24, జులై 2020, శుక్రవారం

నేను – నా కరోనా

అది జూన్‌ 28వ తేదీ. సాయంత్రం నాలుగు గంటలు. ఆఫీసుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో మబ్బులు    కమ్ముకొచ్చాయి. చినుకు చినుకుతో మొదలైన వాన భారీ వర్షంగా మారింది. ఆఫీసు సమయం దాటిపోతోంది. సాయంత్రం ఆరు అయ్యింది. బాస్‌కు ఫోన్‌ చేసి ఆఫీసుకు రాలేనని చెప్పాను. ఇంటి దగ్గర నుంచే న్యూస్‌ ఫాలోఅప్‌ చేస్తానని చెప్పాను. ఇంతకీ చెప్పలేదు కదూ! నేను జర్నలిస్టుని. ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్ల నెట్‌వర్కుకు ఇన్‌చార్జిని. ఎప్పుడూ వార్తలు రాసేందుకు మాత్రమే ఉపయోగించే వర్కు ఫ్రం హోమ్‌ అనే పదం కరోనా పుణ్యమా అని మా పత్రికల్లోని అన్ని విభాగాల్లోకి జొర బడింది. మాకు ఈ పదం, మా కోసం ఉపయోగించడం కాసింత గర్వంగా,  ఫ్యాషన్‌గా ఉందనుకోండి. 
రాత్రి 9 దాటింది. ఆఫీసు పని దాదాపు పూర్తయింది. కొంచెం ఒళ్పు నొప్పులుగా అనిపించింది. ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమనిపించింది. ఆరు పదులు దాటిన వయస్సు నాది. బీపీ, షుగర్‌ ఇతర దీర్ఘకాలిక వ్యాధులేమీ లేవు. తలనొప్పి, జ్వరం, ఇతర ఆరోగ్య కారణాలతో గత నాలుగైదేళ్ళలో ఆఫీసుకు సెలవు పెట్టిన సందర్భం కూడా లేదు. మంచి ఆరోగ్యవంతుణ్ణి అని చెప్పలేను కానీ, నా వయస్సుకు నా ఆరోగ్యంపట్ల కొంచెం గర్వంగానే ఉంటా. కానీ కరోనా కథలు, అది పెట్టే వెతలు బాగా తెలిసి ఉండడంతో ఆ కాస్త ఒళ్ళు నొప్పులకే చిన్న జడుపు ప్రవేశించింది. రేపు ఆదివారమే కదా! విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందిలే అనుకున్నా. కానీ ఏదో అనుమానంగానే  ఉంది. 
తెల్లవారింది. అనుమానం అణువణువుకీ ప్రవేశించడం ప్రారంభించింది. నాలుగు సార్లు విరోచనాలయ్యాయి. ఒళ్ళు నొప్పులు తెలుస్తున్న స్థాయికి వచ్చాయి. లో జ్వరం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆ రోజంతా ఇంట్లో వాళ్ళకు దూరంగా, మా మనవడికి అంటీ ముట్టనట్లుగా వ్వవహరించా. ఇంట్లో నా శ్రీమతితోపాటు, మా పెద్దమ్మాయి, అల్లుడు, మనవడు ... మొత్తం అయిదుగురుం ఉంటాం. చిన్న కూతురు అమెరికాలో. ఎంఎస్‌ పూర్తి చేసి ఫ్లోరిడాలో ఉద్యోగం చేస్తోంది. 
 నా పరిస్థితి అప్పటికి ఎవరికీ తెలియదు. సాయంత్రానికి మరో రెండు సార్లు లూజ్‌ మోషన్స్‌ అయ్యాయి. రాత్రి 8.30కి తొలిసారిగా భయం ప్రవేశించింది. ఇక దాచుకోవడం కరెక్ట్‌ కాదనిపించింది. ఇలాంటి సందర్భంలో మొదట గుర్తుకు వచ్చేది మంచి మిత్రులే కదా! ఇద్దరు మిత్రులు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. వారిలో ఒకరు సహచరుడు, సహ పాత్రికేయుడు (మాజీ). రెండవ మిత్రుడు యూనివర్సిటీలో బ్యాచ్‌మేట్‌. ‘‘ముందు అజిత్రోమైసిన్‌ వేసుకో, రేపు డాక్టర్‌తో మాట్లాడదాం’’ అని చెప్పారు. మేమున్నాం అన్న భరోసా ఇచ్చారు. ఆ భరోసా గొప్పదా? కరోనా భయం గొప్పదా? అంటే నేను సమాధానం చెప్పలేను కానీ, ఆ భరోసానే ఆ రాత్రికి ఊపిరిగా పని చేసింది.
మా అల్లుడు వెళ్ళి టాబ్లెట్స్‌ తీసుకు వచ్చాడు. డోలో 650, అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ. రాత్రికి నేను బెడ్‌ రూమ్‌లో పడుకోలేదు. హాల్‌లో ఒంటరిగా పడుకున్నా. నిద్ర సరిగా పట్టలేదు. వేకువ జామయ్యింది. పరిస్థితిలో మార్పు లేదు. ఒళ్ళు నొప్పులు, లోజ్వరం కొనసాగుతున్నాయి. ఇంట్లో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వాడిన బెడ్‌షీట్లు, దిండు గలీబు తీసి సర్ఫు నీళ్ళలో వేశాను. హాల్‌లో డెట్టాల్‌ వాటర్‌ స్ర్పే చేశాను. నాలుగు జతల బట్టలు, కొన్ని పుస్తకాలు, రైటింగ్‌ పేడ్లు, మందులు అప్పటికే వాడుతున్న పొడులు (దాల్చిన చెక్క, మిరియాలు, మెంతులు  వాము, సోంపు, జీలకర్ర గ్రయిండ్ చేసిన పొడులు) సర్దుకున్నాను. ఈ పొడులు అంత రెగ్యులర్‌ కాకపోయినా గత ఆరు నెలలుగా అడపాదడపా కషాయాలుగానో, ఇతరత్రానో వాడుతూనే ఉన్నాం. డి విటమిన్‌ – టాయో 60కె గత సంవత్సరంగా వాడుతున్నాం. జింకోవిట్‌ 50 ఎంజి, విటమిన్‌ సి 1000 ఎంజి, బికాంప్లెక్సు టాబ్లెట్లు కూడా నాలుగు నెలలుగా రోజూ ఒకటి (మధ్యలో డుమ్మాలున్నా) వాడుతున్నాం.   
మేముండేది ఇండిపెండెంట్‌ ఓన్‌ హౌస్‌. ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ డూప్లెక్సు. మా అయిదుగురి నివాసం.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇటీవలే ఖాళీ అయ్యింది. మా టెనెంట్‌ది మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామం. నాగపూర్‌కు మూడు గంటల ప్రయాణం. కరోనా ఆంక్షలు ఇంకా 48 గంటల్లో ప్రారంభమవుతాయనగా కుటుంబంతో సహా సొంతూరు వెళ్ళాడు. వర్కు ఫ్రం హోం చేస్తుండగానే ఆయన పనిచేసే కంపెనీ హైదరాబాద్‌ విభాగం మూతపడింది. ఆ వార్త తెలియజేసి, త్వరలో వచ్చి ఇల్లు ఖాళీ చేస్తానన్నాడు. నెల రోజుల్లోనే గుర్‌గావ్‌లో ఉద్యోగం వచ్చిందతనికి. తాను అక్కడ నుంచి వచ్చి ఇల్లు ఖాళీ చేయడం (ఇన్ని ఆంక్షల మధ్య రాష్ట్రాలు దాటుకుని ....) ఇబ్బందంటూ ఒక రోజు కాల్‌ చేశాడు. ఒక వెహికల్‌ మాట్లాడి తన సామాను నన్నే పంపమని కోరాడు. ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు. మరు క్షణం ఆలోచిస్తే అతను చెప్పింది నిజమేననిపించింది. ఒక ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీతో మాట్లాడి, ఇంటి తాళం పగులగొట్టి సామాను పంపాను. ప్యాకింగ్‌ చేసే దృశ్యాలు, వెహికల్‌కి లోడ్‌ చేసే దృశ్యాలు ఆయన అడగకుండానే వీడియో తీసి పంపించాను. చాలా సంతోషపడ్డాడు. నా శ్రీమతి వెంటనే ఇల్లు అద్దంలా శుభ్రం చేయించింది. టులెట్‌ బోర్డు తగిలించాం. పది రోజుల్లో నలుగురు వచ్చారుగాని, ఇద్దరు మాకు నచ్చలేదు. మరో ఇద్దరు అద్దె మెచ్చ లేదు. అలా ఖాళీగా ఉన్న ఇల్లు నాకు హోమ్‌ క్వారంటైన్‌ అవడానికి ఉపయోగపడింది. నా కుటుంబ సభ్యులను ప్రమాదం బారిన పడకుండా తక్షణ చర్య తీసుకోవడానికి దోహదపడింది. 
గ్రౌండఫ్లోర్‌లోకి వచ్చి తెచ్చుకున్న సామాను సర్దుకున్నాను. సెల్లార్‌లో అద్దెకున్న వారి ఇండక్షన్‌ స్టౌ, ఇంట్లో అదనంగా ఉన్న నవారు మంచం, పక్క బట్టలు, దిండ్లు కూడా వచ్చి నాతో  చేరాయి. ఇల్లు శుభ్రంగానే ఉంది. తక్షణం చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి. ఒకటి ఒక్కడ్నే నవారును టైట్‌ చేసుకుంటూ మంచాన్ని సిద్ధం చేసుకున్నా. (దీనిలో కష్టం, టెక్నిక్‌ అనుభవం ఉన్న వారికే అర్ధమవుతుంది. రెండవ మనిషి తోడుంటేనే ఈ పనికి ఆపసోపాలు పడతారు. అలాంటిది ఒక్కడినే ... పని పూర్తయింది. నవారులో బిర్రుతనం వచ్చింది.) అదే ఊపులో ఒంటరిగా ఉండేందుకు మనస్సును కూడా సిద్ధం చేసుకున్నా. 
నా మిత్ర ద్వయం సహకారంతో సోమవారం, జూన్‌28 ఉదయాన్నే ఒక డాక్టర్‌ను సంప్రతించాను. పెద్దగా లక్షణాలు లేవు కదా! రెండు రోజులు ఆగండి, ఎక్సరే తీద్దాం అన్నారు. మిత్రులిద్దరూ సూచనలు, జాగ్ర త్తలు చెబుతూనే ఒక ప్రైవేటు ల్యాబ్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌కి బుక్‌ చేశారు. పరీక్ష చేయించుకోవడం పెద్ద ప్రహసనంగా ఉంది. అంత తేలిక కాదు. వాళ్ళు ఇంటికి వచ్చి స్వాబ్‌ టెస్ట్‌ తీసుకునేట్లు మాట్లాడారు. బుధవారం, (జూలై ఫస్ట్‌) వస్తారని చెప్పారు. స్వయంగా వెళ్ళి క్యూలో నిలబడి టెస్ట్‌ చేయించుకోవల్సిన పరిస్థితి తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నాను.  అయితే నాలో ఉన్న భయానికి, ఆందోళనకు మళ్లీ రెక్కలు వచ్చాయి. వారు ఎలా వస్తారో తెలియదు. ఎలా టెస్ట్‌ తీసుకుంటారో తెలియదు. డ్రెస్‌లో ఉంటారా? టువీలర్‌లో వస్తారా? ఫోర్‌ వీలర్‌లో వస్తారా? ఇంటి చుట్టు పక్కల వాళ్ళకు తెలుస్తుందేమో? పని అమ్మాయిని రానివ్వరేమో! ఇంట్లో వాళ్ళను బయట తిరగనివ్వరేమో? ఇంటి సెల్లార్‌లో ఒక కుటంబం ఉంది. టెర్రస్‌ మీద ఉన్న సింగిల్‌ రూమ్‌లో ఒక బ్యాచిలర్‌ అద్దెకుంటున్నాడు. వీరందరికీ ఇబ్బందే. ఇవి ఆ ఆందోళనకు కొన్ని కారణాలు.
మధ్యాహ్నం 12.30 అయ్యింది. ల్యాబ్‌ రెప్రజెంటేటివ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక గంటలో వస్తానన్నాడు. టు వీలర్‌లో        వస్తున్నాడని, డ్రెస్‌లో ఉండడని, మన ఇంటికి వచ్చిన తర్వాతనే పీపీ కిట్‌ ధరిస్తాడని తెలుసుకున్నాను. కాస్త కుదుటపడ్డాను. రెండు గంటల సమయంలో ఇంటికి దగ్గరలో మెయిన్‌ రోడ్‌కి వచ్చి ఫోన్‌ చేశాడు. అక్కడే ఉండమని మా అల్లుడ్ని పంపించాను. (అతను అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చి ఇంటి చుట్టు పక్కల వాళ్ళను విచారించడం నాకు ఇష్టం లేదు .... ఎందుకో మీకు తెలుసు.) వచ్చి వాకిలి బయటే వరండాలో నిలబడి తన కిట్స్‌ సిద్ధం చేసుకోవడానికి ఉపక్రమించాడు. లోపలకు రమ్మన్నాను. మేము రాకూడదన్నాడు. రాకూడనిది నాకోసమా? తన కోసమా? ఇద్దరి భద్రత దానిలో ఉందిలే అనుకున్నాను. బయట నుంచి ఎవరైనా చూస్తున్నారేమోనని గమనించాను. మధ్యాహ్నం రెండు దాటడంతో ఎవరి గుహల్లోకి వాళ్ళు వెళ్శినట్లున్నారు. ఎవరూ కనిపించలేదు.
కిట్‌  రెడీ  చేసుకుని పీపీఈ కిట్‌ నుంచి (వ్యక్తిగత రక్షణ వస్తు సముదాయ కిట్‌) తీసిన డ్రె స్‌ వేసుకున్నాడు. నన్ను ఒక చైర్‌ తెచ్చుకుని కూర్చోమన్నాడు. గొంతు, ముక్కు ద్వారా స్వాబ్‌ తీసుకుని ఒకే కంటైనర్‌లో రెండూ వేసుకుని క్లోజ్‌ చేశాడు. (కొంచెం ఇబ్బంది ఉంటుంది. స్వాబ్‌ స్టిక్‌ మీద ఉన్న గుర్తు ముక్కు లోపలకు వెళ్ళేవరకు పంపిస్తారు. అర నిమిషం ఓర్చుకోవాలి). తను వేసుకున్న డ్రెస్‌ తీసి ఒక వేస్ట్‌ కవర్‌లో వేసి క్లోజ్‌ చేసి దానిని ప్రత్యేకంగా పెట్టుకున్నాడు. పేరు, ఇతర  వివరాలు అడిగి నోట్‌ చేసుకున్నాడు. అతనికి 3,100 రూపాయలు పే చేయమని మిత్రులు ముందే చెప్పారు. అతని ఫోన్‌పే అకౌంట్‌కి 3,300 బదిలీ చేశాను. థాంక్యూ అని వెళ్ళాడు. వాళ్ళ సర్వీస్‌ మీద నాకున్న గౌరవం ఎందుకో పెరిగింది. మొత్తంపై ఒక ఘట్టం ముగిసింది. 
ఇక మళ్ళీ నా భయం అనే గుహలోకి వచ్చాను. ఇక్కడ మీకు భయం గురించి ఒక విషయం చెప్పాలి. నాకు సంబంధించినంత వరకు భయానికి నాలుగు కారణాలున్నాయి. 
మొదటిది : నాకే ఈ కష్టం ఎందుకు రావాలి అనుకోవడం. జీవితమంటే కష్ట సుఖాల మేలు కలయిక అనే గ్రహింపు లేకపోవడం. ఈ రెండు కారణాలతో ఈ భయం ప్రవేశిస్తుంది. కష్టాలు ఎక్కువగా ఉండి సంతోషాలు తక్కువగా ఉంటే జీవితం కష్టమయంగా ఉందని అర్ధం. సంతోషాలు ఎక్కువగా ఉండి, కష్టాలు తక్కువగా ఉంటే జీవితం సుఖమయంగా ఉందని. అయితే ప్రతి విషయాన్ని కష్టంగానే భావించే వారిని మనం ఏమీ చేయలేం. ‘’ఏడీ సూర్యుడు లేడని ఏడుస్తూ కూర్చుంటే మిణుగురుని సైతం కనలేవు’’ అన్న డాక్టర్‌ సినారేని గుర్తు తెచ్చుకుని వారి ఖర్మకు వారిని వదిలేయాలి. నాకు ఈ రకం భయం లేదు.
రెండవది: మన ఆరోగ్యం..... ఆహార, విహార, వ్యవహారాలు సక్రమంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వ్యవహారం కాసేపు పక్కన బెడదాం. ఆహార, విహారాల సంగతి చూద్దాం. ‘‘అక్షరమ్ములిన్ని కుక్షిలోనిడినంత / చదువటంచు దాని చాటరాదు; జ్ఞానమొకటే ధాత్రి చదువన చెల్లురా .......’’ అని ఒక పండితుడి ప్రవచనం. మనం వినడం, తెలుసుకోవడం ఎక్కువ, ఆచరించడం తక్కువ. 45, 50 ఏళ్ళు లోపు వయస్సులో ఓకే. అంగీకరించవచ్చు. రుచులకు, అభిరుచులకు పెద్దపీట వేయవచ్చు. 50 దాటిన తర్వాతైనా జాగ్రత్త ఉండాలిగా. వందల విషయాలు తెలుసుకుని, వాటిని మధించి, చర్చించి, పలువురికి బోధించి చివరకు ఒకటి రెండు ఆచరించడం ఎక్కువగా జరుగుతోంది. ఇదే ప్రమాదం. నాలుగు విషయాలు తెలుసుకున్నా నాలుగు నెలలు క్రమంతప్పకుండా పాటిస్తే అదే ఆరోగ్యానికి ఆలంబన అవుతుంది. నడక, నడతలు కూడా దీనికి తోడు అయితే ఈ ఆలంబనకు ఆడంబరత వస్తుంది. కాస్త శారీరక వ్యాయామం, శ్వాసపై ధ్యాస చాలా సమస్యలకు పరిష్కారం.  (అనుబంధం ఒకటిలో ఆహార, ఔషధాల వివరాలు పొందుపరిచాను. చూడవచ్చు.....) ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ప్రాణం ... అన్నిటికంటే విలువైన ఆ ప్రాణాన్ని మనం దక్కించుకోవాలంటే ఆహార, విహార, వ్యవహారాల్లో మనం ఎన్ని విలువలు పాటించాలి? నా వరకు ఈ రెండవ రకం భయం కూడా లేదు. 
ఇక మూడవది : అండదండలు ............ మిత్రులు, బంధాలు, బంధుత్వాలు, డబ్బు ఈ కోవలోకి వస్తాయి. ఇవి లేకపోయునా, చాలకపోయినా భయం మనల్ని కమ్మేస్తుంది. కరోనాపై నాలో అనుమానం అలా మొగ్గ తొడగగానే ఇలా గుర్తుకు వచ్చింది ఒక మిత్ర ద్వయం. స్వాంతన వచనాలతో వారు నన్ను సమాధానపరచలేదు. ఆచరణాత్మక సలహాలు, అవసరమైతే రంగంలోకి దిగుతామన్న భరోసా ఇచ్చారు. అదే నాకు ధీమాను, నమ్మకాన్ని కలగజేసింది. మరో వైపు కుటుంబం. బెంబేలెత్తకుండా బలంగా నిలబడదాం అన్న క్రియాశీలతే అందరిదీ. మా అల్లుడు పైకి కనిపించకపోయినా కాస్త కంగారుపడతాడు కానీ పెద్దమ్మాయి, శ్రీమతి మాత్రం ... ‘ఏముంది ఎదుర్కుందాం’ అన్న ధోరణిలోనే ఉంటారు. ఫ్లోరిడా నుంచి మా చిన్నమ్మాయిది పెద్ద పాత్ర. ప్రణాళికలో, ఆచరణలో అడుగడుగునా పక్కనే ఉంది. రోజూ రెండు పూటల బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు తను చేస్తూ, నాచేత చేయించేది. 15 నిమిషాలతో ప్రారంభించి అరగ ంటకు తీసుకెళ్లింది.  ఒక్క మాటలో చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడాలోని తనుండే ఫోర్ట్‌లాడర్‌ డేల్‌ను నా క్వారంటైన్‌ ఇంట్లో కూర్చోబెట్టింది. ఇక మా ఎండీ, ఎడిటర్‌ ఇతర కొలీగ్స్‌ పలకరింపులు, ఏమీ కాదన్న భరోసాలు సరేసరి. మొత్తంపై రెండు, మూడు రోజులు మాత్రమే సెలవులో ఉన్నా. ఎడిటర్‌ సున్నితమైన హెచ్చరికతో (నిజానికది ఉన్నతమైన సూచన) వర్క్‌ ఫ్రం హోం చేయడం ఈ సమయంలో నా భయాందోళనల నుంచి ఎక్కువ సమయం బయటపడడానికి దోహదపడింది.
ఇక బంధువుల అనుబంధ రాగ మాలికలు నన్ను ఒక్కసారి కమ్మేశాయి. అందిన సమాచారం మేరకు నగరంలోనే ఉన్న మా అక్కయ్య మ్రాన్పడిపోయింది. రోజంతా ఎవరితో మాట్లాడలేదు. కరోడాల్లా ఉండే మా ఇద్దరి మేనల్లుళ్ళ కళ్ళు వర్షించాయి. కూతుళ్ళు, కొడుకులు తల్లడిల్లారు. వదినలు నిజంగానే వగచారు. చిన్న మరదలు భోరు భోరున ఏడ్చేసింది. (మంచి నటి. మనిషి కూడా సావిత్రి పోలికే...). అల్లుళ్ళు, తోడళ్ళళ్ళు, కజిన్స్‌ ఏ అవసరం తీర్చేందుకైనా సిద్ధమయ్యారు. పెద్ద మరదలు దాదపు ఫెయింట్‌ అయ్యింది. తేరుకున్న తర్వాత వెంటనే  ఫోన్‌ చేసింది. ‘‘బావగారూ, ఖర్చు ఎంతైనా ఫరవాలేదు. ఎంత అవసరమైతే అంత సిద్ధం చేస్తాను. దాని గురించి మీరు ఆలోచించకండి.  మిగిలిన విషయాలు చూసుకోండి’’ అంది. డబ్బు ముఖ్యం కాదని మాటల్లో చెబుతాం కానీ, ఆచరణలో అది అవసరమే. రూపాయి గుప్పెట్లోకి మనం వెళితే పతనం అవుతాం. కానీ మన గుప్పెట్లో ఆ రూపాయి లేకపోతే ఎలా!? లండన్‌ నుంచి మా కోడలు (నాలుగో అన్నయ్య కోడలు) పంపిన కన్సోల్‌ మెసేజ్‌ కూడా ఈ సందర్భంగా మీతో పంచుకోవాలి. ఆ మెసేజ్‌ కాస్త సుదీర్ఘమైనదే. ఆ మెసేజ్‌లో ముందుగా తన బాధ వ్యక్తమవుతుంది. తర్వాత హాస్యం తొంగి చూస్తూంది. ఆపై ఆప్యాయిత పొంగుతుంది ..... ‘‘ఇలా జరిగినందుకు బాధగా ఉంది. అయునా ఆసుపత్రిలో కాక హోం క్వారైంటైన్‌లో ఉండడం కాస్త సంతోషకరమైన విషయం. ఈ క్వారంటైన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులకు పరీక్ష అనుకోండి. ఎవరెంత అండగా ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ  మనవరాలు (మూడు నెలల వయస్సు) మీకు గాఽఢాలింగనం ఇస్తోంది. ఆ స్పర్శతో వచ్చే తరంగాలతో (వైబ్రేషన్లు) తాతకు స్వస్థత చేకూరుతుందట .... ’’ ఇదీ ఆ మెసేజ్‌ సారాంశం. (మీరు కోలుకున్న తర్వాత మీ అనుభవాన్ని రాయాలన్న సూచన కూడా ఆ కోడలిదే ....) ఇవి అన్నీ నా గుండెల్లో తడిని కనుగూటిలోకి తెచ్చాయి. ‘నా గుహలో, కుటిలో ...’ ఉన్నానేగానీఇంకా చీకటి ఎక్కడిది? ఇలా ఈ భయం కూడా కొండెక్కింది.
నాల్గవ భయం: సామాజికపర మైనది, పాలనాపరమైనది. సామాజికపరమైన ఇబ్బందులు ముందే ప్రస్తావించాను. ఇక ప్రభుత్వపరమైన, పాలనాపరమైన విషయానికి వస్తే భయం స్వరూపం ఎంత భీకరంగా వుంటుందో కోవిడ్‌ చూపిస్తోంది. మనకు మిత్రులున్నారు. ఆఫీసు అండ వుంది. ఆదుకునే బంధుగణం ఉన్నది. అంతో  ఇంతో ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ జరగరానిది జరిగితే? కరోనా ఏదో ఒక అవయవాన్ని కమ్మేస్తే? అర్ధరాత్రి ఆపద చుట్టేస్తే? ఆదుకునేది ఎవరు? పలికే డాక్టర్‌ ఎవరు? మనకు గేటు తె రిచే ఆసుపత్రి ఏది? ఇంటికి అరగంటలో వచ్చే అంబులెన్స్‌ ఉందా? పోనీ 108 వస్తుందా? సర్కార్‌ దవాఖానాకు వెళితే సశేషంగా ఉంటామా? ఏ కుటుంబ సభ్యుడి, ఏ ఆప్తుడి ఆరోగ్యాన్ని  ఫణంగా పెట్టి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతాం? సమస్య తీవ్రమైతే, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బెడ్‌    ఇస్తామని హామీ ఇచ్చిన ఆసుపత్రుల పీఆర్‌ఓలు ఆ సమయానికి చేతులెత్తేస్తే? 
ఈ భయాన్ని గౌరవించాలా? వద్దా? ఈ భయాన్ని భయం, భయంగా అంగీకరించాలా? వద్దా? నేను ఈకథనం రాస్తున్న రోజుకు ఏక్టివ్‌ కోవిడ్‌ కేసులు రాష్ట్రంలో కేవలం 10,891. ప్రభుత్వాలకు ప్రాణాల విలువ తెలిస్తే ...... 33జిల్లాలు, ఒక అంతర్జాతీయ మహానగరం ఉన్న రాష్ట్రంలో పదకొండు వేలమందిని అక్కున చేర్చుకుని ఆదరించడం చేతకాదా? ఆసుపత్రుల తలుపులు తడుతూ అంబులెన్సు ‌లు, ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ, తిరుగుతూనే ప్రాణాలు వదలాలా? ప్రభుత్వాసుపత్రులంటే యమకూపాలన్న భావాన్ని ఈ ఆపద వేళకూడా తొలగించలేరా? విలువల గురించి మనకు అవసరమైనప్పుడు మాట్లాడడం సరికాక పోవచ్చు. కానీ ఇప్పుడు కూడా మౌనంగా ఉండడం నేరం కావచ్చు. భయ కారణాల్లో చివరిదైనా ఈ ఒక్క భయంతోనే నా క్వారంటైన్‌ మొదటి వారం పూర్తి భయం, భయంగా ... రెండవ వారం భారంగా గడిచింది. 
జూలై ఒకటిన టెస్ట్‌కు ఇచ్చాను. మూడవ తేదీ రాత్రి పది గంటలకు ఫలితం పాజిటివ్‌ అని వచ్చింది. రెండవ తేదీ సాయింత్రం నాలుగు  గంటలకు చివరిసారిగా నాకు జ్వరం, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. డోలో 650 ఒకటి వేసుకున్నాను. రెండూ తగ్గాయి. జూన్‌ 29 నుంచి జూలై రెండు వరకు లో జ్వరం ఉన్నప్పటికీ మొత్తంపై నేను నాలుగైదుకు మించి డోలో 650 వాడలేదు. 28 నుంచి వరుసగా  ఆరు రోజులు ఆరు అజిత్రోమైసిన్‌  వాడాను. పాజిటివ్‌ వచ్చిన మరుసటి రోజు నాల్గవ తేదీ మొత్తం నలుగురు డాక్టర్లను సంప్రతించాను. పరిస్థితి ఇదీ అని చెప్పాను. ‘‘మీకు సింప్టమ్స్‌ వచ్చి ఏడు రోజులు, వైరస్‌ ప్రవేశించి అంత కు ముందు నాలుగు రోజులు లెక్కలోకి తీసుకుంటే పదకొండు రోజులు .... ఆల్‌ మోస్ట్‌ మీ వైరస్‌ పీరియడ్‌ అయిపోయినట్లే’’ అని ఒక  డాక్టర్‌ చెప్పారు. ఆయన మాటతో చాలా ధైర్యం వచ్చింది. అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం ‘‘ఇక దగ్గు, జలుబు స్టార్ట్‌ అవుతాయి. ఆక్సిజన్‌ అందకపోయే అవకాశాలు ఉంటాయి, అప్రమత్తంగా వుండాలి’’ అని చెప్పారు. పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చింది. మరో డాక్టర్‌ను సంప్రతిస్తే డి డెన్వర్‌, ఐరన్‌ సంబంధిత, ఇతర కొన్ని బ్లడ్‌ టెస్ట్‌లు చేయించుకోమని సూచించారు. పాజిటివ్‌ వచ్చి ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఉన్న నాకు ఈ టెస్ట్‌లు ఎలా చేయించుకోవాలన్నది ఆందోళన. ల్యాబ్‌ వాళ్ళు ఇంటికి రాకపోతే ఎలా వెళ్ళాలన్నది పెద్ద సమస్య. (ఈ సమస్య రాగానే రెండు పీపీఈ కిట్స్‌ తెప్పించుకుని ఇంట్లో ఉంచుకున్నాను. ఒకవేళ తప్పనిసరైతే అవి ధరిస్తే, మా అల్లుడో, కాబోయే అల్లుడో డ్రైవ్‌ చేసుకుంటూ తీసుకెళతారన్నది నా ఆలోచన....)
అప్పుడు గుర్తుకు వచ్చాడు డాక్టర్‌ రాము. మా మిసెస్‌ వాళ్ళ ఊరు. బంధువు కూడా. పదవ తరగతి సర్టిఫికెట్‌లో పేరు తప్పు పడిందని తొలిసారిగా వాళ్ళ నాన్నతో మా ఇంటికి వచ్చాడు. మరలా అమెరికాలో ఎంఎస్‌ (ఆర్థో)చేసి మలిసారి మా ఇంటికి  వచ్చాడు. నిరాడంబరుడు. కూల్‌గా ఉంటాడు. ఎంఎస్‌ చేసేటప్పుడు ఎమర్జన్సీ విభాగంలో పని చేయడం వల్ల అన్ని విషయాలపైనా పట్టు ఉంది. మంచి డాక్టర్‌. వెంటనే ఆయనను సంప్రతించాను. (వెంటనే అంటే తక్షణమే అనుకునేరు. ఒక మంచి డాక్టర్‌తో మాట్లాడాలి అంటే కనీసం ఆరునుంచి 12గంటలు వ్యవధి అవసరమవుతుంది.) మీరు ఉన్న పరిస్థితికి ఆ పరీక్షలు అవసరం లేదులే అని తను చెప్పాడు. ఊరట చెందాను. కానీ, పక్క రాష్ట్రంలో ఉంటాడు. ఏదైనా సమస్య తీవ్రమైతే ఫాలోఅప్‌ ఎలా? అందుకే మంచి ఆసుపత్రికూడా ఉన్న తొలి రోజు ఫోన్‌లోకన్సల్ట్‌ చేసిన డాక్టర్‌ కుమార్‌ను మరలా సలహా అడిగాను. తమ ఆసుపత్రిలోని ఒక కోవిడ్‌ స్పెషలిస్ట్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన ఫాబ్‌ఫ్లూ 200 ఎంజీ టాబ్లెట్స్‌ వాడాలి అని చెప్పారు. వాటి తీవ్రత కూడా తెలియజేశారు. ‘‘మా ఆసుపత్రిలో ఎనిమిదిమంది కోవిడ్‌ రోగులకు వాడుతున్నాను. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవు. మీరు కూడా వాడడం అవసరం’’అని చె ప్పారు. ఆ టాబ్లెట్స్‌ షెడ్యూల్‌ తెలిస్తే గుండె ఆగుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం 9, రాత్రికి 9 మొత్తం 18 టాబ్లెట్లు (3600 ఎంజీ), రెండవ రోజునుంచి మధ్యాహ్నం 4, రాత్రికి నాలుగు చొప్పున 8 టాబ్లెట్లు .... 21 రోజులు లేదా కనీసం 14 రోజులు వరుసగా వాడాలి అని చెప్పారు. అలాగే అని మరలా మా డాక్టర్‌ రామును ఆశ్రయించాను. అవసరం లేదు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఖచ్చితంగా వుంటాయి అని చెప్పాడు. క్వారంటైన్‌ అంటే ఒంటరిగా వుండడమే కాదు. ఒంటరిగానే భయాలను ఎదుర్కోవాలి. పంచుకోవడానికి, ఫాలోఅప్‌ చేయడానికి భౌతికంగా పక్కన ఎవరూ వుండ రు. ఇదే పెద్ద సమస్య. 
దూరం చేద్దామనుకుంటున్న భయం ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ వెంటాడుతూనే వుంది. మరుసటి రోజు డాక్టర్‌ కుమార్‌ తనే స్వయంగా ఫోన్‌ చేశారు. తమ డాక్టర్‌ ఏమి చె ప్పారని అడిగారు. ఫాబ్‌ ఫ్లూ వాడమన్నారు. దొరకలేదని అన్నాను. మా ఆసుపత్రిలో ఉన్న మెడికల్‌ షాపులో ఉన్నాయి. ఎవరినైనా పంపి తెప్పించుకోండి అన్నారు. చిన్నగా నసుగుతూ .... కాదు సార్‌, ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ అని వివరించాను. గత మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు కూడా లేవు, ఆ టాబ్లెట్స్‌ తప్పనిసరిగా వాడాలా ? అన్నాను. ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు. మరు క్షణం .... ‘‘ వద్దు లెండి. అవసరం లేదు. అంతా స్టిగ్మా మయం అయ్యింది. ప్రభుత్వానిది ఒక రకమైన స్టిగ్మా. మా డాక్టర్‌ది ఒక రకమైన స్టిగ్మా .... అమ్మో, మన కృష్ణ ప్రసాద్‌ ... మన, మన .... ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన స్టిగ్మాతో నడుస్తోంది ...’’ అన్నారు. ఆయనతో నా గత పరిచయం అంత ఎక్కువేమీ కాదు. అయినా ఆయన అలా మాట్లాడడం నన్ను చలింపజేసింది. ఆయన గొప్పతనానికి, నిజాయితీకి మనస్సులోనే అభినందనలు తెలియజేసుకున్నాను. ఇక కొంత నిశ్చింతగా వున్నాను. నాగపూర్‌లో మా మేనకోడలు కూతురు డాక్టర్‌ స్నేహ (ఎండి, అనస్తీయషన్‌) కూడా విలువైన సలహాలు ఇస్తుండేది. విజయవాడలో ఉన్న మా వియ్యపురాలు డాక్టర్‌ అరుణ (యానిమల్‌ హజ్‌బెండరీ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్‌ డీఈ) రోజూ ఉదయాన్నే నా క్వారంటైన్‌ వార్డుకు రౌండ్స్‌కు వచ్చిన చందంగా పలకరింపు, పరామర్శ వుండే వి. ఏది ఏమైనా రాత్రి అయితే ఏదో తెలియని భారం గుండెలపై కూర్చునేది. నిద్ర నిండుగా వుండేది కాదు. నాలుగు గంటల నిద్ర పడితే, ఖచ్చితంగా గంట కొట్టినట్లు మెలకువ వచ్చేది. (రోజూ నిద్రమాత్ర జోలాఫర్‌ 5 ఎంజీ కూడా వాడేవాడ్ని.) మెలకువ వచ్చిన సమయంలో అమెరికాలో ఉన్న మా చిన్నమ్మాయితో కాసేపు చాట్‌ చేసి, ఆన్‌లైన్‌లో రెండు పేపర్లు చదివి మరలా పడుకుంటే మరో గంటన్నర లేదా రెండు గంటలు నిద్ర పట్టేది. ఈ ఒక్క ఇబ్బంది మినహా నా క్వారంటైన్‌ సవ్యంగానే గడిచినట్లు. 
ఒకటవ తేదీ టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ వచ్చింది. మరలా 19వ తేదీ రిపీట్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేయించాను. 21వ తేదీ సాయంత్రం అయిదు గంటలకు ఫలితం వచ్చింది. ల్యాబ్‌ రెప్రజెంటేటివ్‌ అభినవ్‌ రిపోర్ట్‌ పంపడంతోపాటు నెగటివ్‌ అని మెసేజ్‌ కూడా పెట్టాడు. నాకు ఈ 25 రోజుల్లో అత్యంత ఆమోదయోగ్యమైన, ఆనందదాయకమైన మెసేజ్‌ అదే. మొదటిగా నా మిత్ర ద్వయానికి తెలియజేశాను. అడుగడుగునా అండగా వుండటమే కాదు. పూటకు రెండుసార్లు అయినా రిజల్ట్‌ గురించి వాకబు చేస్తూనే ఉన్నారు. ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్లకు, ప్రాణప్రదమైన మిత్రులు, కొలీగ్ లు, బంధువులకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. క్వారంటైన్‌ ఇంటిని శుభ్రం చేసి బట్టలు, కొన్ని వస్తువులు అక్కడే వదిలేసి తాళంవేసి ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న ఇంటికి వచ్చేశాను. దూరం 20 మెట్లే అటు అయినా, ఇటు అయినా! కానీ 25 రోజులు వాకిలి దాటకుండా నాలుగు గోడల మధ్య ఉండే ఈ అనుభవం నాకెప్పటికీ వద్దనే కోరుకుంటున్నాను. నేనే కాదు ఎవరూ కూడా కోరుకోరు. ఎత్తుపల్లాలతో ఉండేదే జీవితం. ఒక్కోసారి పల్లం అనుకున్నది చిన్న లోయ కావచ్చు, పెద్ద  లోయ కావచ్చు. బయటపడే ప్రయత్నం అందరం చేస్తాం. కానీ ఆ సమయంలో భయం, ఆందోళనలు ఎంత తక్కువగా ఉంటే ఆ లోయను జయించే సామర్థ్యం అంత ఎక్కువగా వుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆచరించగలిగే వారు, సంజీవ్‌దేవ్‌ వంటి తాత్వికులు కొందరే ఉంటారు .... అలాంటి వారి నుంచి స్ఫూర్తిని పొందగలిగితే అగాథాల నుంచైనా అంచుకు చేరుకోగలుగుతాం ..... థాంక్యూ.
అనుబంధం : 
1. మా ఇంటిపైన మిద్దె తోట వుంది. చిన్నదే కానీ ఆకు కూరలు బాగా వస్తాయి. పాలకూర, తోటకూర, గోంగూర, బెంగుళూరు బచ్చలి,    మునగాకు, కరివేపాకు, వామాకు, తులసి, కొత్తిమీర, పుదీనా ..... వీటిలో ఎవరికి నచ్చిన కాంబినేషన్‌తో వారు .... ఒక్కొక్కటి నాలుగేసి ఆకులు, అర అరటిపండు, రెండు ఖర్జూరాలు, చిన్న అల్లం ముక్క బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రయిండు చేసి మజ్జిగ (పాలు అయినా ఓకే) కలుపుకుని స్మూతీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం. 
2. నిద్ర లేవగానే గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు. అరగంట తర్వాత మరో గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో పసుపు, దాల్చిన చెక్క, మిరియాల పొడి, నిమ్మ రసం కలుపుకుని తాగడం. ఽ
3. ధనియాలు, జీలకర్ర, సోంపు, వాము, లవంగాలు, ఏలుకల పొడులు, ఇంగువ ఎలా వీలైతే అలా ... ఏదో ఒక పద్దతిలో (కూరల్లోగాని, కషాయాలుగా గాని) వాడుకోవడం. 
3. రెండు స్పూన్లు మొలకలు కట్టిన పెసర, శనగ గింజలు.
4. ఇడ్లీ, దోశెలకు వాడే బియ్యం స్థానంలో 20 శాతం లోపు బియ్యాన్ని వాడి, 80 శాతం సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఇతర మిల్లెట్లు వాడడం.
5. క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరా పచ్చి ముక్కలుగాని, జ్యూస్‌ రూపంలోగాని, ఉడకబెట్టిగాని (వారానికి రెండు, మూడు రోజులైనా) తీసుకోవడం. 
6. లంచ్‌ని కప్పు అన్నం (బియ్యం, గోధుమలకు దాదాపు స్వస్తి. కొర్రలు ఇతర మిల్లెట్స్‌ ఎక్కువగా), కప్పు కూర, కప్పు ఆకుకూర పప్పు, కప్పు పెరుగుతో ముగించడం. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఒకటి, రెండు ముద్దలతో సరిపెట్టడం. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఆనియన్‌ పచ్చివి తీసుకోవడం కూడా అవసరం. వంటకాల్లో కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, కుసుమ, నెయ్యి ఎక్కువగానే నువ్వులు, వేరుశెనగ, ఇతర గానుగ నూనెలు మాత్రమే వాడడం.
7. సాయంత్రం పండ్లు, డ్రై ఫ్రూట్లు ..... అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ, ఆపిల్‌, ఫైనాపిల్‌, ద్రాక్ష ఏదో ఒకటి లేదా రెండు రకాలు. జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రూట్‌, వాల్‌నట్‌ వంటివి. లేదా వేరుశెనగ గుళ్ళు నానబెట్టి (మూడు టేబుల్‌ స్పూన్లు మాత్రమే) ఉల్లిపాయలు కలుపుకుని తినడం.
8. డిన్నర్‌ లంచ్‌లో సగం లేదా బ్రేక్‌ఫాస్ట్‌లాగా తీసుకోవడం. 
9. రోజుకు మూడు సార్లు ... ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ల తర్వాత కషాయాలు తీసుకోవడం. (కషాయం – పేరు పెద్దదేగాని, విషయం చిన్నదే. ఆకులైనా, పొడులైనా గంటలు గంటలు కాచాల్సిన అవసరం లేదు. మూడు నుంచి అయిదు నిమిషాలు కాచి వడగట్టుకుని తాగితే సరిపోతుంది. అల్లం అరంగుళం ముక్క, పావు స్పూను మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి బేస్‌ మెటీరియల్‌గా, కామన్‌గా వాడుతూ ఏదో ఒక ఆకులు నాలుగు తుంచి వేసుకుని అయిదు నిమిషాలు మరగపెడితే సరిపోతుంది. తులసి, మునగాకు, మునగ పూత, వామాకు, గోంగూర, పారిజాతం, జామాకు, లెమన్‌గ్రాస్‌ ఏది అందుబాటులో ఉంటే అది .... కొంచెం ఆరనిచ్చి అర చెక్క నిమ్మరసం కలుపుకుంటే బెటర్‌.
10. రోజుకు రెండుసార్లు గార్గిలింగ్‌ .... వేడి నీటిలో చిటికెడు పసుపు, ఉప్పు కలపుకుని పుక్కిలిస్తే సరిపోతుంది. లేదా బె టాడైన్‌ మౌత్‌ వాష్‌ అయినా సరే.
11. రెండుసార్లు ముఖానికి ఆవిరి (కొబ్బరి నూనె ముఖానికి రాసుకుని, తర్వాత ....) పట్టడం.
12. 30 నిమిషాలు నడక, 20 నిమిషాలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు, పది నిమిషాలు ఏదో ఒక వ్యాయామం.
ఆవేశకావేషాలు అదుపులో ఉంచుకోవడం .... మన చుట్టూ అందరూ సంతోషంగా ఉంటేనే మన సంతోషం నిండుగా ఉంటుంది కాబట్టి ఇంటా, బయటా అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం.  ఆచరిస్తే ఇవి చాలు ......

కామెంట్‌లు లేవు: