21, ఆగస్టు 2020, శుక్రవారం

*మనుచరిత్ర --1*

ఒక సమాజం తన ఉనికిని చాటుకోవడానికి  తను ఈ సృష్టిలో ప్రత్యేకంగా కనపడటానికి ముఖ్యమైన
ఆధారం, ఆయువుపట్టు లాంటివి
భాషా, సాహిత్యాలు. ఒక భాషలో సాహిత్యం లేకపోతే ఆ భాష ఎక్కువకాలం
బతకదు. సాహిత్యమంటే,
ఆ భాషలో ఉన్న రచనలు.
కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు,
నవలలు,
నాటకాలు, వ్యాసాలు,
చలచిత్ర గేయాలు వీటిని ఏ భాషలో రాస్తే వాటిని
ఆ భాషా సాహిత్యం  అంటారు.
పది కాలాల పాటు నిలబడే భావితరాలు చదువుకునే సాహిత్యాన్ని సృష్టించిన కవులు అనేకులు తెలుగు సాహిత్య రంగంలో ఉన్నారు.
వారి గురించి పరిచయం చేయడమే
ఈ పోస్టింగ్ లోని ప్రధాన ఉద్దేశ్యం.
*ఆంధ్ర కవితా పితామహుడు గా పేరుపొందిన కవి *అల్లసాని పెద్దన్న* వీరు రచించిన మనుచరిత్ర ప్రబంధం ఎంతోమంది తరువాతి కవులకు దారి చూపించింది.

*ప్రస్తుత తరానికి  భవిష్యత్ తరాలకు*
ఆ సాహితీవేత్తల రచనలను
తెలియడం కోసం*  *చదువుకున్న* *పెద్దలకు  మరొక్కసారి* 
*ఆ మధురిమను ఆస్వాదింపచేయటం కోసం*,


*మనుచరిత్ర* *ప్రబంధపరిచయం*
అల్లసానిపెద్దనకవి రచన....

మనము ఆంధ్రులము. తెలుగు వారము. రెండును ఒకటే. రెండువేలఏండ్లుగా  మన జాతి పేరు ప్రతిష్టలు గడించినది. ఆ పూర్వము తెలియదుగానీ 1000 ఏళ్ళ క్రింద రాజమహేంద్రవరములో, రాజరాజనరేంద్రుడు వారి క్రింద నన్నయ్య భట్టు మన భాషలో మొట్టమొదట తెలుగు భారతం వ్రాసెను.  ఆయన మొట్టమొదటి కవి. తరువాత తిక్కన, ఎర్రాప్రగడ, నాచన సోమన్న, శ్రీనాథుడు, పోతన, మొదలైన మహాకవులు మన భాషలో పుట్టి మహా గ్రంధములు వ్రాసినారు. ఒక జాతి గొప్ప జాతి అనగా తక్కిన లక్షణాలతో పాటు ఆ భాషలో గొప్ప కావ్యాలు కూడా ఉంటవి. మనకు కూడా ఉన్నవి. ఇట్లా ఉండగా హంపీ విజయనగరములో  శ్రీకృష్ణదేవరాయలు అన్న ప్రభువు రాజ్యం చేసినాడు. ఆయన కాలం లోనూ ఆయన తర్వాత తెలుగులో మరీ గొప్ప కావ్యాలు బయలుదేరినవి. ఆ కావ్యాల మూలంగా మన జాతి యొక్క గౌరవంఎంతో  పెరిగింది.
 *అష్టదిగ్గజాలు* కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో
అష్ట దిగ్గజాలైన కవులు ఉండేవారు. గజము అనగా ఏనుగు. దిగ్గజములు అనగా దిక్కునందు ఉండెడి.ఏనుగు.
మన పురాణాలలో ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఏనుగులు ఉండి అవి ఈ
భూమిని మోయుచున్నవని కథ ఉన్నది. క్రింద ఆదిశేషువు మోయుచున్నాడు. ఎనిమిది దిక్కులందు ఈ ఏనుగులు   మోయుచున్నవి. అనగా భూమిని భరించు చున్నవి అని అర్థము. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఎనమండుగురు కవులు ఉండేవారు. వారికి అష్టదిగ్గజములు అని పేరు. దిగ్గజములు సరే వీరు దిగ్గజములు ఏమిటి?
ఆ దిగ్గజములు ధాత్రిని భరించుచున్నట్లుగా ఈ దిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయలవారి యొక్క సభ యొక్క మర్యాదను, ప్రతిష్టను,భరించెడివారన్నమాట. సభలోమంత్రులుందురు,
సేనా నాయకులుందురు, మహోద్యోగులుందురు.
అంత మంది ఉండగా ఎనమండగురు కవుల ఎనిమిది దిక్కుల కూర్చుండబెట్టి వీరు దిగ్గజములనుటలో  అర్థమేమి?
అనగా  ఆమంత్రులందరికంటే ఆ సేనాపతులు అందరికంటే నిజముగా శ్రీకృష్ణదేవరాయల
వారి కీర్తిని శాశ్వతముగా
నిలబెట్టెడివారు
ఈ కవులు అనిఅర్థం.  పూర్వకాలంలో కవులన్నచో, అంతటి గౌరవం. వారు కూడా అంతటి గొప్ప వారు. ఎనిమిది దిక్కులలో ప్రధానమైన దిక్కు తూర్పు. ఆదిక్కు నందున  ఏనుగులకు  గౌరవం. అట్లే శ్రీకృష్ణదేవరాయల
వారి ఆస్థానములో ఉన్నఎనమండుగురు లో *అల్లసాని పెద్దన్న* గారు  అనేకవి ఉండెడివాడు. ఆయన తూర్పుదిక్కున ఏనుగు వంటి వాడు. ఆయన *మనుచరిత్ర* మనే  గ్రంథము వ్రాసినాడు. దానిని శ్రీకృష్ణదేవరాయల
వారికి అంకితం ఇచ్చినాడు. ఇప్పటికి నాలుగు ఐదు వందలఏళ్ళ క్రింద జరిగిన సంగతి ఇది. ఇప్పటికీ ఆ గ్రంథమునకు ప్రతిష్ఠ తగ్గలేదు......
*********************

కామెంట్‌లు లేవు: