24, నవంబర్ 2020, మంగళవారం

రామాయణమ్ 133

  రామాయణమ్ 133

.......

ఇప్పుడేకదా నీవెంట మహావీరులైన రాక్షసులను పంపాను ఇంతలోనే ఏమయ్యిందే నీకు మళ్ళా ఏడుస్తున్నావు అని కోపంతో అన్నాడు ఖరుడు .లేలే నీకేమీ భయములేదు నేనున్నాను నీకు అధైర్యము వద్దు ఏమిజరిగిందో చెప్పు అన్నాడు.

.

అవును ఇంతక్రితమే నీవు నాతొ పద్నాలుగు మంది మహాశూరులను పంపావు కానీ వారందరినీ క్షణకాలంలో చంపివేశాడా మానవుడు. ఆతని యుద్ధరీతి చూస్తే నాకేదో భయంగా ఉన్నది .ఏమో ఎటునుండి ఏ ప్రమాదము రానున్నదో అని భీతికలుగుతున్నది.

.

నేను విషాదమనే  మొసలి 

భయము అనే తరంగాలు కలిగిన 

దుఃఖము అనే సముద్రములో మునిగి ఉన్నాను

నన్నెందుకు రక్షింపవు నీవు?

నీకు రాక్షసులయందు జాలి ఉన్నట్లయితే

 ఆ రాక్షస కంటకుడిని ఎదిరించు.

.

నీకు శక్తీ ,తేజస్సు ఉంటే ఆ రాముడిని చంపేసి నా కోపము చల్లార్చు.లేనిపక్షములో నేనిప్పుడే నీ ముందే ప్రాణాలు విడుస్తాను.

.

నీకు ఆపని చేతకాకపోతే ఇక్కడనుండి పారిపో అని రెచ్చగొడుతూ  పొట్ట బాదుకుంటూ బావురుమని ఏడ్చింది.

.

అప్పుడు ఖరుడు రోషముతో ,శూర్పణఖా ఇదిగో ఇప్పుడే చెపుతున్నాను ఈ గండ్ర గొడ్డలితోనే వాడి తల నరుకుతాను.

 అప్పుడు వాడి కంఠం నుండి పొంగుతూ బయటకు వచ్చే వెచ్చని నెత్తురు ఆనందముగా త్రాగుదువుగాని.

.

తన సేనాని అయిన దూషణుని వైపు తిరిగి నీవు వెంటనే పద్నాలుగువేలమంది మహావీరులు,శత్రు భయంకరులు అయిన సైనికులను సిద్ధం చేయి  అని ఆజ్ఞాపించాడు.

.

వీరులైన రాక్షసులు వెంటరాగా రాముడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు ఖరుడు.

.

వాడు బయలుదేరగానే ఆ సైన్యము మీద అమంగళకరమైన రక్తము వర్షించింది. 

ఒక పెద్ద రాబందు వచ్చి వాడి ధ్వజాన్ని ఆక్రమించి రధము మీద కూర్చున్నది..

ఖరుడి ఎడమ భుజము అదిరింది.అయినా ఇవి ఏవీ లెక్క చేయక రణ ఉత్సాహము ఉప్పొంగుతుండగా ముందుకు కదిలాడు వాడు 

.

జానకిరామారావు వూటుకూరు.

కామెంట్‌లు లేవు: