12, సెప్టెంబర్ 2020, శనివారం

బీజాక్షర వివరణార్థములు

:వృక్షము యొక్క విత్తు లాగానే బీజాక్షరము అనేది మంత్రము యొక్క బీజము లాంటిది. అది పఠించటము వలన సాధకునకు సకారాత్మక శక్తి(Positive energy) కలుగును. పఠించిన కొలది ఆ సకారాత్మక శక్తి(Positive energy) క్రమముగా వృక్షము మాదిరి వృద్ధిచెందును.

బీజమంత్రములు అనేవి స్పందనలు. ఆత్మయొక్క పిలుపులు. సృష్టి ఆరంభములోని స్పందనలు బీజాక్షర మంత్రములే. తొమ్మిది శబ్దములవరకు ఉన్నది బీజమంత్రము, తొమ్మిదికి మించినయడల మంత్రము అని, ఇరువది శబ్దములను మించిన మహా మంత్రము అని అంటారు.
అసలు సృష్టి ఆరంభములోని ప్రథమ స్పందన ‘ఓం’. అనగా ‘ఓం’ అనేది ప్రథమ బీజాక్షరము. ఆ ‘ఓం’ అనే ప్రథమ బీజాక్షరము క్రమముగా యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది. అవియే ‘ఐం’ ‘హ్రీం’ ‘శ్రీం’ ‘క్రీం’ ‘క్లీం’ ‘దం’ ‘గం’ ‘గ్లౌం’ ‘లం’ ‘వం’ ‘రం’ ‘యం’ ‘హమ్’ ‘రాం’ అనే బీజాక్షరములు. సంగీతములో కూడా ప్రథమముగా ఉన్నది ‘ఓం’ మాత్రమె. అది క్రమముగా ‘స’, ‘రి’, ‘గ’, ‘మ’, ‘ప’, ‘ద’, ‘ని’, గా ఉత్పత్తి చెందినది. వేణువు ఊదినప్పుడు వచ్చు మొదటి శబ్దము ‘ఓం’ మాత్రమె. యోగ బీజము, తేజో బీజము, శాంతి బీజము, మరియు రక్షా బీజము లుగా ఉత్పత్తి చెందినది.

ఓం:
‘ఓం’ మంత్రము త్రిమూర్తులు అనగా సృష్టి (బ్రహ్మ) లేదా ‘అ’ కారమునకు, స్థితి(విష్ణు) లేదా ‘ఉ’ కారమునకు, మరియు లయ (మహేశ్వర) లేదా ‘మ’ కారమునకు, లకు ప్రతీక. ‘అ’ కారము, ‘ఉ’ కారమునకు, మరియు ‘మ’ కారము మూడు కలిసినదే ఓంకారము. ‘అ’ కారము ఋగ్వేదమునకు, ‘ఉ’ కారము సామవేదమునకు, మరియు ‘మ’ కారము యజుర్వేదమునకు ప్రతీక. సృష్టి (బ్రహ్మ), స్థితి(విష్ణు) మరియు లయ (మహేశ్వర) మూడింటిని కలిపి మాయ అంటారు.

క్రీం లేదా ధం లేదా క్షం లేదా లం :
ఇది కాళీమాత మరియు కుబేర బీజాక్షరము. ఈ బీజాక్షర ఉచ్చారణ మూలాధార చక్రములో చేయవలయును. మూలాధార చక్రము పృథ్వీ తత్వమునకు ప్రతీక. తద్వారా ఇచ్ఛాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, బలము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

శ్రీం లేదా వం :
ఇది మహాలక్ష్మి బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ స్వాధిష్ఠాన చక్రములో చేయవలయును. స్వాధిష్ఠాన చక్రము వరుణ తత్వమునకు ప్రతీక. తద్వారా క్రియాశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆరోగ్యము, అంగములలో బలము, మూత్రపిండములు, చర్మము వ్యాధుల నుండి రక్షణ, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల భార్య లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

హ్రౌం లేదా దూం లేదా రం:
ఇది శివ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ మణిపురచక్రములో చేయవలయును. మణిపురచక్రము అగ్ని తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానశక్తి వృద్ధి చెందును. తద్వారా ఆత్మనిగ్రహశక్తి వృద్ధి చెందును. అకాల మరణము, చక్కర (diabetes) వ్యాధినుండి రక్షణ, మోక్షమునకు మార్గము లభించుట ఆరోగ్యము, అంగములలో బలము, అన్నివిధముల భౌతిక సఫలత, వ్యాపార లేక వృత్తిలో వృద్ధి, రోగములను నిరోధించు శక్తి, విచార లేక శోక నిర్మూలన, సౌందర్యముగల బార లభించుట, సంతోషకరమయిన దాంపత్య జీవనము, అన్నివిధముల సఫలత, మరియు నకారాత్మక శక్తులనుండి రక్షణ లభించును.

హ్రీం లేక ఐం లేక యం:
ఇది మహామాయ లేక భువనేశ్వరీ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ అనాహతచక్రములో చేయవలయును. అనాహతచక్రము వాయు తత్వమునకు ప్రతీక. తద్వారా బీజశక్తి(root power) వృద్ధి చెందును. తద్వారా ప్రాణశక్తి నియంత్రణ వృద్ధి చెందును. వాయుప్రకోపనముల (gastric disturbances) వ్యాధులనుండి రక్షణ, నాయక లక్షణములు కలుగుట ఏర్పడును.

గం లేక ఫ్రౌం లేక హమ్:
ఇది గణపతి, కుండలినీ, మరియు హనుమాన్ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ విశుద్ధ చక్రములో చేయవలయును. విశుద్ధ చక్రము ఆకాశ తత్వమునకు ప్రతీక. తద్వారా జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.

దం లేక ఓం:
ఇది విష్ణు బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ ఆజ్ఞా చక్రములో చేయవలయును. ఆజ్ఞా చక్రము కృష్ణ తత్వమునకు ప్రతీక. తద్వారా శుద్ధ జ్ఞానము, రక్షణ, ఐశ్వర్యము, సుఖము, సౌభాగ్యం, ఆరోగ్యము, సమస్త హృదయబాధల ఉపశమన, సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును.
క్ష్రౌం లేక రాం : ఇది నరసింహ బీజమంత్రము. ఈ బీజాక్షర ఉచ్చారణ సహస్రార చక్రములో చేయవలయును. తద్వారా సమస్త నకారాత్మక శక్తుల నిర్మూలన నివారణ కలుగును మరియు సాధకుడు స్వయముగా సాక్షీభూతుడు అగుతాడు.

కామెంట్‌లు లేవు: