30, అక్టోబర్ 2020, శుక్రవారం

రామాయణమ్.107

 రామాయణమ్.107

.

రామా ! నిన్ను దుఃఖము బాధించదు ,

సుఖము సంతోషపెట్టదు .

నీలాంటి వాడు ముల్లోకాలలో ఎవడైనా ఉన్నాడా? 

నీవు పెద్దలను గౌరవించే స్వభావము 

కలవాడవు .

నీ సంశయములను పెద్దలవద్ద నివృత్తి చేసు సుకొనుటకు వారి వద్దకే వెళ్ళి వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటావు..

.

బ్రతికిఉన్నవారిపట్లకానీ,

మరణించినవారిపట్లకానీ ,

మంచివాడి విషయంలోకానీ,

చెడ్డవాని విషయంలోకాని 

రాగద్వేషాలు లేని బుద్ధి నీది 

అట్టి నీకు ఈ లోకంలో దుఃఖము కలిగించేది ఏది?

.

ఓ మహాత్మా ! రామా! నీకు దేవతలతో సమానమైన బలమున్నది,సత్యప్రతిజ్ఞ ఉన్నది,

అన్నీ తెలిసినవాడవు,బుద్ధిమంతుడువు

 నీ వంటి వాడు ఇంత కష్డపడవలసిన అవసరములేదు.

.

నేను ఇంటలేనప్పుడు నా తల్లి చేసిన పాపకార్యమునకు నా సమ్మతి లేదు. అది నాకు ఎంత మాత్రము ఇష్టము కాదు .నన్ను అనుగ్రహింపుము.

.

ధర్మమునకు భయపడి మాత్రమే తీవ్రమైన దండనకు అర్హురాలైన నా తల్లిని దండింపకున్నాను. లేనిచో వధించియుండెడి వాడను.అది లోక నిందితమైన అకార్యము ! .కావున చేయజాలకున్నాను.

.

మన తండ్రి దశరథ మహారాజు నాకు గురువు ,క్రియాశీలుడు,వృద్ధుడు,ఇప్పుడు మరణించినాడు కావున నిందించలేకున్నాను.

.

ఓ రామా ధర్మము నీకు తెలుసు ! ధర్మజ్ఞుడైన వాడు ఎవడైనా ఒక ఆడుదానిని సంతోషపెట్టడానికి పాప కార్యాలు చేస్తాడా? 

వినాశ కాలే విపరీత బుద్ధి! వినాశము దాపురించింది కాబట్టే ఆయనకు ఈ బుద్ధి కలిగింది.

.

నీకు కర్తవ్యమేదో అకర్తవ్యమేదో బాగా తెలుసు .నీవు మన తండ్రిగారు చేసిన ధర్మవిరుద్ధమైన కార్యమును వెనుకకు మరల్చుము.

.

రామా ! అరణ్యవాసమునకు ,క్షత్రియధర్మమునకు ఎక్కడైనా పోలిక ఉందా? 

జటలు ధరించి తాపసవృత్తిలో సుక్షత్తియుడైన నీవంటి వాడు రాజ్యపాలనము చేయకుండ ఉండవచ్చునా?

.

నేను విద్యచేత,స్థానముచేత,పుట్టుక చేత,నీకంటే చిన్నవాడనయ్యా! నెనెట్లా పరిపాలించగలనని అనుకున్నావు? నేను నీ దాసుడను .నీవు లేకున్నచో జీవించవలెనని కూడ నేను అభిలషించను .

.

ఓ రామా ! ఇప్పుడే నిన్ను రాజ్యాభిషిక్తుడను గావించడానికి పురోహితులంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

.

నేను శిరస్సు వంచి ప్రార్ధిస్తున్నాను నా మీద దయచూపు!

.

అని నీరునిండిన కనులతో రాముడిని వేడుకుంటున్నాడు భరతుడు.

.

భరతుండెంతగా ప్రార్ధించినప్పటికీ తండ్రి మాటమీదనే స్థిరముగా నిలిచాడు రామచంద్రుడు.

.

వూటుకూరు జానకిరామారావు 


రామాయణమ్. 108/109

..

రాముడు గంభీరంగా చెపుతున్నాడు.గొంతులో ఒక స్థిరత్వం మాటలో పటుత్వం కలగలసి వస్తున్నాయి. ఆయన వాక్కులు దృఢంగా ఉన్నాయి..

.

నీచులు ,క్రూరులు,పాపాత్ములు,దురాశాపరులు,సేవించేటటువంటిది అధర్మముతో నిండినదీ అయిన క్షత్రియధర్మమును నేను పరిత్యజించెదను.

.

మనిషి చేసే పాపము, ముందు అతని మనసులో పుడుతుంది, ఆతరువాత శరీరము ఆ పాపకర్మ చేస్తుంది .

.

 నాలుక అబద్ధమాడుతుంది . ఈ విధముగా పాపము మూడు విధాలుగా ఉంటుంది. ..

ఒకటి .మానసికము,,

రెండు..శారీరికము.,, మూడు ..వాచికము.

.

జాబాలీ ! నీవు శ్రేష్ఠము అని నాకు చెప్పినదంతా కూడా చెడ్డదే!

.

నా తండ్రిగారి ఎదుట చేసిన ప్రతిజ్ఞ కాదని ఇప్పుడు భరతుడి మాటలను ఏల పాటించగలను?

.

నా తండ్రి ఎదుట చేసిన ప్రతిజ్ఞ స్థిరమైనది! అప్పుడు కైకేయీ దేవి కూడ సంతసించినది.

.

నేను పరిశుద్ధుడనై ,మితభోజనము చేయుచు ,పవిత్రములైన కందమూలఫలములతో ,పితృదేవతలను తృప్తి చెందించుతూ ,సంతుష్టి చెందిన పంచేద్రియములు కలవాడనై ,కపటము విడనాడి(Without Hypocrisy)

శ్రద్ధావంతుడనై కార్యాకార్యములు తెలుసుకుంటూ వనవాసజీవితము గడిపెదను.

.

దేవతలందరును ధర్మసమ్మతమైన శుభకార్యములు చేయుటవల్లనే ఆయా పదవులు పొందగలిగారు.

.

నాస్తికత్వముతో కూడిన జాబాలి మాటలను నిర్ద్వంద్వముగా ఖండించాడు రాముడు .

.

అసలు నీలాటి వారిని చేరదీసిన నా తండ్రిని నిందించవలె నిన్నుకాదు .

సత్యము ,ధర్మము,పరాక్రమము,భూతదయ,ప్రియవాక్కు,

దేవబ్రాహ్మణ ,అతిధులపూజ ..ఇవి స్వర్గానికి మార్గములని సత్పురుషులు చెపుతున్నారు.

.

రాముడి ఆగ్రహన్ని చూసిన జాబాలి ,రామా! నేను నాస్తికుడను కాను నిన్ను అయోధ్యకు మరల్చవలెననే ఉద్దేశ్యము తప్ప వేరే ఏదియును లేదు. 

.

రాముడికి కోపము వచ్చినదని గ్రహించిన వశిష్ఠులవారు ఆయనకు ఇక్ష్వాకుల చరిత్ర అంతా తెలిపి ,ఇక్ష్వాకులలో జ్యేష్ఠుడే రాజు ! అదే ధర్మము అని తెలిపి శాంతింపచేశారు.అతి ప్రాచీనమైన మీ కుల ధర్మాన్ని నీవు చెరచవద్దు అని హితబోధ చేశారు.

.

రామా నేను నీకు, నీ తండ్రికి ఆచార్యుడను ,నేను చెప్పిన విధముగా చేసినచో నీవు ధర్మమార్గమును అతిక్రమించినవాడివి కాజాలవు.

.

జానకిరామారావు వూటుకూరు



.

కామెంట్‌లు లేవు: