30, అక్టోబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 65*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 65*

                                  *****

      *శ్లో:- శబ్దాదిభిః పంచభి రేవ పంచ ౹*

             *పంచత్వ మాపు: స్వగుణేన బద్ధా:౹*

             *కురంగ మాతంగ పతంగ మీన ౹*

            *భృంగా నరః పంచభి రంచితం కిమ్?*

                                     *****

*భా- మానవ జీవన పురోగతికి, అథోగతికి  కారకాలు పంచేంద్రియాలే. ఒక్క ఇంద్రియానికి వశమైతేనే ప్రాణాన్ని పోగొట్టుకొంటున్న సందర్భాలు కోకొల్లలు. 1. "శబ్దము"(చెవి):- "లేడి"  శ్రవణపేయమైన మృదుమధుర వేణుగానామృతరసాస్వాదనలో పడి, వేటగానికి చిక్కి బలైపోతోంది.2. "స్పర్శ"(చర్మము):- "మదపుటేనుగు" ఆడయేనుగు యొక్క శారీరక తాకిడి సుఖానికి ఆశపడి, వేటగాడు ఏర్పాటుచేసిన కందకంలో కూరుకుపోయి బందీ అవుతోంది.3. "రూపము"(కన్ను):- "మిడత" భగభగ మండే మంటల కాంతి సొబగులకు ప్రలోభపడి,  మోహంతో  వాటిలోకి  దూకి తనకు తానే అంతరించిపోతోంది.4."రసము"(నాలుక):- "చేప" జిహ్వచాపల్యంతో "ఎర " కోసం ఆశపడి, జాలరివాని గాలానికి చిక్కి, జీవితాన్ని అర్పణ చేసికొంటోంది.5. "గంధము"(ముక్కు):- "తుమ్మెద" పరిమళ భరితమైన పుష్పాలలోని  మకరందానికి ఆశపడి, సూర్యాస్తమయసమయంలో ముకుళితపుష్పంలో చిక్కుపడి, అంతమౌతున్నది. ఈ విధంగా ఒక్క ఇంద్రియానికి లోబడితేనే పరిస్థితి ఇలా ఉంటే , ఇక పంచేంద్రియాలన్నింటికి దాసానుదాసుడై, బ్రహ్మానంద, పరమానందపరవశు డౌతున్న  "పాపం మానవుని" గతి యేమి కానున్నదోగదా! ఇంద్రియాలను ఆధీనంలో  పెట్టుకొని, గెలువజాలిన "జితేంద్రియుడ"వడానికి   యమ నియమాలతో సాధన చేయాలని సారాంశము.*

                                    *****

                      *సమర్పణ  :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: