28, ఆగస్టు 2020, శుక్రవారం

**సౌందర్య లహరి**

**ఆది శంకరాచార్య విరచిత**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**

1వ భాగం

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్!!

మన ఆచార్యులవారు (ఆది శంకర భగవత్పాదులు) సామాన్యులకు మల్లేనే దేవాలయ సందర్శనములు, పూజాదికములు విధివిధానంగా చేసేవారు. వారి దైవీశక్తి వలన దేవతామూర్తుల సాన్నిధ్యం మరింత శక్తివంతమయ్యేది. దాని కొఱకై వారు కొన్ని దేవాలయాల్లో స్వయంగా యంత్రస్థాపనము కూడా చేశారు. పాదచారులై భారతావని నంతటినీ పావనం చేశారు. అటువంటి తీర్థయాత్రలలోనే ఒకసారి వారు పార్వతీ పరమేశ్వరుల సందర్శనార్థము కైలాసానికి వెళ్ళారు. ఆచార్యులవారే పార్వతీ పరమేశ్వరుల సమిష్ఠి అవతారమన్న విషయం మనం మఱవరాదు.

రామచంద్రుడు తాను స్వయంగా విష్ణుమూర్తి అవతారమయి ఉండి అదే విష్ణ్వంశ లేక అవతారమైన పరశురాముని కలిశాడు. కృష్ణుడు ఆయన సోదరుడు బలరాముడు ఇద్దరూ విష్ణ్వతారములే కదా! వారిద్దరూ ఒకేకాలం కలిసి కూడా ఉన్నారు. అవతారాలకు సంబంధించి ఇటువంటి ఆసక్తికరమైన అంశాలు అనేకం ఉన్నాయి.

ఇప్పుడు ఆచార్యులవారు తమ అవతారమునకు మూలమైన పార్వతీ పరమేశ్వరులను సందర్శించారు. పరమేశ్వరుడాయనకు అయిదు స్ఫటిక లింగములు, ఒక తాళపత్ర గ్రంథము ప్రసాదించాడు. కొందరు ఈ తాళపత్ర గ్రంథము అంబిక చేత ప్రసాదించబడిందని చెబుతారు. ఈ గ్రంథంలో అంబికపై వ్రాయబడిన నూరు శ్లోకములున్నాయి. కొందరు ఈ శ్లోకములు పరమేశ్వరుని చేతనే చేయబడినవంటే మరికొందరు లలితా సహస్రనామం వలె వశిన్యాది వాగ్దేవతలచేత పాడబడిందని అంటున్నారు. పరమేశ్వరుడే భక్తునిగా అంబికపై ఈ శ్లోకాలు చెప్పాడంటేనే ఎక్కువ ఉచితంగా ఉంటుందేమో!!

ఈశ్వరుడు ప్రసాదించిన అయిదు స్ఫటిక లింగములు తనవైన మూర్తులు, లింగమునకు చేతులూ, కాళ్ళూ, ముక్కూ, చెవులూ, కళ్ళూ లేక రూపారూపంగా ఉంటుంది. తాళపత్ర గ్రంథము అంబికా స్వరూపము. అంబిక మంత్రమూర్తి. ఈ గ్రంథములో అంబికకూ మంత్రశాస్త్రానికీ సంబంధించినది. ఏ రకంగా శివలింగము శివుని రూపమో ఈ గ్రంథం కూడా అడే విధంగా అమ్మవారి రూపమవుతుంది. కాబట్టి పరమేశ్వరుడు తన స్వరూపమైన స్ఫటిక లింగాలను ప్రసాదిస్తే అమ్మ తన రూపమైన గ్రంథాన్ని ప్రసాదించిందని చెప్పుకోవడం యుక్తంగా ఉంటుంది. ఇచ్చినవారూ, పుచ్చుకొన్నవారు, ఇచ్చినదీ మూడూ ఒక్క వస్తువే! ఇది ద్వైతాద్వైతముల కలయిక!

అట్టి అయిదు స్ఫటిక లింగములలో ఒకటి మన శ్రీ మఠంలో (కంచి కామకోటి మఠం) చంద్రమౌళీశ్వరుడనే పేరుతో అర్చించబడుతోంది. ఇది యోగలింగము. కేదారంలో ముక్తిలింగము, నేపాళంలో వరలింగము, చిదంబరంలో మోక్షలింగము, శృంగేరీలో భోగలింగము ప్రతిష్ఠించబడ్డాయి.

ఆచార్యులవారు ఈ అయిదు స్ఫటిక లింగాలనూ, తాళపత్రగ్రంథాన్ని తీసుకొని కైలాసం నుండి బయలుదేరారు. పార్వతీ పరమేశ్వరుల ఆరాధనా విధానాన్ని మరింత సుష్ఠుపరచాలని వారి ఉద్దేశ్యం. ఆచార్యులవారు కైలాసం నుండి బయటకు వెళుతుంటే ద్వారపాలకునిగా ఉన్న నందీశ్వరుడు చూచాడు. దేముడు వరమిచ్చినా పూజారి వరమీయడనే సామెత ఉన్నది కదా! పార్వతీదేవి అనుగ్రహించినా అంతటి మహోన్నతమైన మంత్రశాస్త్రము కైలాసంలో లేకపోవడం అన్నది ఆయనకు ఇష్టం లేదు. ఈ తాపం కోపంగా మారింది. ఆచార్యులవారి చేతినుండి తాళపత్ర గ్రంథాన్ని ఊడపెరుక్కున్నాడు. ఆచార్యుల వారెదురు చూడని సంఘటన ఇది. ఎక్కువ భాగం గ్రంథం నందికేశ్వరునికి చిక్కింది. మిగిలిన నలభై ఒక్క శ్లోకాలతో ఆచార్యులవారు బయటకు వచ్చారు.

ఇది వింటుంటే మీకందరికీ నందికేశ్వరునిపై కోపం వస్తున్నది కదా! మీ మనసులలో “అతడు ఆచార్యులవారి యెడ ఈ విధంగా ప్రవర్తింపనగునా? అంబిక ప్రచారం చేయడానికి అనుగ్రహించిన వంద శ్లోకాలలో ఏభైతొమ్మిది ఊడపెరుక్కోవడం న్యాయమా?” అన్న భావం వచ్చి ఉండవచ్చు. నాకు మటుకు నందికేశ్వరునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని తోస్తోంది

ఆచార్యులవారు జరిగినదానికి వ్యాకులితులైనారు. “అమ్మ మానవాళిపై దయతో వారికందించవలసినదని ఇచ్చిన పెన్నిధిలో ఎక్కువ భాగం పోగొట్టుకొనా.” అంటూ ధార్మిక ద్రవ్యానికి ఏర్పరచబడ్డ ధర్మకర్తవలె బాధపడ్డారు. మరి శంకరులు లోక శంకరులు. తమ జీవితంలో ప్రతి క్షణమూ మానవాభ్యుదయానికై వెచ్చించిన వారు మరి!!

ఆ సమయంలో అంబిక గొంతు వినిపించింది. “పోయిన ఏభై తొమ్మిది శ్లోకాలూ నీవే పూరించు. అదే నన్ను తృప్తి పరుస్తుంది. నీ వలనే ఈ కార్యం అవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఆ శ్లోకాలు పోయేట్లు చేశాను.” అన్నది అంబిక. అంతె! అదే క్షణంలో ఆనకట్టల తలుపులు తెరవగానే పడత్రోసుకొని వచ్చే మహానదీ ఉత్తుంగ ప్రవాహంవలె ఆచార్యులవారి ముఖం నుండి ఏభై తొమ్మిది శ్లోకాలు వెలువడ్డాయి. ఇవి అంబిక కేశాలు పాదాంత వర్ణనతో కూడినవి.

(సశేషం)

కృతజ్ఞతలతో🙏

🙏🙏🙏
సేకరణ

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
***************************

కామెంట్‌లు లేవు: