30, అక్టోబర్ 2020, శుక్రవారం

పోత‌న త‌ల‌పులో...98

 పోత‌న త‌ల‌పులో...98


క‌మలాక్షుడి గొప్ప‌ద‌నాన్ని గురించి నారదుడికి చెబుతున్నాడు బ్ర‌హ్మ‌.....

              **

కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె

వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం

జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.

             **


 నారదా! అటు కారణాలకు, ఇటు కార్యాలకు అన్నిటికి కారణభూతుడైనవాడు ఆ కమలాక్షుడే. ఆయన కంటే ఇతరు లెవరూ ఆశ్రయింపదగిన వాళ్లు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, తుది లేనివాడు, ప్రపంచసృష్టి గావించే ఉదారుడు అయిన ఆ పరమాత్ముని సద్గుణ పుంజాలను గొప్ప మనస్సుతో కొనియాడాలి. లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు.


                    **

నిగమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా

భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్ర రా

జి గరిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్;

జగతిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁ బుత్రకా!

                     **

 నారద! ఈ భాగవతం అనే పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై వుంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలంన్నిటి కంటె శ్రేష్ఠమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. నీవు దీన్ని లోకంలో బహు విస్తృతమైన కృతిగాకావించుము.


                     **

వనజాక్షు మహిమ నిత్యము

వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో

ననుమోదించుచు నుండెడు

జనములు దన్మోహవశతఁ జనరు మునీంద్రా!"

                              **


నారదా... ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ వుంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసే వాళ్లు దేవుని మాయకు లోనుగారు.


                         **

ఇలా ..పూర్వం బ్రహ్మదేవుడు ఋషీశ్వరుడైన నారదునికి భాగవత ముఖ్యకథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీశ్వరుడైన శుకుడు మహా భక్తితో పరీక్షిన్మహారాజుకు తెలియజెప్పాడు.


🏵️పోత‌న ప‌దం🏵️

🏵️ప‌ర‌మ పావ‌నం🏵️

కామెంట్‌లు లేవు: