21, ఆగస్టు 2020, శుక్రవారం

మనసు అంటే ఏమిటి ? ఆ మనసును నాశనం చేయడం ఎలా ?🙄


ఎవరండి ఈవిడ మనసును నాశనం చెయమంటుంది .  ముందు ఈవిడ అడ్రస్ కనుక్కోండి అంటారేమో ???😢

ప్రతి ఒక్కరూ నా మనసు బాలేదు . నా మనసు ఇలా ....అలా ....అంటూ ఉంటారు . అసలు ఈ మనసు అంటే ఏమిటి ?🤔

మనకు నిరంతరం వచ్చే ఆలోచనలు సంకల్పాలే మనసు . మనసు అనేది ఒక అవయవయం కాదు .
ఒక వస్తువూ కాదు ,
నిరంతరం కదులుతూ ఉన్న ఆలోచనలే మనసు . ఇది దేహాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది . మర్రి చెట్టుపై భేతాళుడు లా ఎప్పుడు సందేహాలే . క్షణం తీరిక ఉండదు దమ్మిడి ఆదాయం ఉండదు . ఏంటీ మనసు అంటే జస్ట్ ఆలోచనలా .😱

 అవును ఇది ఒక్కటి చాలు మనిషిని నిదుర పోనివ్వదు . ప్రపంచ దేశాల సమస్యలు అన్నీ దీనికే . పక్కింటి పంకజాక్షి నుండి పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాలు వరకు ఒకే ఆలోచనలు  పోనీ ఈ ఆలోచనలు తో ఏదైనా సాధిస్తావా అంటే అది లేదు .
(దీన్ని నీకు అనుకూలంగా మలచుకుంటే అద్బుతాలు నీ ముంగిటే ఉంటాయి )..🌷

అసలు ఈ మనసు అనేది ఉన్నదా ?  ‘’ ఉంటే  ఈ మనసు  శాశ్వతమా అంటే  కాదు . ( ఏదైనా వస్తువు ఉన్నది అంటే అది అన్నీ కాలాలలో ఉండాలి(సత్) అసలు ఎప్పుడు ఏకాలంలో లేనిది అసత్’’ అంటే నేను మొలకువగా (జాగృదా) ఉన్నాను మనసు ఉన్నది . నిద్ర పోతున్నా (స్వప్నా ) అక్కడా మనసు ఉన్నది . దీర్ఘ నిద్ర  అంటే సుషుప్తి ఈ అవస్థలో మనసు లేదు .అసత్ కాదు సత్ కాదు . శాశ్వతం కాదు అలా అని ఆశాశ్వతం కాదు ఈ రెండు కానీ వాటిని వేదాంత భాషలో మిధ్యా అంటారు .😱

అన్నింటిని భ్రమింప చేస్తుంది .. “ అదేనండీ ఓ రచయిత గారు చెప్పరుగా ‘’ కోర్కెల ఎడ నీవు ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే ? అంటూ .. మనిషిని సునామిలా  గందర గోళం చేస్తుంది , ఎండమావులే గోదారి గలగలలు అంటుంది ..

మరి నేను సత్యం తెలుసుకోవడం ఎలా ? 🤔
చిమ్మ చీకటిలో (అజ్ఞానం ) ప్రయాణం చేస్తున్నాను . ఓ పెద్ద పాము ను చూసి పాము ..పాము అని అరిచి కేకలు పెట్టి హార్ట్ బిటింగ్ పెరిపోయి వారు వీరు వచ్చి పంచాయితీ చేసి ఓ దీపం ( జ్ఞానం ) తెచ్చారు . అది తాడు అని తేల్చేశారు  .. హమ్మయ్య తాడేనా ఎంత రిలాక్స్ గా ఉన్నది .  😊ఇక్కడ తాడు సత్ ‘ పాము మిధ్య , ఈ భ్రమాత్మకమైన మనసుకు ఆధారం ఎవరు అంటే సత్యం అయిన తాడే . తాడు లేకపోతే పాము అనే భ్రమ పడే అవకాశం లేదు.

మరి మనసును అదుపులో పెట్టడం ఎలా ? పూజా , సత్సాంగత్యం , జపం , ధ్యానం , వీటితో మనసును నీ అదుపులో తెచ్చుకుంటావు ..” యామండి ఏమి అనుకోకండి ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకే కానీ బయటకు రాగానే  ఆలోచనలు ఈగలు మూసినట్లు ముసురుతున్నాయండి .

 హిమాలయాల్లో ఉన్నా ‘’ అయ్యో వాడు ధ్యానం ఎక్కువసేపు చేస్తున్నట్లు ఉన్నాడు , వాడి దగ్గరకు విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు , వాడికి ఉన్న పేరు నాకు రావడం లేదు .నన్ను ఎవరు గుర్తించడం లేదే .  😪ఓ ఆశ్రమం కడదాం అంటే డబ్బులు లేవు 🙄‘’ ఇది సంగతి అక్కడ శాంతి లేదు .. మరి దీనికి మార్గం ‘’ ఒకే ఒక్క మార్గం మనో నాశనం “” అంటే ఆత్మ విచారణ ‘’…………

అంటే రాజుగా నాటకం వేశాను , నాటకం అయిపోగానే ఒక్కోటి తీసేసి ‘’ పక్కన పెట్టేస్తే నేను మాత్రమే మిగులుతుంది .
అంటే నేను ఎవరినిని ? దేహాన్నా , మనసునా ., బుద్దినా , పంచెద్రీయాలా , అహంకారమా , పంచ కోశాలునా , ద్వేషాన్నా రాగాన్నా మొహాన్నా ,పుణ్యాని నా పాపానినా ?మంత్రాన్నా తీర్థాన్నా ? (నిర్వాణ షట్కం )
కాదు ఈదేదీ నేను కాదు “’ అంతే ఈ సత్యం ఎరుక అయిక క్షణం మనో నాశనమే “
ఆక్షణమే నువ్వు మహాయోగివి. నా స్వస్వరూపం ఇది అని తెలిసాక ఇంకేముంది .
ఆలోచనలు లేవు కోరికలు లేవు ముక్తస్దితి ..

The death of the mind is the birth of a sage. (మనోనాశనం జరిగింది అంటే అతడు మహనీయుడైన యోగి )
*******************

కామెంట్‌లు లేవు: