30, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్ 106

 రామాయణమ్ 106

.

తండ్రి మరణవార్త విని మొదలు నరికిన చెట్టులా కూలపడి బాలుడిలా రోదించసాగాడు రాముడు.

నా తండ్రి లేని అయోధ్యతో నాకేమి పని ? అరణ్యవాసము అయిన పిదపకూడ నేను అయోధ్యలో కాలు పెట్టను.నాకిక మంచిమాటలు చెప్పేవారెవ్వరు? అయ్యో నేనెంత నష్ట జాతకుడను, నా వలన దుఃఖిస్తూ నా తండ్రి మరణించినాడే ! కడసారి చూపుకు కూడా నోచని వాడనైనానే ! భరతా ! నీవు శత్రుఘ్నుడు ఎంతో పుణ్యము చేసినారు కావున తండ్రిగారి అంత్యక్రియలు గావించగలిగినారు. అని దుఃఖిస్తూ ఉన్న రాముడికి కర్తవ్యం గుర్తు చేశాడు భరతుడు.

.

సుమంత్రుడు వెంటరాగా రామలక్ష్మణులు ఇరువురూ కొండదిగి మందాకినిని సమీపించారు. బురదలేకుండా నిర్మలంగా ఉన్న రేవు చూసుకున్నారు. సుమంత్రుడు సాయం చేయగా అందులో మునకలు వేసి తండ్రికి జలతర్పణాలు విడిచి.ఇంగుదీకాయలపిండితో పిండప్రదానము చేసి భారమైన హృదయంతో మరల కొండ ఎక్కి తమ పర్ణశాలను చేరుకున్నారు.

.

అక్కడ అన్నదమ్ములు మరల ఒకరి నొకరు కౌగలించుకొని బిగ్గరగా రోదించసాగారు. వారి రోదనలధ్వనికి మొత్తం అడవి అంతా కలతచెందింది.

.

ఏడుస్తున్న వీరిని తల్లులు దగ్గర చేరి ఓదార్చసాగారు.

.

కౌసల్యా మాత రాముని దగ్గరకు తీసుకొని ఆయన వంటికి అంటివున్న దుమ్ము ను మెల్లగా తుడుస్తూ ఆయన వీపు నిమరసాగింది.

.

రాముడు అంత అక్కడ కు వచ్చియున్న జనులందరినీ పలకరించి కొందరిని కౌగలించుకొని వశిష్ఠమహర్షికి పాదాభివందనం చేసి ఆయన ప్రక్కన కూర్చున్నాడు.

అప్పుడు భరతుడు ,లక్ష్మణ,శత్రుఘ్నులు అందరూ అన్నప్రక్కనే ఆసీనులైనారు.

.

నిశ్శబ్దం తాండవిస్తున్నది అందరు జనమంతా కూడా రాముడు ఏం చెపుతాడా అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు.

.

ఆ రాత్రి అంతా మరల రోదనలతోనే గడచిపోయింది! 

మెల్లగా అందరూ హోమజపాదులు పూర్తిచేసుకొని మరల రాముని వద్దకు చేరారు.

.

మౌనాన్ని చీలుస్తూ భరతుడు అన్నమాటలు అందరికీ వినిపించాయి.

.

అన్నా ! నా తల్లిమాట మన్నించి నాకు రాజ్యమును ఇచ్చావు .దానిని నీకే తిరిగి ఇచ్చివేయుచున్నాను .స్వీకరించు ! నిష్కంటకమైన రాజ్యాన్ని ఏలుకో! సువిశాలమైన ఈ సామ్రాజ్యాన్ని ఏలగల సమర్ధుడవు నీవే ! మాకెవ్వరికీ అంత సమర్ధత లేదు.

.

నీ గమనము గరుడపక్షి వంటిది మేమో మామూలు పిట్టలవంటి వారము .నిన్ను అనుసరించే శక్తికూడా లేని వారము.అని భరతుడు పరిపరివిధాలుగా అన్నను ప్రార్ధించాడు,రోదించాడు

.

అప్పుడు రాముడు, భరతా!నీవు ఈ విధంగా రోదించడం తగదు.

.

మనిషికి స్వాతంత్ర్యము కానీ, తన ఇష్టము వచ్చినట్లు పనులు చేసే సామర్ధ్యము కానీ లేవు. ప్రతి ఒక్కడినీ దైవము అటూ ఇటూ లాగుతుంటుంది.

.

ఎంత పోగు చేసుకున్నా ధనము నశిస్తుంది ఎంత ఉన్నతి పొందినా ప్రతిఒక్కడునూ పతనము చెందవలసినదే .( you can't always be on the crest of success). 

.

మనుష్యుల పరస్పర సంబంధాలు విచ్ఛిన్నం అయితీరవలసినదే! 

పుట్టిన వాడు మరణించవలసినదే! 

( Inevitabilities of LIFE).

.

పండిన పండ్లకు చెట్టునుండి రాలిపోవడమే భయము.

అట్లే పుట్టిన మనిషికి గిట్టుట ఒకటే భయము.

.

ఎంత బ్రహ్మాండమైన ఆకాశహర్మ్యాలు దృఢమైనవి అని నీవు అనుకుంటూ నిర్మించినా కొంతకాలానికి జీర్ణమై ,శిధిలమై కూలిపోవలసిందే! .

.

కాలానికి జీర్ణము చేసే శక్తి ఉన్నది ! 

గడచిన రాత్రి తిరిగి వస్తుందా!.

.

మనిషిని ఆతనిమృత్యవు ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది అది అతనితోటే కలిసి కూర్చుంటుంది ,కలిసి ప్రయాణం చేస్తుంది.

.

ముఖము ముడుతలు పడి ,వెంట్రుకలు నెరిసి,శిధిలమైపోతున్న శరీరాన్ని మనిషి తిరిగి సమర్ధవంతంగా చేసుకోగలడా! అది ఎవరి వల్లా కాదు.

.

సూర్యోదయమవ్వగనే పనులు చేసుకుంటూ చీకటి పడగానే నిద్దురిస్తూ ఉన్న మనిషి కాలంగడిచిపోతున్నది అనే విషయాన్ని మాత్రం గమనించలేకున్నాడు.

.

ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి దానితోపాటే ప్రాణుల వయస్సు కూడా క్షీణిస్తున్నది.

.

ఒక ప్రవాహంలో కొన్ని కట్టెముక్కలు కలిసివెడుతున్నాయి కాస్తదూరము వెళ్ళగానే అవి విడిపోయి కనపడుతున్నాయి. కాలప్రవాహంలో జీవనగమనంలో బంధువులూ ,స్నేహితులూ,భార్యాపుత్రులూ అలాంటి కట్టెముక్కల లాంటి వారే! అందరూ విడిపోక తప్పదు.

.

మన తండ్రి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గము చేరుకున్నాడు.

మన తండ్రి నన్ను ఏమి చేయమని ఆజ్ఞాపించినాడో అది మాత్రమే నేను పాటిస్తాను.

.

దశరధమహారాజు మన తండ్రి, మన బంధువు .అది రాజాజ్ఞ! దానిని పాటించి తీరవలసినదే ! అదే ధర్మము! మన తండ్రి ఆజ్ఞను మనము పాటించవలసినదే !ఆయన ఆజ్ఞ  తిరుగులేనిది అని చెప్పి ముగించాడు రాముడు.

.

వూటుకూరు జానకిరామారావు 


.

కామెంట్‌లు లేవు: