18, జులై 2020, శనివారం

శ్రీ వామన మహా పురాణం - 18 వ అధ్యాయం

బ్రహ్మర్షే ! ఆశ్వయుజ మాసంలో జగన్నాధుని నాభి నుండి పద్మం పుట్టంగానే యితర దేవతలు నుంచి కూడా ఆయా పుష్పాదులుధ్భవించాయి. కామదేవుని కరాగ్రాన్నుంచి సుందరమైన కదంబం పుట్టింది. ఆమన కాపుష్పమంటే ఎంతో ప్రీతి. యక్షేశ్వరుడైన మణిభద్రు నుంచి వటవృక్షం పుట్టింది; ఆయనకా వృక్షమంటే ఎంతో ప్రేమ, పరమ శివుడు తన హృదయాన్నుంచి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు. బ్రహ్మ శరీర మధ్య భాగాన్నుంచి అవతరించిన మరకతవర్ణపు ఖదిరవృక్షాన్ని విశ్వకర్మనుంచి పుట్టిన కంటకీవృక్షాన్ని ఆయాదేవతలు ప్రేమిస్తారు. పార్వతి ఆరచేతి నుంచి కుంద (మల్లె) పొద, గణాధిపుని చెంపల నుండి సింధువారకం, యముని దక్షిన పార్శ్వం నుండి పాలాశం, దక్షిణోత్తరాలనుండి నల్లమేడి, రుద్రునిదేహంనుండి క్షోభం కలిగించే వృషవిటపం కుమారస్వామినుండి బంధుజీవనం, సూర్యునినుండి ఆశ్వత్థ (రావి) చెట్టు, కాత్యాయనివల్ల జమ్మిచెట్టు, మహాలక్ష్మి చేతినుండి బిల్వ (మారేడు) వృక్షం ఉద్భవించాయి. నాగుల అధిపతినుంచి రెల్లుదుబ్బు, వాసుకి విశాలమైన తోకనుండి వీపునుండి తెల్ల, నల్లగరిక (దూర్వా), సాధ్యుల హృదయాలనుంచి హరిచందన వృక్షములు ఉద్భవించాయి. తమనుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయినాయి.

అలాంటి రమణీయమైన శుభ సమయాన, శుక్ల పక్ష ఏకాదశినాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజింపవలె. శరదృతువు ప్రవేశించే వరకు పుష్పపత్రఫల, గంధాదులతోను, వర్ణరస ముఖ్య ఓషదులతోను శ్రియఃపతిని చక్కగా పూజించాలి. నేయి తిలలు బియ్యం యవలు, బంగారం, వెండి మొదలయినవి, మణులు, ముత్యాలు పవడాలు, వివిధ వస్త్రాలు. తీపి పులుపు మొదలయిన షడ్రసోపేతాలయిన వస్తువులను ఆఖండాలుగా (తుంచకుండా) సేకరించి మహాత్ముడగు కేశవునకు నివేదనం చేయాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తిఅయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్ధులు వర్షిస్తాయి. నారదా! ఉపవాసంచేసి మరునాడుదయం జితేంద్రియుడై సంవత్సరకాలం నిర్విఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చేయాలి. సువాసనగల తెల్ల ఆవాలుగాని నువ్వులుగాని పిండిచేసి దేహానికి నలుగు పెట్టుకొని స్నానంచేయాలి. విష్ణుదేవుని నేతితో ఆభిషేకించాలి. నేతితోనే హోమంచేసి తన శక్తిననుసరించి ఘృతదానంచేయాలి. తదనంతరం పద్మ నాభుని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి. రకరకాలయిన పరిమళ ధూపలువేయాలి. ఆ విధంగా ఆ సంవత్సరం పరమపవిత్ర మౌతుంది. ఆనంతరమాజగన్నాథుని స్వర్ణరత్నాలతోను చీని చీనాంబరాలతో నలంకరించి మిష్టాన్నం రుచ్యములైన చోష్యహవిష్యాదులు నైవేద్యం చేయాలి. మునిశ్రేష్ఠా! ఇలా సమర్పించిన తర్వాత నా జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి.

''ఓ పద్మనాభ! పద్మావతీ! మహాద్యుతీ! నీకు నమస్కారము! వికసించిన తామర రేకుల వంటి కన్నుల వాడా! నీవేవిధంగా పరిపూర్ణుడవై సర్వత్రా నిండియున్నావో అలాగే నేను ఆచరించు ధర్మార్థ కామ మోక్షాలు, ఆఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగియుండునట్లు అనుగ్రహించుము కేశవా!''ఈ విధంగా ఉపవాసియై ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్థు సర్వ విషయాలలోనూ పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటాడు. ఈ విధంగా వ్రతమాచరించినచో దేవతలందరు సంతోషించెదరు. అలాంటి వ్రతం చేసినవానికి చతుర్విద పురుషార్థాలు పూర్ణంగా సిద్దిస్తాయి. వారణా ! అర్థార్థులైన వారలకు నిర్ణయించబడిన వ్రతాలను నీ కెరిగించితిని. ఇక సర్వమంగళకరమైన విష్నుపంజర స్తోత్రం వినిపించెదను.

శ్రీ విష్ణు పంజర స్తోత్రమ్‌ :

నమోనమస్తే గోవింద చక్రంగృహ్య సుదర్శనమ్‌ | ప్రాచ్యాంరక్షస్వమాంవిష్ణో త్వామహం శరణంగతః

గదాంకౌమోదకీంగృహ్య పద్మనాభామితద్యుతే | యామ్యాంరక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః.

హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ | ప్రతీచ్యాంరక్షమే విష్ణో భవంతం శరణంగతః

ముసలంశాతనంగృమ్యపుండరీకాక్ష రక్షమామ్‌ | ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణంగతః

శార్జమాదాయచధనురస్త్రం నారాయణం హరే | నమస్తేరక్షరక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః

పాంచజన్యంమహాశంఖ మంతర్బోధ్యం చ పంకజమ్‌ | ప్రగృహ్యరక్షమాంవిష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర.

చర్మసూర్యశతంగృహ్య ఖడ్గం చంద్రమసంతధా | నైర్‌ ఋత్యాంమాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్‌.

వైజయంతీంప్రగృహ్యత్వం శ్రీవత్పం కంఠభూషణమ్‌ | వాయవ్యాంరక్షమాందేవ అశ్వశీర్ష నమోస్తుతే.

వైనతేయం సమారుహ్య అంతరిక్షేజనార్దన | మాంత్వరంరక్షాజిత్‌ సదా నమస్తే త్వపరాజిత.

విశాలాక్షంసమారుహ్య రక్ష మాంత్వం రసాతలే | ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమోస్తుతే. 

కరశీర్సాంఘ్రిపర్వేషుతథా೭ష్టబాహుపంజరమ్‌ | కృత్వారక్షస్వమాందేవ నమస్తే పురుషోత్తమ.

ఏతదుక్తంభగవతావైష్ణవం పంజరం మహత్‌ | 
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ. 

నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్‌ |
 సమరం రక్తబీజం చ తథాన్యాన్‌ సురకంటకాన్‌.

గోవిందా ! నీకు నమస్కారం. నీకు శరణాగతుడను. సుదర్శన చక్రం ధరించి విష్ణో! నీవు నన్ను తూర్పన రక్షించుము. అమిత తేజస్వియైన పద్మనాభా! కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశన రక్షించుము. విష్ణో ! నీకు శరణాగతుడను. నీకు నమస్కారము. పురుషోత్తమా! నమస్కారము. సౌనందహలాన్ని ధరించిన విష్ణూ! పశ్చిమ దిక్కున నన్ను రక్షించుము. నీకు శరణాగతుడను ! పుండరీకాక్ష ! ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షింపుము. జగన్నాథా ! నీకు శరణాగతుడును. ఓ రాక్షస నాశకా ! శార్‌ఙ్గ ధనస్సును నారాయనాస్త్రాన్ని ధరించి నన్ను ఈశాన్య దిశన రక్షింపుము. నీకు శరణాగతుడను. ఓ విష్ణూ యజ్ఞ పురుషా ! పాంచజన్య శంఖాన్ని అంతర్బోధ్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షింపుము. ఓ నరసింహ ప్రభూ ! దివ్యమూర్తీః సూర్యశతమనే డాలును చంద్రమస ఖడ్గాన్ని ధరించి నైరృతి దిక్కున నన్ను రక్షింపుము. వైజయంతీమాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభూ ! వాయవ్య దిశన నన్ను రక్షించుము. నీకు నమస్కారము. జనార్దనా! గరుడ వాహనారూఢుడవై నన్ను అంతరిక్షంలో రక్షింపుము. అజితా అపరాజితా! నీకు సదానమస్సులు! విశాలక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించుము! అకూపారా! మహామోహ! నీకు నమస్కారము! అష్టబాహు పంజర రూపాన నా శరీరంలోని చేతులు, తల, పాదాలు, మడమలు మొదలగు వానిని రక్షింపుము. పురుషోత్తమ దేవా! నీకు నమస్కారము! ఈ విధంగా ఈ విష్ణు పంజర స్తోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాత్యాయనికి చెప్పాడు. ఓ బ్రహ్మణోత్తమా! దీని ప్రభావం వల్ల ఆ మహాదేవి మహిషాసురునీ, నమరుడు, రక్తబీజుడు తదితరు లెందరో దానవులను సుర కంటకులను నాశనం గావించింది.

నారదుడనెను -
దేవకంటకులైన మహిషదైత్యునీ నమర, రక్తబీజులను వధించిన ఆకాత్యాయని ఎవరు ? ఆ మహిషుడెవడు ? అతడు పుట్టిన వంశమేది? ఆనమర రక్తబీజులెవరి కుమారులు ? మహర్షే ! ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి.

పులస్త్యుడిట్లనెయె -

ఓమునీ ! ప్రాచీనకాలాన జరిగిన పాపాపహారి అయిన కథ చెబుతున్నా వినుము. సమస్తమైన వరాలు ప్రసాదించ దుర్గయే యా కాత్యాయని. పురాసమయాన, జగత్తు నంతా సంక్షోభింపజేసే యిద్దరు రాక్షసులు, మహాబలశాలురు ఉండేవారు. వారు రంభుడు కరంభుడు. అపుత్రకులైన వారు పుత్రప్రాప్తి కొరకు పంచనదీ జలాలలో మునిగి చాలా ఏండ్లు తపస్సు చేశారు. వారిలో కరంభుడు జలమధ్మంలో, రంభుడు అగ్ని మద్యంలో ఉండి, మాలవట యక్షుని గూర్తి తపించారు. కరంభుడు నీటిలో మునిగిపోగా యింద్రుడు మకర రూపానవాని కాళ్ళు పట్టుకొన లాగికొని పోయి తన కోరిక మేరకు వధించెను. సోదరుని చావునకు కోపించి రంభుడు తన తల నరికి అగ్ని లోవేల్చ సంకల్పించెను. తన జుట్టు ఒక చేతపట్టుకొని రెండవ చేతితో మెరిసిపోతున్న ఖడ్గం గ్రహించి తల నరుకుకొనబోగా రంభుని అగ్ని వారించి యిట్లనెను - రాక్షసేశ్వరా ! తన్ను తాను చంపుకొనుట మంచిదికాదు. పరహత్యాపాతకం కంటే ఆత్మ హత్యాపాతకం భయంకరమైనది. దుస్తరమైనది. చచ్చిన వానినెవడూ పట్టించుకోడు. నీ కోరికయేదో చెప్పుము. నేను నెరవేర్చగలను. అప్పుడు రంభుడు - ''ఓ అగ్నీ! నాకు వరమివ్వదలచుచో నీకంటే తేజస్వి, దేవతల కజేయుడు, నరదైత్యుల కవధ్యుడు వాయువునకు వలె బలవంతుడు, కామరూపుడు సర్వాస్త్రకోవిదుడు, త్రిలోక విజయం సాధించ గలిగిన పుత్రుని దయచేయుమ'' నియెను. అందుకు అగ్ని ''తప్పకుండా లాగే జరుగగలదు. నీకు, ప్రియురాలైన వనితయందు అలాంటి పుత్రునికను''మని వచించెను.

ఇతి శ్రీ వామనమహాపురాణ అష్టాదశోధ్యాయః

అగ్నిదేవుని యాదేశాను సారం, అనేక మంది యక్షులతో పరివేష్టితుడైయున్న మాలవట యక్షుని చూచుటకై ఆదానవుడు వెళ్ళిపోయెను. ఆ ప్రదేశాన గజాశ్వ మహిషములు గోవులు మేకలచే పరివృతుడై యుండియు అనన్య చిత్తుడైన పద్మనిధి నివసించుచుండెను. వాటి మధ్య ఉన్నటు వంటి మూడేండ్ల వయస్సు గలిగి అందముగానున్న ఆడు మహిషాన్ని చూచి ఆదానవుడు మోహితుడాయెను. ఓ మునీ ! విధి విధానం వల్ల ఆ ఆడుమహిషం గూడ ఆరాక్షసునితో సంగమించుట కై త్వరగా ఆతనిని సమీపించగా వాడు దానితో రమించెను. వెంటనే అది గర్భం ధరించగా దానిని తీసికొని అతడు పాతాళంలో తన భవనానికి జేరెను. అతడు చేసిన అకార్యానికి తోడి రాక్షసులాతనిని బరిత్యజించగా అతడచ్చోటు వదలి తిరిగి మాలవటం చేరెను. ఆ మహిషి గూడ పతిని అనుగమించి ఆ యక్షమండలమునకు వెళ్ళెను. వారక్కడ ఉండగా నా నల్లని మహిషి ఒకనాడు చక్కని అందమైన దున్నపోతును ప్రసవించెను. అది కామరూపి. ఒకనాడా మనిషి ఋతుమతి అయి ఉండగా మరొక మహిషం (మగది) దానిని చూచి మోహంతో వెంబడించగా నాశ్యామ తన శీలమును రక్షించుకొనుట కై భర్తయైన రాక్షసుని సమీపించెను. మోర ఎత్తుకొని వెంటబడిన ఆ దున్నపోతు మీదకు ఆ రాక్షసుడు కత్తిదూసి లంఘించెను. అంతట నా దున్నపోతు తన కొమ్ములతో రాక్షసుని గుండెల్లో కుమ్మగా హృదయం చీలిపోయి వాడు మరణించెను. తన భర్త మరణించడంతో నా మహిషి యక్షులను శరణుజొచ్చెను. యక్షులచేత నివారింపబడిన ఆ దున్నపోతు మోహాతిరేకంతో చేయునది లేక సమీపంలో ఉన్న ఒక దివ్య సరస్సులోబడి చనిపోయి ఒక రాక్షసుని రూపం ధరించెను. ఆ బలపరాక్రమ సమన్వితుడైన రాక్షసుడే నమరుడుగా ఖ్యాతి చెందాడు. అతడు ఆ యక్షుల మరుగున జేరి అక్కడ నున్న జంతువుల నెల్లను బార ద్రోలెను. అంతట మాలవటాది యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై చేర్చగా నాశ్యామ మహిషి తనపతితో చితాగ్నిలో బడిపోయెను. అంతట నా చితాగ్ని మధ్యం నుండి రౌద్రాకారుడగు పురుషుడొకడు బయలుదేరి ఖడ్గపాణియై ఆ యక్షులనందరను వెళ్ళగొట్టెను. ఆ వీరుడు రంభనందనుడైన మహిషుని వదలి మిగిలిన మహిషములనన్నింటిని వధించెను. ఓ మహామునీ! ఆతడే రక్తబీజుడు. వాడు యింద్రరుద్ర సూర్య మరుత్తులతో సహా దేవతలనందరను జయించాడు. ఆ రాక్షస వీరులంతటి పరాక్రమవంతులు. అయితే వారందరిలోను మహిషాసురుడు గొప్పవాడు. శంబరుడు, తారకుడు మొదలయిన వారలనందరను జయించినాడు. వారందరు నాతనిని తమ ప్రభువుగా అభిషేకించారు. ఆతని ధాటికి నిలువలేక లోకపాలకులందరు సూర్యచంద్రాగ్నులతో సహా తమతమ స్థానాలు వదలి పారిపోయారు. ధర్మానికి స్థానం అంటూ లేకుండా పోయింది.

ఇది శ్రీ వామనమహాపురాణంలో పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.

కామెంట్‌లు లేవు: