28, ఆగస్టు 2020, శుక్రవారం

రామాయణమ్. 44

.
మంధర మాటల ప్రభావం తీవ్రంగా పనిచేస్తున్నది ! కైక మీద.
ఆమె ఆంతరంగంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నయి.
.
రాముడు రాజయితే? ఆ ఊహే భరింప శక్యంకాకుండా ఉన్నది ! తనకొడుకు అడవులుపట్టి పోవాల్సిందే! తాను కౌసల్యకు దాస్యం చేయాల్సిందే ! కౌసల్యను తాను ఎంత చిన్నచూపు చూసిందో ! ఇప్పుడు అంతకు అంత అనుభవించాలి .ఇంత బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఈ విధంగా ! ఆ తలపు తట్టుకోలేకపోతున్నది . జరగబోయే అవమానాలు తలచుకొని ఆమె గుండె చెదిరింది.తన ఉనికి ప్రశ్నార్ధకంగా మారబోతున్నది .
.
 ఇన్ని ఆలోచనలు ఆమె మానసాన్ని నిలువునా దహించి వేస్తున్నాయి !
.
 చీకటి ఆవరించి నక్షత్రాలు లేని ఆకాశము వలే ఉన్నది ఆమె అంతరంగము ! .
.
ఉవ్వెత్తున లేస్తున్న ఆలోచనలు ఆవిడను కుదురుగా ఉండనీయటంలేదు ! నేల మీద పడి దొర్లుతున్నది కైక!.
పగపట్టిన పాములాగ బుసలుకొడుతున్నది ,రుసరుసలాడుతున్నది ,వేడివేడి నిట్టూర్పు సెగలు ఆవిడ శరీరాన్ని కాల్చివేస్తున్నాయి!.
.
రాముడి అభిషేక వార్త బయట అందరికీ తెలిసిపోయింది.
.
 కైకకు తానుగా చెప్పకపోతే బాగుండదన్న ఉద్దేశంతో ఆవిడకు తెలియచేయాలని అంతఃపుర ప్రవేశం చేశాడు దశరధమహారాజు.
.
ఆశ్చర్యకరంగా అక్కడ కైక లేదు! తాను వచ్చేసమయానికి సర్వాంగసుందరంగా అలంకరించుకొని తీయగా తనను పలుకరించే ఇల్లాలు అక్కడలేదు ,ఆవిడ పెంపుడుచిలుకలు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి ! కైకలేని ఆ ఇల్లు చంద్రుడు,నక్షత్రాలు లేని ఆకాశంలా ఉన్నది.
.
ఎక్కడికి వెళ్ళింది కైక ? పరిచారిక లను అడిగాడు దశరధుడు.
వారు భయంభయంగా అత్యంత వినయవిధేయతలతో "మహారాజా కైకమ్మ తీవ్రమైన కోపంతో కోపగృహంలోనికి వెళ్ళారు" అని తెలియజేశారు .
.
ఆవిడ కనపడనందుకే ఆయన మనస్సును విచారం ఆవరించింది ఇప్పుడు ఆవిడ కోపగృహప్రవేశం ఆయన మనస్సును విషాదంతో నింపింది!.
.
ఆవిడ ఉన్నచోటుకు మెల్లగా వెళ్ళాడా వృద్ధనరపతి !
.
అక్కడ పెరికివేసిన లతలా! బంధింపబడిన ఆడులేడిలా! క్రిందకు పడిపోయిన దేవకాంతలాగ,తన ప్రాణేశ్వరి, యువతి అయిన కైక మూర్తీభవించిన శోకదేవతలా శోభావిహీనంగా కనపడ్డది.
.
ఆ స్థితిలో ఆవిడను చూసిన ఆయన మనస్సు వణికిపోయింది ,తానుకూడా క్రింద చతికిలబడి మృదువుగా ఆవిడ చేయి తన చేతిలోనికి తీసుకొని మెల్లగా నిమురుతూ ,ఏమి కష్టము వచ్చింది దేవీ నీకు ? ఆరోగ్యం సరిగాలేదా ! ఇప్పుడే రాజవైద్యులను పిలిపిస్తాను .
.
నీవు ఎవరికైనా ప్రియము చేకూర్చదలిస్తే చెప్పు ! ఇప్పడే తీరుస్తాను.
.
నీకెవరైనా అపకారం తలపెట్టారా చెప్పు! తక్షణమే దండిస్తాను .
.
నీకన్నా నాకు ప్రియమైనది ఏదీలేదు ! నేను నీవాడిని ! నీ ఆజ్ఞానువర్తిని .ప్రాణాలుఫణంగా పెట్టి అయినా నీ అభీష్టము నెరవేరుస్తాను. నా పుణ్యము మీద ఒట్టు వేసి చెపుతున్నాను అంటూ పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు దశరధమహారాజు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*******************

కామెంట్‌లు లేవు: