24, జులై 2020, శుక్రవారం

లంఘనం

श्लोकम् :
अतीव बलहीनं हि लङ्घनं नैव कारयेत् ।
ये गुणा लङ्घने प्रोक्तास्ते गुणा लघुभोजने ।।

శ్లోకం:
అతీవ బలహీనం హి లఙ్ఘనం నైవ కారయేత్ ।
యే గుణా లఙ్ఘనే ప్రోక్తాః తే గుణా లఘుభోజనే ॥
        
ప్రతిపదార్థం:
అతీవ = మిక్కిలి, బలహీనం హి = బలహీనముగా ఉన్న వానికి నే,  (హి = indeed), లఙ్ఘనం = లంఖణం, న ఏవ కారయేత్ = చేయించకూడదు, యే = ఏవైతే, గుణా = గుణములు, లఙ్ఘనే = లంఘనములో, ప్రోక్తాః = చెప్పబడినవో, తే = అవే, గుణా = గుణములు, లఘుభోజనే = మిత ఆహారమందునూ ఉన్నవి.

Meaning:
Skipping a meal should not be got implemented for a person who is very weak. Whatever good qualities were advocated in skipping a meal are also available in the limited and controlled meal. 

తాత్పర్యం:
చాలా నీరసించి ఉన్న వానిని లంఘనం (లంఖణం) చేయించకూడదు. లంఘనములో ఏవైతే మంచి గుణములు ఉన్నవి అని చెప్పబడినవో ఆ మంచి గుణములన్నీ లఘు భోజనము అంటే మితాహారములో కూడా ఉన్నవి.

లంఘనంలో చెప్పిన గుణాలన్నీ లఘు భోజనంలో కూడా ఉన్నవి కావున తేలికగా భోజనం చేయించాలి.

లంఘనం అంటే గెంతుట. అంటే ఆంగ్లంలో skipping అంటారు. Skipping a meal occasionally is always good for health అంటారు. లంఘనం ప్రకృతి భాషా ప్రయోగం. లంఖణం వికృతి భాషా ప్రయోగం.

అప్పుడప్పుడు మన జీర్ణకోశానికి జీర్ణ వ్యవస్థకి కొంత విరామం ఇవ్వడం అనేది శ్రేయస్కరం అని మన పెద్దలు చెపుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్ర రీత్యా కూడ ఇది ఆచరణ యోగ్యం. అందుచే మన పూర్వీకులు మనని అప్పుడప్పుడు లంఘనం చేయమంటూ ఉంటారు లేదా ఉపవాసం చేయమంటారు. ఉపవాసం అంటే నిత్యమూ తినేట్టుగా పూర్తి భోజనం కాకుండా, మితాహారం తినడం. పర్వదినాలని ఉపయోగించుకుని మనం ఆ విధంగా చేస్తూ ఉంటాము. పూర్తి లంఖణంలోనూ, మితాహారములోనూ అంటే ఉపవాసములోనూ అవే మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధముగా అవకాశం ఉంటే ఆ విధముగా చేసుకో వచ్చును.

లంఘనం పరమౌషధం అనేది తరచుగా వాడ బడుతూ ఉండే నానుడి. అంటే ఒకపూట భోజనం మానివేయడం అనేది అన్నిటికంటే మంచి ఔషధం అని అర్థం.

కామెంట్‌లు లేవు: