21, ఆగస్టు 2020, శుక్రవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*బలిచక్రవర్తి స్వర్గమును జయించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.10 (పదియవ శ్లోకము)*

*తుల్యైశ్వర్యబలశ్రీభిః స్వయూథైర్దైత్యయూథపైః|*

*పిబద్భిరివ ఖం దృగ్భిర్దహద్భిః పరిధీనివ॥6869॥*

బలిచక్రవర్తితోగూడి, అతనితో సమానమైన ఐశ్వర్య బలవైభవములు గల దైత్యసేనాపతులు తమ తమ సైన్యములను దీసికొని బయలుదేరిరి. వారు ఆకాశమును త్రాగివేయుచున్నట్లును, క్రోధముతో నిండిన నేత్రములతో దిక్కులను భస్మము చేయుచున్నట్లును ఒప్పుచుండిరి.

*15.11 (పదకొండవ శ్లోకము)*

*వృతో వికర్షన్ మహతీమాసురీం ధ్వజినీం విభుః|*

*యయావింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసీ॥6870॥*

బలిచక్రవర్తి మిగుల బలీయమైన తన సేనను తీసికొని వారిని యుద్ధోన్ముఖులుగా చేయుచు ముందుకు నడపెను. పిదప సకలైశ్వర్ర సంపన్నమగు ఇంద్రుని రాజధానియైన అమరావతిపై దండెత్తెను. ఆ సేనల పాదఘట్టనలకు ఆకాశము, అంతరిక్షము కంపించుచుండెను.

*15.12 (పండ్రెండవ శ్లోకము)*

*రమ్యాముపవనోద్యానైః శ్రీమద్భిర్నందనాదిభిః|*

*కూజద్విహంగమిథునైర్గాయన్మత్తమధువ్రతైః॥6871॥*

*15.13 (పదమూడవ శ్లోకము)*

*ప్రవాలఫలపుష్పోరుభారశాఖామరద్రుమైః|*

*హంససారసచక్రాహ్వకారండవకులాకులాః|*

*నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాః సురసేవితాః॥6872॥*

దేవతల రాజధానియైన అమరావతి సుందరమైన నందనోద్యానములతోను, ఉపవనములతోడను విలసిల్లు చుండెను. వాటియందలి పక్షుల జంటల కూజితములు వినసొంపుగా నుండెను. మత్తిల్లిన తుమ్మెదలు ఝంకారములు సలుపు చుండెను. కల్పవృక్షముల శాఖలు చిగురుటాకులతో, ఫలపుష్పములతో శోభిల్లుచుండెను. అచటి సరోవరముల యందు హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు, కొంగలు గుంపులు గుంపులుగా చేరి విహరించుచుండెను. ఆ జలాశయములయందు దేవభామినులు జలక్రీడలు సలుపుచుండిరి.

*15.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఆకాశగంగయా దేవ్యా వృతాం పరిఖభూతయా|*

*ప్రాకారేణాగ్నివర్ణేన సాట్టాలేనోన్నతేన చ॥6873॥*

దివ్యమైన ఆకాశగంగ అగడ్తవలె ఆ అమరావతికి నలువైపుల పరివృతమై యుండెను. ఆ పురము చుట్టును బంగారముతో నిర్మితమైన  ఎత్తైన కోట బురుజులుగలవు. వాటియందు అచ్చటచ్చట అట్టాలకములు (మేడపై గదులు) విరాజిల్లుచుండెను.

*15.15 (పదునైదవ శ్లోకము)*

*రుక్మపట్టకపాటైశ్చ ద్వారైః స్ఫటికగోపురైః|*

*జుష్టాం విభక్తప్రపథాం విశ్వకర్మవినిర్మితాం॥6874॥*

ఆ నగరము నందలి ద్వారములు బంగారు పట్టీలతో విలసిల్లుచుండెను. గోపురములు స్ఫటికములతో నిర్మితములు. విశ్వకర్మచే తీర్చిదిద్దబడిన రాజమార్గములు విశాలములు, దర్శనీయములు.

*15.16 (పదహారవ శ్లోకము)*

*సభాచత్వరరథ్యాఢ్యాం విమానైర్న్యర్బుదైర్వృతాం|*

*శృంగాటకైర్మణిమయైర్వజ్రవిద్రుమవేదిభిః॥6875॥*

ఆ నగర సభాస్థానములు, ముంగిళ్ళు రథమార్గములతో శోభాయమానములై యుండెను. పరికోట విమానములు, కూడళ్ళు మణులచే పొదగబడి విరాజిల్లు చుండెను. వేదికలు వజ్ర, వైఢూర్య ఖచితములై యుండెను.

*15.17 (పదిహేడవ శ్లోకము)*

*యత్ర నిత్యవయోరూపాః శ్యామా విరజవాససః|*

*భ్రాజంతే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివ వహ్నయః॥6876॥*
అచటి స్త్రీలు సర్వదా యౌవనముతో విరాజిల్లుచుండిరి. ఆ సుందరీమణులు వస్త్రాభరణములను ధరించి అగ్నిశిఖలవలె వెలుగుచుండిరి.

*15.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*సురస్త్రీకేశవిభ్రష్టనవసౌగంధికస్రజామ్|*

*యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః॥6877॥*

ఆ దేవాంగనల కొప్పులనుండి జారిపడిన నూతన సౌగంధిక పుష్పమాలల పరిమళములను వహించిన మందమారుతములు మార్గములను గుబాళింపుజేయుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*****************

కామెంట్‌లు లేవు: