్ని ఆపివేశాడు. తమరే ఆ స్త్రీని సృష్టించి దారుకుని చంపి మమ్మల్ని రక్షించండి" అని ప్రార్ధించాడు.
పరమేశ్వరుడు పార్వతీదేవి వంక చూసి "ముల్లోకాల రక్షణ కోరకు రాక్షస సంహారానికై తగిన స్త్రీ శక్తిని సృష్టించడానికి నాకు సహాయం చేయాలి " అని కోరాడు. పార్వతీదేవి సరేనని తన అంశ రూపాన్ని శివునిలో ప్రవేశపెట్టింది. చూస్తున్న దేవతలకు మాత్రం ఒకరి వంక ఒకరు చూస్తూ పక్క పక్కన కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న శివ పార్వతులు కనిపిస్తున్నారు.
పరమేశ్వరునిలో ప్రవేశించిన పార్వతి అంశ రూపము శివుని కంఠంలోకి చేరింది. కంఠంలో గల విషమును పార్వతి తన అంశరూపంతో కలిపి నీలవర్ణముతో విషపూరితంగా చేసింది.
పరమేశ్వరుడు ఆ నీల స్త్రీ శక్తి రూపాన్ని తన మూడవ నేత్రము తెరచి బయటకు తెచ్చి కాళికాదేవిని సృష్టించాడు. త్రినేత్ర అయిన కాళికాదేవి నల్లని కంఠంతో అగ్ని జ్వాలలు చిమ్ముతూ భీకరంగా కనిపిస్తుండటంతో ఇంద్రాది దేవతలు భయపడి దూరంగా పారిపోయారు.
కాళికాదేవి లలాటము పై మూడో నేత్రము, శిరస్సు పై చంద్రవంక కలిగి త్రిశూలము ధరించి జగన్మాత పార్వతి వంక చూసింది. దారుకుని సంహరించ వలసిందిగా పార్వతీదేవి ఆదేశం ఇచ్చింది. పార్వతి ఆదేశం పాటించి కాళికదేవి దారుకుని నగరానికి వెళ్లింది. ఆమె వెంట భూత పిశాచ గణాలు వెళ్లాయి.
దారుకునితో పోరాడి భయంకరంగా దారుకుని సంహరించింది. రాక్షసుడి సంహారం తరువాత కూడా కాళికదేవి ఉగ్రరూపం శాంతించ లేదు. అడ్డు వచ్చి వారిని సంహరిస్తూ, రక్త పానం చేస్తున్న కాళికకు భయపడి దేవతలు మునులు శివుని శరణు వేడారు. శివుడు బాలకుని రూపం దాల్చి కాళికదేవికి ఎదురు వెళ్లాడు.
శ్మశానంలో భీకరంగా గర్జిస్తూ తిరుగుతున్న కాళికాదేవి ఎదురుగా వచ్చిన చిన్న బాలుని చూసి ఆగిపోయింది. శివమాయ చేత బాలునిపై మాతృ ప్రేమ కలిగి ఎత్తుకుని శిరస్సును ముద్దాడి తన వక్షస్థలానికి హత్తుకుంది. పసిబాలుడైన శివుడు ఆమె పాలతో పాటు క్రోధాగ్నిని త్రాగి వేసి అదృశ్యమయ్యాడు.
శాంతురాలైన కాళికదేవి శశ్మానంలో కూర్చుండి మౌనంగా ఉండిపోయింది. సంధ్యా కాలము అయ్యింది. కాళికదేవిని ప్రసన్నం చేయడానికి శివుడు భూత ప్రేత గణాలతో అక్కడకు వచ్చి మొదటిసారి శివ తాండవ నృత్యము చేశాడు. కాళీకాదేవి కూడా ప్రసన్నురాలై తన యోగిని గణాలతో కూడి శివునికి కలిసి తాండవ నృత్యం చేసింది.
శివ కాళికాదేవిల తాండవ నృత్యం చూసిన బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు, మునులు కాళికదేవిని అనేక విధాలుగా స్తుతించారు. కాళికదేవి ప్రసన్నురాలై అదృశ్యమయ్యింది. శివ పార్వతులు ప్రత్యక్షమైనారు. బ్రహ్మాది దేవతలు వారిని స్తుతించి తమను దారుకుని నుంచి రక్షించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇది మొదటి సారి శివుడు చేసిన తాండవ నృత్య కథ. కొందరు శివతాండవం యోగకారణము చేత కలిగిన ఆనందము వలన చేసింది అని అంటారు" అని సూత మహర్షి ఆ రోజుకి భాషణం ముగించాడు.
తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.
మీ అమూల్యమైన స్పందన కోరుతూ.
మీ
శ్రీకాంత్ గంజికుంట కరణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి